సమాజ కృతజ్ఞత తీర్చుకోవాలి!

by Ravi |   ( Updated:2023-04-23 19:15:54.0  )
సమాజ కృతజ్ఞత తీర్చుకోవాలి!
X

ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యం విపరీతంగా పెరిగినంక మనిషిలో మమకారం తగ్గిపోతున్న కాలం చూస్తున్నాం. ఎదగాల్సిందే వృద్ధిలోకి రావాల్సిందే, సంపద సృష్టించాల్సిందే కావచ్చు గానీ మానవ సంబంధాలు బలహీన పడకూడదు కదా! సరిగ్గా ఇప్పుడు ఇదే జరుగుతుంది. పైగా అహంకారం పెరిగిన తర్వాత స్నేహ సంబంధాలు కూడా తెగిపోతున్నాయి. బంధువులతో కూడా తమాషాలు లేకపోతే కాస్తా దూరంగానే ఉన్నట్టు కనిపిస్తుంది.

విలువల పట్ల చులకన భావం

గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత అంతా డబ్బుతోనే ముడిపెట్టి కొలుస్తున్నారు. భూములు జాగలు కల్గిన వాల్లకు ఆస్తుల విలువ విపరీతంగా పెరిగింది. ఉద్యోగాలు ప్రైవేట్‌వైనా, ప్రభుత్వానివైనా చేస్తున్న వాల్లకు వేతనాలు వస్తున్నాయి. గ్రామాల్లో కూలినాలి చేసికునేటోల్లకు ఇతర పనులకు పోయేవాల్లకు కూడా వేతనంతో కొనుగోలు శక్తి పెరిగింది. దీంతో జీవన ప్రమాణంలో గతంలో కంటే కాస్తా వ్యత్యాసం పెరిగి ఉన్నతీకరించబడ్డది. కొందరికి విలువల పట్ల చులకన భావం పెరుగుతుంది. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగామో ఆ మూలాలను మూలస్థంభాలను మరచిపోతున్న సందర్భంలో ఉన్నాము. నైతిక విలువలు, ప్రేమ విలువలు ఇట్ల ఉండాలని చెప్పేవాల్లు కరువు అవుతున్నారు. చిన్ననాటి ఊరును, తనతో కలిసి చదువుకున్న వాల్లను, తన కాల్లనూ పెరిగిన హోదా పేరుతో చూసి చూడనట్టుగా తయారయ్యే తరం తయారు అవుతున్నది. ఇట్లా అంతటా ఉన్నారు అని కాదు అక్కడక్కడ ఎక్కువే ఉంటారు.

మరికొందరు పాత మిత్రులను, పాత సహచరులను తరచూ కల్సుకొంటారు లేదా కల్సినప్పుడు ఆత్మీయంగా పలకరించుకుంటున్నారు. అవసరమైన సహాయాలు చేసికుంటారు. ఒక ప్రేమ పూర్వక వాతావరణం ఆవిరిస్తది.

వితరణశీలత ఉండాలి..

సమాజంలో మొదటి నుంచి ఉన్నోల్లు లేదా తర్వాత సంపద కల్గినోల్లు ఉంటారు. వాల్లలో ఇతరులకు ఏదైనా సహాయం చేయాలి అనే భావన కూడా ఉండాలి. తాను చదువుకున్న పాఠశాలకు ఆర్థికంగా సహాయం చేయడం తను పుట్టిపెరిగిన ఊరులో సామాజిక కార్యక్రమంలో పాల్గొనడం చేసినప్పుడే సమాజం మంచి వాతావరణంతో ముందుకుపోతుంది. తను సమాజం నుంచి పొందిన తర్వాత తిరిగి కృతజ్ఞత తీర్చుకోవడం ఏదైనా ఇవ్వడంలోనూ గొప్ప తృప్తి ఉంది. ఎప్పుడూ తీసికోవడమే కాదు నా వల్ల ఇంతమంది అనాథలకు భోజనాలు పెడుతున్న, ఇదిగో ఇంతమందికి స్కూల్ కాలేజీ ఫీజు చెల్లిస్తున్నాను, ఇన్ని జంటలకు పెళ్లిల్లు చేశాను అనే ఒక ఆలోచనల పరంపర కొనసాగాలి.

ఒక్క డబ్బు సంపాదన పరులే కాదు రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు పొంది ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు కూడా, రిజర్వేషన్‌లో పోటీ వల్ల దొరకని నవతరానికి సహాయం చేయాలి. ఎవరైతే లబ్దిపొందుతరో ఇతరులకు ఆ అవకాశం ఇవ్వాల్సి ఉంది. అప్పుడు అందరూ సమాన జీవన స్రవంతిలో కలుస్తారు. నా చిన్ని బొజ్జకు శ్రీరామరక్షలా భావించి ఊరుకుంటే కాదు, ఆ రోజుల్లో అన్ని వర్గాలు, వర్ణాలు వృద్ధిలోకి రావాలనే కృషివల్లనే తాము ఈ స్థితిలో ఉంటే, తనలాగ తన వాళ్లను వృద్ధిలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉన్నది.

ఏదైనా సమాజంలో అసమానతలు లేకుండా సర్వ సమానంగా ఉన్నప్పుడే ఈ ఘర్షణలు, మనుషుల మధ్య వైర వాతావరణం ఉండవు. సమానత్వం కోసం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉన్నది.

అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story

Most Viewed