అంతరంగం: పాఠకుడు మహాపాఠకుడై వివరించిన కవిత్వ సారం

by Ravi |   ( Updated:2023-02-20 03:07:58.0  )
అంతరంగం: పాఠకుడు మహాపాఠకుడై వివరించిన కవిత్వ సారం
X

సాహిత్యం చదువుకున్నోళ్ళు అంతా సాహిత్య సృష్టి చెయ్యరు. సాహిత్య విద్యార్ధులుగా కథ కవిత్వం విమర్శ అలంకారాలు నిర్మాణ పద్ధతులు రీతులు అన్నీ తెలుస్తాయి. ఏది బాగుంది ఏది బాగాలేదు ఎందుకు మంచిగా లేదు ఇట్లాంటి విషయాల పట్ల అవగాహన అధికంగా ఉంటది. కానీ రాయడానికి ఇష్టపడరు. సాహిత్య సృజనకారులందరూ విద్యార్థులుగా సాహిత్యం చదవకపోవచ్చు కానీ సృజనావసరం రీత్యా అధ్యయనం చేస్తారు. అట్లాగే చాలామంది కథలు కవిత్వం నవలలు మస్తు చదువుతరు ఆ చదవడంలోనే వాల్లు అనుభూతి చెందుతారు. ఏ పుస్తకమైనా చదివి తీరాల్సిందేననే పట్టుదలతో ఉండే పాఠకులు ఉంటారు. ఆ పాఠకులే మహాపాఠకులైతరు. కాలం కల్సి వస్తే వాల్లే చదివిన పుస్తకంపై వ్యాఖ్యానం చేస్తరు. అదిగో అటువంటి గొప్ప సాహిత్య వాఖ్యాత అన్నాడి గజేందర్ రెడ్డి. ఆయన తెలుగు సాహిత్యం చదువుకున్న స్నాతకోత్తర విద్యార్థి. అనంతర కాలం కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేసి ప్రధానాచార్యులుగా ఉద్యోగ విరమణ పొందారు.

కరోనా కాలం ఎందరినో కష్టాలు పెట్టింది. కన్నీళ్లు పెట్టించింది. ఇంట్లోనే నిర్బంధంలో ఉండాల్సిన గడ్డు కాలంలో ఎందరినో తిరిగి సాహిత్య సృజనలోకి మరల్చింది. అట్లానే అన్నాడి గజేందర్ రెడ్డి కూడా కరోనాలో మొదలుపెట్టి చదివిన ప్రతి పుస్తకాన్ని రాయడం మొదలుపెట్టాడు. అట్లా రాసిన వ్యాసాలు 'వెలుగు' దాదాపు వారం వారం వెలుగు చూసాయి. ఆ తర్వాత 'వెలుగుల వెల్లువ' అనే పుస్తకం బయటకు వచ్చింది. ఈ పుస్తకంలో తాను చదివి రాసిన పుస్తకాల్లోంచి ముప్పైమూడు కవిత్వ పుస్తకాల కవిత్వాన్ని పుస్తకంగా వెలువరించారు. రాయడం అచ్చుకావడం అనుభవంతో నిరంతర అధ్యయనం మొదలై నేటి నిజం ఇతర పత్రికల్లో తన వ్యాసాలు అచ్చు అయ్యాయి. అన్నీ కలిపి ఒక సమీక్షల పుస్తకం వెలువడింది.

గజేందర్ రెడ్డి కవిత్వ పరామర్శ చాలా సూటిగా ఉంటది. మొత్తం పుస్తకాన్ని అధ్యయనం చేసి అందులో కవిత్వాన్ని కవిత్వ స్ఫూర్తిని పట్టుకుంటాడు. కవి గూర్చి కవిత్వల గూర్చి నాలుగు మంచి ముచ్చట్లు రాసి ఆ పుస్తకాన్ని పదిమంది చదివేటట్లు ఆసక్తి కలిగిస్తాడు. తాను ఎక్కువగా సాహిత్య సభలో శ్రోతగా పాల్గొంటారు. ఎన్నో ఏళ్ల నుంచి కవిత్వాల కథలు పుస్తకాలు విరివిగా చదువుతారు. కరోనా విరామ సమయం ఆయనలోని విమర్శకున్ని నిద్ర లేపింది. విమర్శనా సూత్రాలు తెల్సిన సాహిత్య అధ్యయన కారుడైనందున తన వ్యాసం రచయితగా ప్రోత్సహకంగా ఉండేది. ఇట్లా తాను నందిని సిధారెడ్డి, ఏనుగు నర్సింహారెడ్డి, కందుకూరి శ్రీరాములు, నలిమెల భాస్కర్, జింబో మొదలు అన్నవరం దేవేందర్, పెనుగొండ నరసిజ, గాజోజు నాగభూషణం, దేవనపల్లి వీణావాణి, స్తంభం కాడి గంగాధర్, కళ్యాణం శ్రీనివాస్, వారాల ఆనంద్, గడ్డం శ్యామల, బీవీఎన్ స్వామి పుస్తకాలను పరిచయం చేశారు.

ఈ పుస్తకం చదివితే ఇందులోని వ్యాసాల మూలాల పుస్తకం చదవాలనే ఆసక్తి పాఠకుల్లో కల్గుతుంది. ఇటీవలి కాలంలో తక్షణమే కవులం అయిపోవాలి అనే యావ చాలామందిలో కన్పిస్తోంది. అధ్యయనమే ఉండదు. పదాలు వాక్యాలుగా పేర్చుతున్న కవిత్వం వస్తుంది. ఫేస్‌బుక్ వాట్సాప్ నుంచి అది పుస్తకం రూపం తీసికొని తర్వాత వాల్లే విమర్శకుల అవతారం ఎత్తుతున్నారు. ఇటువంటి ఇన్‌స్టంట్ కవిత్వ విమర్శల కాలంలో గజేందర్ రెడ్డి అధ్యయనం చేసి రాసిన 'వెలుగుల వెల్లువ' మంచి పుస్తకం

అన్నవరం దేవేందర్

94407 63479

Also Read..

సమీక్ష: గౌరహరి దాస్ కథలు


Advertisement

Next Story