అంతరంగం: సంఘ సంస్కరణల కథల శిల్పి రేగులపాటి కిషన్ రావు

by Ravi |   ( Updated:2023-01-09 02:34:10.0  )
అంతరంగం: సంఘ సంస్కరణల కథల శిల్పి రేగులపాటి కిషన్ రావు
X

అంతరంగం రాసేందుకు అంశం గూర్చి ఆలోచిస్తుంటే రేగులపాటి కిషన్ రావు పరమపదించిన వార్త తెలిసింది. కిషన్‌రావు అవిభాజ్య కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ రచయిత. కథలు, నవలలు, కవిత్వం అభ్యుదయ దృక్పధంలో రాసిండు. దొరతనపు సామాజిక నేపథ్యంలో పుట్టినా సంఘసంస్కరణ, దోపిడీ, పీడన, హేతువాద భావనలో కథలు రాసారు. 4 నవలలు 6 కథాసంపుటాలు 13 కవిత్వ సంపుటాలు 4 వ్యాసాల పుస్తకాలు వెలువరించారు. ఆయన 1946 డిసెంబర్ 1న సిరిసిల్ల దగ్గర చింతల ఠాణాలో పుట్టారు. ఇప్పుడు ఆ వూరు మిడ్ మానేరు ముంపుకు గురైంది. కరీంనగర్‌లో స్థిరపడ్డారు 1970 నుంచి 2004 వరకు 34 సంవత్సరాలు ఆదర్శ ఉపాధ్యాయునిగా పలు పాఠశాలల్లో పనిచేశారు. కిషన్‌రావు గారి వ్యక్తిత్వం చాలా భిన్నమైనది. నెమ్మదైన స్వభావం స్నేహశీలి సామాజిక ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. 1980 ప్రాంతంలోనే రంగనాయకమ్మ ప్రభావంతో భాగవతం పై విమర్శన గ్రంథం 'భాగవత విషసర్పం' వెలువరించారు. దీనికి రంగనాయకమ్మ ముందు మాట రాశారు.

ఎన్నో పుస్తకాలు, నవలలు

1976లో తొలిసారిగా తాను ' ఆమె వితంతువు కాదు' నవల వెలువరించారు. ఇది ఆ కాలంలో తొలి స్త్రీవాద రచన. దీనికి పీఠిక 'ఇవన్నీ చదివితే చచ్చిపోమా' అనే వ్యగ్యం తానే రాసుకున్నాడు అనంతరం రెండేండ్లకే 'పతివ్రత ఎవరు - వాణిశ్రీ' నవల వెలువరించారు. అట్లాగే 1981లో సంఘర్షణ 1982లో ప్రేమకు పెళ్ళెప్పుడు నవలలు వచ్చాయి. 1970, 80 ప్రాంతంలో కరీంనగర్ జిల్లా నుంచి నవలలు వెలువడటం గొప్ప విషయమే వీటితో పాటు 2008లో 'కథక చక్రవర్తి' 2012 లో 'సంస్కారం కథలు' 2013లో 'ఈ తరం పెళ్లికూతురు' 2014లో 'అన్వేషణ', పరిమళించిన మానవత్వం తర్వాత 'నవచైతన్యం' కథా సంకలనాలు వెలువరించారు. కథలు నవలలే గాకుండా 13 కవిత్వ పుస్తకాలు వెలువరించారు మరో 4 విమర్శా వ్యాసాల పుస్తకాలు వెలువరించారు. 1977లో కిషన్ రావు ఎల్లారెడ్డి పేట పాఠశాలలో పనిచేస్తున్న క్రమంలో నలిమెల భాస్కర్, వేముల సత్యనారాయణ, ఎర్రోజు సత్యంలతో కలిసి నటరాజ కళానికేతన్ అనే సాహితీ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో 'కిరణాలు' ఈ తరం పాటలు, ఉషస్సు కవిత్వ సంకలనాలు వెలువరించారు. వేములవాడకు చెందిన నటరాజ కళానికేతన్ సంస్థ శాఖను ఎల్లారెడ్డిపేటలో స్థాపించి సాహిత్య వాతావరణం నెలకొల్పారు.

ప్రచారం కోరుకోని కవి

కిషన్‌రావు ప్రభావంతో ఆయన సహచరి విజయలక్ష్మి కూడా రచనలు ప్రారంభించి కథా సంకలనాలు వెలువరించారు. ఎక్కువగా ప్రచారం కోరుకోకుండా ఆయన రాయడం, పుస్తకాలు అచ్చువేసుకోవడంతోనే గడిపారు. తనపై కొడవటిగంటి కుటుంబరావు రచనల ప్రభావం ఉండేదని పలు సందర్భాల్లో తెలిపారు. కిషన్‌రావు వయస్సు 77 ఏళ్లు. కానీ గత 7 సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యానికి గురై మంచం మీదనే కాలం గడిపారు. నిరంతరం సమాజంలో మార్పు కోసం ఆలోచన చేసే కిషన్ రావు జనవరి 5 2023న కన్నుమూశారు. ఆయనకు భార్య, కూతురు, అల్లుడు, మనుమడు, మనుమరాలు ఉన్నారు.

ఆయన కవితా పంక్తులు

'ఎక్కడి నుంచి వస్తుంది విప్లవం'

మేధావిని నేనడిగిన ప్రశ్న ఇది

'అణచబడి వెతలతో రగులుకొను

అభాగ్యజీవుల అంతరంగాల నుండి'

వ్యవసాయ రంగమున పనిచేయు కూలీల

కరిగిపోయిన కండ కండరాల నుండి'

పాలకుల ప్రవృత్తిని ప్రతిఘటించి

విప్లవం సమత తెస్తుంది''

అన్నవరం దేవేందర్

94407 63479

Also Read...

గల్పిక


Advertisement

Next Story

Most Viewed