అంతరంగం: 'అచ్చు'కు అచ్చంగా గ్రహణం

by Ravi |   ( Updated:2022-09-04 19:15:21.0  )
అంతరంగం: అచ్చుకు అచ్చంగా గ్రహణం
X

ఉత్తరాలు పోయి ఈ-మెయిల్స్ వచ్చినయి. కార్యాలయాలలో ప్రభుత్వ ఉత్తర్వులు ఎలక్ట్రానిక్ రూపంలోనే వస్తున్నయి. బ్యాంక్‌కు పోయి లావాదేవీలు చేయాల్సింది పోయి అరచేతి నుంచి అన్ని పనులు చేస్తున్నం. అట్లనే పుస్తకాలు, పత్రికలు ఇంకా చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇ-బుక్ ఓపెన్ చేసి, అదే చదివి పెట్టే టెక్నాలజీ కూడా వచ్చింది. ఇక చదవడం కూడా వద్దు. వట్టిగ కూర్చుంటే పుస్తకం వినిపిస్తుంది. 'నమిలి నోట్లో పెట్టినట్లు' తయారైంది. 'సుఖం వస్తే ముఖం కడగ తీరికలేదనే' సామెత ఉండనే ఉన్నది. ఇదిలా ఉండగా యూట్యూబ్ రాజ్యం ఏలుతోంది. కవిత్వం, కథలు అన్ని యూట్యూబ్‌లో ఛానల్ ఓపెన్ చేసి పెడుతున్నరు. వినవచ్చు. లేదంటే 'పడ‌కాస్ట్ 'అనే యాప్ ద్వారా అప్లోడ్ చేయవచ్చు. కావాల్సినవి వినవచ్చు. 'అరచేతిలోనే వైకుంఠం' అన్నట్లు మన కళ్ల ముందు చరిత్ర మారుతోంది.

దిన, వార, మాస పత్రికల ముద్రణ ఇంకో దశాబ్దం దాటితే రూపం మార్చుకునేట్టు కనిపిస్తున్నది. అట్లాగే సాహిత్యం కూడా ఇదివరకు కవిత్వం, కథలు, నవలలు వేల కొలది అచ్చు అయి మార్కెట్‌లోకి వచ్చేవి. రానున్న కాలంలో కష్టంగానే తోస్తున్నది. ఎందుకంటే, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత బ్యాంక్‌లకు వెళ్లడం, పోస్టాఫీసులకు వెళ్లడం ఎంత తగ్గిపోయిందో చూస్తున్నం. అంతకు మునుపటి కంటే మరింత ఎక్కువ వేగంగా పనులు అవుతున్నాయి. ఇది సాంకేతిక విప్లవం సాధించిన విజయం. అట్లాగే పత్రికా రంగం కూడా ఇలా అయిపోతోంది. అన్ని పత్రికలు డిజిటల్ రూపంలోకి వచ్చినయి. పత్రికను స్టాల్‌లోకి వెళ్లి కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని చదవడం కంటే అరచేతిలో సెల్‌ఫోన్‌లోనే అనుకున్న సమయంలో చూస్తున్నరు. 'ఆదివారం అనుబంధాల' నుంచి అన్ని ఎడిషన్‌లనూ చూసే, చదివే అవకాశం వచ్చింది. దీంతో కండ్లకు ఇబ్బందే కావచ్చు. అయితే, అనుకున్న మ్యాటర్‌ను ఎన్‌లార్జ్ చేసికొని టాబ్‌లోనో, ల్యాప్ ట్యాప్‌లోనో చదువుతున్నారు. రానున్న దశాబ్దం తర్వాత ఈ ప్రింటింగ్ యంత్రాలు పంపిణీ వ్యవస్థ ఉంటదా? ఉండదా? అనేది అనుమానమే.

పీడీఎఫ్‌ల యుగం

ఇకపోతే కవులు, రచయితలు సృష్టించే సాహిత్యం, కవిత్వం, కథలు, నవలలు, ఆత్మకథలు కూడా ఇది వరకన్నా చాలా తక్కువగా ముద్రిస్తున్నారు. అసలే తెలుగువాళ్లం. 'కొని చదవం' అనే అపవాదు ఉండనే ఉన్నది. మలయాళం, తమిళం తదితర రాష్ట్రాల కవుల పుస్తకాలు వేలకు వేలు అచ్చు వేస్తే రెండు నెలలోనే అమ్ముడుపోతాయి. మన దగ్గర 'కొని చదివే' సంస్కృతి ఎందుకో తక్కువగా ఉన్నది. కొనడమే తక్కువ, కొన్నా చదవడమూ తక్కువ. ఇక పుస్తకాలు ముద్రించి ఇంటి నిండా బీరువాలలో ఉంది పంచడం ఎందుకు? అనే నిర్వేదం వస్తున్న సందర్భంలో పుస్తకాలు కూడా 'ఇ-బుక్స్' రూపంలో వెలుగు చూస్తున్నాయి.

ఇ-బుక్ పీడీఎఫ్‌లో వస్తుంది. వాట్సప్‌లో ఎందరికైనా పంపవచ్చు. వాళ్లు చదవచ్చు. అయితే, అంతకుముందు అవసరం ఉన్నవాళ్లు కొనుక్కుంటున్నారేమో గానీ, ఈ పీడీఎఫ్ పుస్తకాల పంపిణీ వచ్చిన తర్వాత ఇగ కొనడం ఎక్కడ ఉంటది? ఇప్పటికే పాతవి, దొరకని పుస్తకాలు లక్షలకు లక్షలు పీడీ‌ఎఫ్‌లుగా మార్చి ఆయా సైట్లలో పెడుతున్నారు. ఈ రోజులలో ఎవరి పుస్తకాలైనా కొత్త తరంలోకి వెళ్లాలంటే ఆధునిక సాంకేతిక పద్దతులను అలవర్చుకోవాల్సిందే. పుస్తకాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో పంపితే ఉచితమే అవుతుంది. ఈ పద్ధతి ఇదివరకు ఇంగ్లిష్ సాహిత్యంలో ఉన్నదే. 'కిండిల్' ద్వారా ఇంగ్లిష్ నవలలు చదువుతున్నారు. రానున్న రోజులలో తెలుగు పుస్తకాల ముద్రణ తగ్గిపోయి ఇ-బుక్స్ రూపం మార్చుకోవచ్చు.

పాఠాలు కూడా అలాగే

ఇలాగే పాఠ్యపుస్తకాలు కూడా రావచ్చు. ఇప్పటికే ఉన్న పుస్తకాలు సమాచారం ఇంటర్నెట్‌లో లభ్యం అవుతున్నది. రచయిత రచనలు కూడా అధికారికంగా వచ్చే కాలం వస్తుంది. అసలు కొత్తగా వస్తున్న తరం ఎక్కువగా ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ల చదువుల వైపు వెళుతున్నారు. సామాజిక, కళాశాస్త్రాలు తక్కువగా చదువుతున్నారు. ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, సాంకేతిక విద్య చదివినవారు తెలుగు సాహిత్యాన్ని చదవడం, చూడటం, వినడం కూడా ఉండకపోవచ్చు.

ఏది ఏమైనా, పుస్తకాలు, పత్రికలు ప్రచురణ తగ్గిపోయి ఇంకో రూపం తీసికొనే కాలం ముందుంది. దీనికి ఎవరిదీ బాధ్యత కాదు. ఎవరినీ తప్పు పట్టలేము. ఉత్తరాలు పోయి ఈ-మెయిల్స్ వచ్చినయి. కార్యాలయాలలో ప్రభుత్వ ఉత్తర్వులు ఎలక్ట్రానిక్ రూపంలోనే వస్తున్నయి. బ్యాంక్‌కు పోయి లావాదేవీలు చేయాల్సింది పోయి అరచేతి నుంచి అన్ని పనులు చేస్తున్నం. అట్లనే పుస్తకాలు, పత్రికలు ఇంకా చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇ-బుక్ ఓపెన్ చేసి, అదే చదివి పెట్టే టెక్నాలజీ కూడా వచ్చింది. ఇక చదవడం కూడా వద్దు. వట్టిగ కూర్చుంటే పుస్తకం వినిపిస్తుంది. 'నమిలి నోట్లో పెట్టినట్లు' తయారైంది. 'సుఖం వస్తే ముఖం కడగ తీరికలేదనే' సామెత ఉండనే ఉన్నది. ఇదిలా ఉండగా యూట్యూబ్ రాజ్యం ఏలుతోంది. కవిత్వం, కథలు అన్ని యూట్యూబ్‌లో ఛానల్ ఓపెన్ చేసి పెడుతున్నరు. వినవచ్చు. లేదంటే 'పడ‌కాస్ట్ 'అనే యాప్ ద్వారా అప్లోడ్ చేయవచ్చు. కావాల్సినవి వినవచ్చు. 'అరచేతిలోనే వైకుంఠం' అన్నట్లు మన కళ్ల ముందు చరిత్ర మారుతోంది.

అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story