- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కథా-సంవేదన:స్వరూప ధైర్యం
స్వరూప వచ్చి ఇన్‌స్పెక్టర్ సాయి ముందు నిల్చుంది. అక్కడ ఆమె భర్త రాందాస్ వున్నాడు. ఆమెకు విషయం పూర్తిగా అర్థమైంది. స్వరూపకి 55 సంవత్సరాల దాకా వుంటాయి. మనిషి ఆరోగ్యంగా వుంది. చురుగ్గా కూడా అనిపించింది. ఇన్‌స్పెక్టర్ సాయికి. ఆమె పదవ తరగతి వరకు చదువుకుంది. ఆమె భర్త రాందాస్‌కు 65 సంవత్సరాలు వుంటాయి. మనిషి కాస్త బలహీనంగా వున్నాడు. ఏమమ్మా! నీ భర్త రాందాస్‌తో వుండటం లేదట నిజమేనా? ప్రశ్నించాడు సాయి. అవున్సార్ అంది స్వరూప వినయంగా. ఈ వయస్సులో అతన్ని ఒంటరిగా వదిలిపెట్టడం సమంజసమా? అడిగాడు సాయి. ఇప్పుడే కాదు. 15 సంవత్సరాల నుంచే నేను అతనితో కలిసి వుండటం లేదు. 'సరేలే! కానీ, అతని ఆరోగ్యం అంతగా బాగుండటం లేదట. అతని దగ్గరికి వెళ్లి వుండు' కాస్త గట్టిగా చెప్పాడు ఇన్‌స్పెక్టర్. అతనితో కలిసి వుండే ప్రశ్నే లేద్సార్! చాలా దృఢంగా చెప్పింది స్వరూప. ఏం ఎందుకు? ప్రశ్నించాడు ఇన్‌స్పెక్టర్. ఇద్దరి సంభాషణని వింతగా చూస్తున్నాడు రాందాస్.
*
'మా పెళ్లి 30 సంవత్సరాల క్రితం అయింది. అతన్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన తరువాత ఓ నాలుగు సంవత్సరాలు బాగానే ఉన్నాం. ఆ తరువాత రోజూ గొడవే. తాగి రావడం, గొడవ చేయడం. అప్పటికే మాకు ఇద్దరు పిల్లలు. వాళ్లను చూసి అయినా ఇతను తన ధోరణిని మార్చుకోలేదు. నేను గట్టిగా ప్రశ్నిస్తే నా మీద చెయ్యి చేసుకోవడం. మూడోసారి నేను గర్భవతిని అయినప్పుడు నన్ను బాగా కొట్టి ఇంట్లో నుంచి బయటకు తరిమేశాడు. అయినా పిల్లల కోసం భరించాను. తెల్లవారి వచ్చి మళ్లీ ఇంటికి తెచ్చుకున్నాడు. తాగడం మానేస్తానని ఎన్నో సార్లు ప్రమాణం చేశాడు. బొగ్గు బావిలో పని చేస్తాడు. మంచి జీతమే వస్తుంది. ఆ పైసలని తినుడు, తాగుడుకే ఖర్చు చేసేవాడు. ఒక రోజు బాగా తాగి స్కూటర్ యాక్సిడెంట్ చేశాడు. రోడ్డు మీద పడిపోయిన అతన్ని దవాఖానానికి తీసుకొని వెళ్లి వైద్యం చేయించాను. డబ్బులు లేకపోతే నా ఒంటి మీద వున్న బంగారం అమ్మాను. మంచిగైన తరువాత మళ్లీ మామూలే.'
*
'మళ్లీ తాగడం, కొట్టడం భరించలేక పిల్లలని తీసుకొని ఈ పట్టణానికి వచ్చి 15 సంవత్సరాలు అయింది. ఇండ్లలో పనిచేసుకుంటూ ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేశాను. చదివించుకున్నాను. ఇప్పుడు ముగ్గురూ ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ అంతో ఇంతో సంపాదిస్తున్నారు. ఏడు సంవత్సరాల క్రితం మంచిర్యాల కోర్టులో నా మీద కేసు వేశాడు. కోర్టు అతని కేసుని రెండు సంవత్సరాల క్రితం కొట్టివేసింది. ఆ తరువాత తెలిసిన వాళ్లందరితో ఫోన్లు చేయించాడు. నేను వినలేదు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అతనికి ఉద్యోగం లేదు. పానం మంచిగుంటలేదు. ఇప్పుడు నేను కావాల్సి వచ్చింది. నన్ను నరకయాతన పెట్టాడు. ఈ మనిషిని చూస్తేనే నాకు మండుకొస్తుంది సార్. నన్నూ, పిల్లలను ఆగమాగం చేసిన ఈ మనిషితో నేనెట్లా సంసారం చేస్తాను. అతన్ని చూడటమే నా కిష్టం లేదు. అతని బతుకు దెరువు కోసం పిల్లలు వాళ్లకు తోచినంత డబ్బులు పంపిస్తారు. ఆయన బతుకు ఆయన్ని బతకమని చెప్పండి. మా జోలికి రావద్దని చెప్పండి.'
*
'పిల్లలకు పెళ్లిళ్లు చేయాలని, అందుకని కలిసి వుండాలని నలుగురితో చెప్పించాడు. ముగ్గురు మగపిల్లలు. వాళ్ల పెళ్ళిళ్లు ఆగవు. జరుగుతాయి. ఈయన ముఖం చూడ్డమే మా కిష్టంలేదు. నేను అతన్ని ప్రేమించిన పాపానికి అతని మీద పోలీసు కేసులు పెట్టలేదు సార్! ఈ ముసలితనంలో అతనికి నేనూ పిల్లలూ గుర్తుకొస్తున్నాం. అతను తన అలవాట్లు మార్చుకున్నా మేం అతనితో జీవించలేం. నేనైతే అతనితో సంసారం చేసే ప్రసక్తే లేదు. దయచేసి నన్ను ఒత్తిడికి గురి చేయకండి. మళ్లీ ఈ పోలీసు స్టేషన్ కి పిలిపించండి' అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెను తిరిగింది. ఏం అనాలో ఇన్‌స్పెక్టర్ సాయికి తోచలేదు. రాందాస్ బిక్కచచ్చిపోయాడు. ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆమె ధైర్యానికి అక్కడే వున్న లేడీ కానిస్టేబుల్ ఆనందించింది.
మంగారి రాజేందర్ జింబో
94404 83001