యాది:తెలంగాణ వైతాళికుడు సురవరం

by Ravi |
యాది:తెలంగాణ వైతాళికుడు సురవరం
X

నిద్రాణమై ఉన్న తెలంగాణను తన కలంతో, గళంతో మేల్కొలిపిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత. హైదరాబాద్ వేదికగా 'గోల్కొండ' పత్రిక నడిపిన ధీరోదాత్తుడు. 1896 మే 28న మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాలపాడు గ్రామంలో 'సురవరం' జన్మించారు. ఆంధ్రలో ముట్నూరి కృష్ణారావు 'కృష్ణా పత్రిక' ఎటువంటిదో, తెలంగాణలో సురవరం ప్రతాపరెడ్డి 'గోల్కొండ' పత్రిక అటువంటిది. దీనిని 1925లో ప్రారంభించారు. హైదరాబాదులో తెలుగు మాట్లాడేవారే అరుదు. అలాంటి రోజులలో ధైర్యంగా తెలుగు పత్రికను స్థాపించి, సంపాదకుడిగా, ప్రూఫ్ రీడర్‌గా, గుమస్తాగా అన్నీ తానుగానే వ్యవహరించారు. అకుంఠిత దీక్షతో పత్రికను నడిపి తెలంగాణవాసులను జాగృతం చేశారు.

'తెలంగాణలో కవులు లేరు' అనే అపప్రదను పోగొట్టడానికి 354 మంది తెలంగాణ కవులచే 'గోల్కొండ కవుల సంచిక'ను వెలువరించారు. ఇది తెలుగు రచయితలకు 'మణిదీపం' అయ్యింది. తెలంగాణ కవులకు శంఖారావం అయ్యింది. గ్రంథాలయోద్యమ రథసారథులలో రెడ్డి గారు ముఖ్యులు. ఎన్నో విద్యా సంస్థలను నిర్వహించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపకులలో ఒకరిగా తెలుగు లిపిలో చేయవలసిన సంస్కరణల గురించి కూడా విశేష పరిశోధన చేశారు. సాహిత్యం, చరిత్ర, సంస్కృతి మూర్తీభవించిన గొప్ప రచయిత ప్రతాపరెడ్డి. హైదరాబాద్‌ కొత్వాల్‌గా ఉన్న రాజా బహద్దూర్ వెంకట్రామిరెడ్డి కోరిక మేరకు రెడ్డి హాస్టల్‌ నిర్వహణకు పూనుకున్నారు. ఆయన పనిచేసిన దశాబ్ది కాలంలో రెడ్డి హాస్టల్‌‌ను విద్యాలయంగా తీర్చిదిద్దారు. విద్యార్థులలో దేశభక్తి బీజాలను నాటారు.

అనేక రకాలుగా

సంగ్రామసింహ, భావకవి, రామమూర్తి, విశ్వామిత్ర, చిత్రగుప్త, అమృత కలశం, జంగం బసవయ్య అనే కలం పేర్లతోనూ రచనలు చేశారు సురవరం. శుద్ధంత కాంత (నవల) భక్త తుకారం (నాటకo), గ్రంథాలయోద్యమం (వ్యాసాలు) హైందవ ధర్మవీరులు, ప్రతాపరెడ్డి కథలు, మొగలాయి కథలు ఆయన రచనలే. వాల్మీకి రామాయణాన్ని బాగా పరిశీలించి ఎన్నో చారిత్రక, సాంస్కృతిక అంశాలతో తిరగరాశారు. హిందువుల పండుగలు, పుట్టు పూర్వోత్తరాలు, చారిత్రక, సాంఘిక ప్రాముఖ్యతలు, ఆచార వ్యవహారాలు పండుగలలోని పరమార్ధం తెలుపుతూ రాసిన పుస్తకం 'హిందువుల పండుగలు' దీనిని మొదట 'గోల్కొండ' ప్రచురించింది. 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' రెడ్డి అంతిమ రచన. అత్యంత ప్రశస్తమైన రచన.

వేయి సంవత్సరాల ఆంధ్రుల సాంఘిక చరిత్రను సాహిత్యం ఆధారంగా వివరించిన తీరు అద్భుతం. కేంద్ర ప్రభుత్వ బహుమతి కూడా పొందిన ఈ గ్రంథాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్తువారు 1950లో ప్రచురించారు. గోల్కొండ, ప్రజావాణి పత్రిక సంపాదకుడిగా వెర్రి వెంగళప్ప, కవిలె కట్టెలు అనే శీర్షికలు నిర్వహించారు. ఆజన్మాంతం పేదవాడిగానే ఉండిపోయిన ప్రతాపరెడ్డి రాజకీయ కీచులాటలు, అంత:కలహాలు రుచించక వాటికి దూరంగా ఉన్నారు. సహచరుల ప్రోదంబలంతో 1952లో హైదరాబాదు రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికలలో వనపర్తి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 25 ఆగస్టు 1953న కన్నుమూశారు.

యాడవరం చంద్రకాంత్ గౌడ్

పెద్దగుండవెల్లి. సిద్దిపేట

Advertisement

Next Story

Most Viewed