లాక్ డౌన్ ఎత్తేస్తే.. వెంటనే ఇవి చేయకూడదు

by vinod kumar |
లాక్ డౌన్ ఎత్తేస్తే.. వెంటనే ఇవి చేయకూడదు
X

దిశ, వెబ్ డెస్క్ :
లాక్ డౌన్ విధించి ఇప్పటికే నెల గడిచిపోయింది. మరో రెండు, మూడు వారాల్లో ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేస్తుందనే ఆలోచనలో ఉన్నారు చాలామంది. అంతేకాదు లాక్ డౌన్ ఎత్తేయగానే.. స్నేహితులను కలవాలని, షాపింగ్ చేయాలని అన్నింటికంటే ముందు హెయిర్ కట్ షాప్ కు వెళ్లాలని భావిస్తున్నారు. అందుకు ప్లాన్లు వేసుకుంటున్నారు. కానీ, లాక్ డౌన్ లో ఉన్నప్పటి కంటే కూడా అది ఎత్తేసేన తర్వాత మరింత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అందరిలోనూ ఉంది. మన జీవితం ఒక్కసారిగా నార్మల్ లైఫ్ లోకి రాదన్నది మనం ముందుగానే గ్రహించి అందుకు తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే…. పక్కవారి ఆరోగ్యాన్ని కాపాడాలి. కోవిడ్ 19 ఇంకా మనమధ్యలోనే ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. మొదటికే మోసం వస్తుంది. అయితే కొన్నింటినీ మాత్రం మనం వాయిదా వేసుకోవాలి. అవేంటంటే..

విహారయాత్ర ప్లాన్ కు ఫుల్ స్టాప్ :

ఒక్కసారి ఆలోచిస్తే.. కరోనా ఎలా వచ్చిందో తెలుసు కదా. ముఖ్యంగా ప్రయాణాల వల్లే. అది పక్కన పెడితే.. ప్రధానంగా ప్రయాణాలు, వెకేషన్ ప్లాన్స్, తీర్థయాత్రలు వంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టడం ఎంతో ఉత్తమం. రద్దీ ప్రదేశాలకు వెళ్లకపోవడమే మంచిది. వీలైనంత వరకు ఇంట్లో ఉండటానికే ప్రయత్నించాలి. సమూహంలో ఉంటే.. ఆరోగ్యాన్ని రిస్క్ లో పెడుతున్నట్లే లెక్క అని గుర్తెరగాలి. కొన్ని నెలలైనా .. ఇల్లు, ఊరు దాటి ఎక్కడికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. శుభకార్యాలకు కూడా వెళ్లేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే స్కిప్ చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

చేతులు కడగడం మరిచిపోవద్దు :

కోవిడ్ 19 … ఎంత నష్టం చేసినా.. అది మాత్రం ఓ మంచి అలవాటును ప్రజలకు అందించింది అదే శుభ్రంగా చేతులు కడుక్కోవడం. చేతులు శుభ్రంగా కడుక్కుంటే.. ఒక్క కరోనా అనే కాదు ఎన్నో రకాల వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. మల విసర్జన అనంతరం, భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం వల్ల 40 శాతం అతిసారం, డయేరియా, 25 శాతం శ్వాస సంబంధిత వ్యాధులు రావు. ఒకవేళ కరోనా కథ కంచికి చేరినా.. చేతులు కడుక్కోవడం మాత్రం ఆపవద్దు. మనం ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని గ్రహించాలి.

పార్టీలు మానుకోవాలి :

లాక్డౌన్ ఎత్తేస్తే.. ముందుగా చాలామంది చేసే పని.. తమ తమ ఫ్రెండ్స్ ని కలుసుకోవడం. అక్కడితో ఆగుతుందా.. చాలా రోజుల తర్వాత కలుసుకున్నందుకు చిల్లవుట్ కావడానికి పార్టీ ప్లాన్ చేస్తారు. పబ్, క్లబ్, కేఫ్, రెస్టారెంట్ ఇలా ఎక్కడికో ఓ చోటుకి హ్యాంగ్ అవుట్ కావడానికి వెళుతుంటారు. సో వీటిని కొన్ని నెలలు వరకు వాయిదా వేసుకోవాలి. క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండకూడదు. అలాంటి ప్రదేశాల్లోనే కరోనా వ్యాప్తి అధికంగా ఉంటుంది. కరోనా వచ్చిన చాలా మంది వ్యక్తుల్లో ఇప్పటికీ లక్షణాలు కనిపించడం లేదు. అందువల్ల ఎవరికీ వారు స్వీయ నియంత్రణ పాటిస్తే.. కరోనా నుంచి త్వరలోనే బయట పడొచ్చు. లేదంటే.. మన జీవితాలను.. పక్కవారి జీవితాలను కూడా ప్రమాదంలో పెట్టినవాళ్లమవుతాం. కరోనా .. ఇప్పట్లో తగ్గేలా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తోంది. సో బీ అలర్ట్. నో పార్టీస్ ఎట్ ఆల్.

ఫేస్ మాస్క్ ని డస్ట్ బిన్ లోకి విసిరి కొట్టకండి :

కరోనా వెళ్లిపోయింది. లాక్డౌన్ ఎత్తేశారు అని అనుకోవద్దు. కరోనా ఇంకా ఇక్కడే ఉంది. అందువల్ల బయటకు వెళితే మాస్క్ పెట్టుకోవడం మరిచిపోవద్దు. దాని పని అయిపోయిందని డస్ట్ బిన్ లో పడేయవద్దు. ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ’ అనే వాక్యాలను మరిచిపోవద్దు. మరికొన్ని నెలల వరకు మాస్క్ లు వాడాలి. సోషల్ డిస్టెనింగ్ మెయింటెన్ చేయాలి. అత్యవసర పనులకు మాత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలి. బజారుకు వెళితే.. మాస్క్ మస్ట్ అని మాత్రం మరిచిపోవద్దు.

పబ్లిక్ లో అలా చేయవద్దు :

ప్రతి ఒక్కరికీ తుమ్మలు, దగ్గులు రావడం సహజం. అయితే పబ్లిక్ లో ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించాలి. తుమ్ము, దగ్గు వస్తే.. మూతి, ముక్కులను టిష్యూ లేదా కర్చీఫ్ తో కవర్ చేసుకోవాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా వ్యవహరించాలి.

ఈ అంశాలనే కాదు.. ఇంట్లో కూడా పండగలు, శుభకార్యాలకు కుటుంబ సభ్యులను మాత్రమే పరిమితం చేయాలి. పానీపూరి బండ్లు, చాయ్ ,కాఫీ, టిఫిన్ సెంటర్ల వద్ద కూడా గుమికూడ వద్దు. అక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ మరవకూడదు. అసలు అలాంటి ప్లేసులకు వెళ్లకుండా ఉండటం ఇంకా మంచిది. వీలైనంతగా పబ్లిక్ ప్లేసుల్లో ఉండకుండా ఇంటి పట్టునే ఉండే విధంగా కొన్ని నెలలు నియంత్రించుకోగలిగితే.. మొత్తంగా కరోనా నుంచి బయట పడే అవకాశాలున్నాయి.

Tags: coronavirus, lockdown, shopping, partying, gathering, festival

Advertisement

Next Story

Most Viewed