ఎమ్మార్పీకి మించి మద్యం అమ్మకాలు

by Shyam |
ఎమ్మార్పీకి మించి మద్యం అమ్మకాలు
X

దిశ, మెదక్: లాక్‌డౌన్ కాలంలో మద్యం దుకాణాలు బంద్ కావడంతో షాపులు మూతపడ్డాయి. సడలింపుల్లో భాగంగా మద్యం దుకాణాలను అనుమతి లభించడంతో షాపులు తెరుచుకున్నాయి. అప్పుడే మద్యం ధరలను 16 శాతం పెంచుతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. చీప్ లిక్కర్‌పై 11 శాతం మాత్రమే పెంచుతున్నట్టు వెల్లడించింది. దీంతో బీర్ బాటిల్‌పై రూ.30, చీప్ లిక్కర్ పుల్ బాటిల్‌పై రూ.40 పెరిగింది. ఆర్డినరీ లిక్కర్ పుల్ బాటిల్ పై రూ.80, స్కాచ్ పుల్ బాటిల్‌పై రూ.160 అదనంగా దర పెరిగింది. ఇదంతా ప్రభుత్వం పెంచిన ధరలు. ఈ ధరలకే విక్రయదారులు మధ్యం అమ్మాలి. కానీ మెదక్ జిల్లాలో సిండికేట్‌గా మారి ధరలు పెంచి అమ్మకాలు చేపడుతున్నారు.

ఎమ్మార్పీ కంటే అధికంగా వసూలు..

మద్యం దుకాణ దారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ మందుబాబులపై అదనపు భారాన్ని మోపుతున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 38 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో మెదక్ పట్టణంలోనే ఐదు షాపులు ఉన్నాయి. ఈ ఐదు షాపుల్లోనూ మద్యం ధరలను పెంచి అమ్ముతున్నారు. బోర్డులో ఉన్న ధరలకు, అమ్ముతున్న ధరలకు ఎక్కడా సంబంధం ఉండటం లేదు.

ఒక్కో బీరు బాటిల్‌పై అదనంగా రూ.30 నుంచి రూ.50, క్వార్టర్‌‌పై రూ.20 నుంచి రూ.30, ఆఫ్ బాటిల్ పై రూ.30 నుంచి రూ.50, ఫుల్ బాటిల్‌పై రూ.80 నుంచి రూ.150 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే తమ వద్ద మద్యం అయిపోయిందని చెప్పి తిప్పి పంపితున్నారని పలువురు మందుబాబులు చెబుతున్నారు. ఇలా మద్యం ధరలను పెంచి విక్రయించడంలో మెదక్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తూ అధికారులను, కొందరు ప్రజా ప్రతినిధులను మేనేజ్ చేస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన కనుసన్నల్లోనే మెదక్, దాని చుట్టుపక్కల ఉన్న వైన్స్ షాపుల్లో ధరలను అమాంతం పెంచి అమ్ముతున్నట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ధరల పెంచితే చర్యలు తప్పవు..

ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే సంబంధిత వైన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం. ధరలు పెంచి అమ్ముతున్నట్టు మా దృష్టికి రాలేదు. -సీఐ గోపాల్

Advertisement

Next Story

Most Viewed