సింహాన్ని వేధించిన కేసులో ఏడుగురికి జైలు శిక్ష

by  |
సింహాన్ని వేధించిన కేసులో ఏడుగురికి జైలు శిక్ష
X

దిశ, ఫీచర్స్ : మూడేళ్ల క్రితం ఇల్లీగల్ ‘లయన్ షో’లో పాల్గొన్న వ్యక్తులకు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ .10,000 జరిమానా విధిస్తూ గుజరాత్‌లోని అజుజారత్ కోర్టు తీర్పునిచ్చింది. జాతీయ దినపత్రిక కథనం ప్రకారం.. గిర్ (పశ్చిమ) వన్యప్రాణి విభాగంలోని ధ్రుబక్ అటవీ స్థావరంలో ఇలియాస్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. గతంలో ఆ ఏరియాలోని కొంత భూమిని అటవీ శాఖ ఇలియాస్ తాతకు కేటాయించగా.. అతడి బంధువులు రింగ్‌బ్లోచ్, అల్తాఫ్, కరేజా ఆ భూమిని సాగు చేయడంలో ఇలియాస్‌కు సాయపడేవారు. ఈ క్రమంలో రూ. 6 వేల ఒప్పందంపై సింహాలను చూపించేందుకు పటాడియా, గజ్జర్, పటేల్, మీనాలను తమ వ్యవసాయ క్షేత్రానికి ఆహ్వానించారు. ఈ మేరకు ఒక బతికున్న కోడిని సింహానికి ఎరగా వేసి వేధించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో.. పోలీసులు 2018 మే నెలలో నిందితులను అరెస్టు చేసి, వన్యప్రాణి సర్వే చట్టం 1972 లోని సెక్షన్ 2 (16) (బి) 2 (36), 9, 29, 39, 51, 52 కింద నమోదు చేశారు.

కాగా ఈ కేసులో అహ్మదాబాద్ నగరానికి చెందిన ముగ్గురు పర్యాటకులతో సహా ఏడుగురిని దోషులుగా ప్రకటించిన గిర్ గిదాడ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్.. అందులో ఆరుగురు నిందితులకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, మరో దోషికి ఏడాది జైలు శిక్ష విధించింది. వన్యప్రాణి రక్షణ చట్టం సెక్షన్ 2 (16) (బి) కింద ఏవైనా జంతువులను పట్టుకోవడం, ఉచ్చు వేయడం, ఎర వేయడంతో పాటు అభయారణ్యంలో అక్రమంగా ప్రవేశించిన కేసుల్లో వారిని దోషులుగా ప్రకటించింది కోర్టు. అంతేకాదు జరిమానాగా విధించిన డబ్బులను, సింహాల సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది. తాను పాల్గొన్నట్లు సాక్ష్యాలు లేవని చెప్పిన మరో నిందితుడు హసంభాయ్ కొరెజాను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed