బొమ్మకల్ భూ దందాకు.. సీఎం ఆఫీస్‌కు లింకేంటీ ?

by Anukaran |
బొమ్మకల్ భూ దందాకు.. సీఎం ఆఫీస్‌కు లింకేంటీ ?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: బొమ్మకల్ భూ దందాలో తీగ లాగితే డొంక కదులుతోందన్నట్లు తయారైంది. తవ్విన కొద్దీ బడానేతల పేర్లు బయటకు రావడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌కు ఓ ముఖ్య నాయకుడికి ఉన్న లింక్‌పై నివేదిక పంపినట్లు సమాచారం. కరీంనగర్ కేంద్రంగా చుట్టు పక్కల ప్రాంతాల్లో జరిగిన భూ బాగోతంపై ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. బొమ్మకల్ సర్పంచ్ పురుమళ్ల శ్రీనివాస్ భూ కబ్జాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ, ప్రైవేటు భూములను వదలకుండా కబ్జా చేశారని పలువురు సీఎం క్యాంప్ ఆఫీస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంఓ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్న జిల్లా అధికారులకు నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. అయితే బొమ్మకల్‌తో పాటు కరీంనగర్‌ను ఆనుకుని ఉన్న శివారు గ్రామాల్లో కూడా భూ మాఫియా రెచ్చిపోయిందని కూడా అధికారుల విచారణలో తేలింది.

బినామీల.. అనుచరులా?

ఇంతకాలం గుట్టు చప్పుడు కాకుండా సాగిన భూ మాఫియా సీఎంఓ ఆదేశాలతో వెలుగులోకి వస్తుండడం, ఇందులో ముఖ్య నాయకుడి పేరు ప్రముఖంగా వినిపిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చుట్టు పక్కల గ్రామాలతో పాటు కరీంనగర్‌లోనూ పలు చోట్ల భూములు ఉన్న విషయంపై సమగ్రంగా వివరాలు సేకరిస్తున్న అధికార యంత్రాంగంలో కొత్త కోణం ఆవిష్కృతం అయింది. అయితే సదరు ముఖ్య నాయకుడికి వీరంతా బినామీలా లేక, అనుచరులా అన్న వివరాలు కూడా సేకరించినట్లు తెలుస్తోంది.

ల్యాండ్ మాఫియాపై ఉక్కుపాదం

కరీంనగర్ మండలం బొమ్మకల్ ల్యాండ్ మాఫియాపై రెవెన్యూ అధికారులు, పోలీసులు ఉక్కుపాదం మోపడం ఆరంభించారు. శుక్రవారం ఉదయం దుర్శేడ్ వద్ద మూడు బ్యాగుల్లో తరలి వెళ్తున్న ల్యాండ్ డాక్యుమెంట్లను టాస్క్ ఫోర్స్ బృందం స్వాధీనం చేసుకుంది. దాదాపు వెయ్యి వరకూ ఈ డాక్యుమెంట్లు ఉంటాయని తెలుస్తోంది. వీటితో పాటు బొమ్మకల్ సర్పంచ్ బినామీగా భావిస్తున్న ఓ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే డాక్యుమెంట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీపీ కలమాసన్ రెడ్డి ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తుండడంతో పకడ్భందీగా ఆధారాలు సేకరించే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నం అయింది. అలాగే రెవెన్యూ అధికారులు కూడా బొమ్మకల్ శివారులోని ప్రభుత్వ భూమి వివరాలు తెలుసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో భూములకు సంబంధించిన కొలతలు తీసుకున్నారు. రెవెన్యూ అధికారుల బృందం ప్రత్యేకంగా బొమ్మకల్ శివారులో సర్వే చేపట్టింది.

Advertisement

Next Story

Most Viewed