Panic attack : ఉన్నట్టుండి గుండె దడ.. ఆకస్మికంగా భయం.. దేనికి సంకేతం?

by Javid Pasha |   ( Updated:2024-09-13 06:22:38.0  )
Panic attack : ఉన్నట్టుండి గుండె దడ.. ఆకస్మికంగా భయం.. దేనికి సంకేతం?
X

దిశ, ఫీచర్స్ : జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం, ఆహారం ఎంత ముఖ్యమో, సంతోషంగా ఉండటానికి మెంటల్ హెల్త్ కూడా అంతే ముఖ్యం అంటున్నారు మానసిక నిపుణులు. కానీ బిజీ లైఫ్ షెడ్యూల్, నిరంతర ఒత్తిడి, మానసిక ఆందోళనలు, విషాద సంఘటనలను ఎక్కువగా ఎదుర్కోవడం, కుటుంబ, ఆర్థిక, సామాజిక పరమైన సమస్యలు వెంటాడుతూ ఉండటం వంటి అనుభవాలు కొందరి మనసును అల్లకల్లోలం చేస్తుంటాయి. అయితే ఎక్కువకాలం ఇలాంటి అనుభూతిని పొందేవారిలో క్రమంగా ఆకస్మిక భయాలు, గుండె దడ వంటి సమస్యలు ప్రారంభం అవుతాయి. ఈ పరిస్థితినే ‘పానిక్ అటాక్ లేదా పానిక్ యాంగ్జైటీ’గా మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.

ఎమిటీ ఆందోళన ?

బాధాకరమైన, ఆందోళనకరమైన సందర్భాలు, సంఘటనలు, ఒత్తిళ్లను ఎక్కువగా అనుభవిస్తూ వాటినుంచి బయటపడటం కష్టంగా భావించిన వ్యక్తులే ఎక్కువగా ‘పానిక్ అటాక్’ మానసిక స్థితికి చేరుకుంటారని పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. దీంతో వీరిలో ఉన్నట్లుండి గుండె దడ మొదలవడం, ఏ సమస్య లేకపోయినా అప్పటికప్పుడు భయాందోళనకు గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు ఛాతీలో మంటగా, ఏదో మెలికలు తిరిగిన అనుభూతి, మాటల్లో చెప్పలేని భయం వెంటాడుతూ ఉండవచ్చు. అలాగనీ ఇదేదో ప్రాణాపాయం కలిగించే సమస్య మాత్రం కాదంటున్నారు నిపుణులు. దీనిని బయటపడే మార్గం ఉందని చెప్తు్న్నారు.

ఏం చేయాలి?

ఆకస్మిక ఆందోళనలు, భయాలు, గుండె దడకు గల కారణాలను స్వయంగా పరిశీలించుకోవడం, గుర్తించడం, వాస్తవంగా ఆలోచించడం వల్ల కొంతకాలానికి పానిక్ అటాక్ పెయిన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా బాధితులు గుండెదడ మొదలవగానే 5 నిమిషాలు ఏవైనా రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించాలి. ఒకవేళ ఆ సమయంలో ఒంటరిగా ఉంటే మరింత ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటం, బయటకు వెళ్లి ప్రకృతిలో గడపడం ద్వారా కూడా ‘పానిక్ అటాక్’ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. అలాగే నిశ్శబ్ద వాతావరణంలో తమను తాము ప్రశ్నించుకోవడం, ధ్యానం చేయడం, సంతోషకరమైన సంఘటనలు గుర్తుకు తెచ్చుకోవడం వంటివి కూడా పానిక్ అటాక్ పరిస్థితి నుంచి కోలుకోవడానికి సహాయపడతాయి.

ఎలా బయటపడాలి?

ఇష్టమైన సంగీతాన్ని వినడం, డ్రాయంగ్ వేయడం, పుస్తకం చదవడం కూడా గుండెదడ, ఆకస్మిక ఆందోళన వంటి పానిక్ అటాక్ పరిస్థితిని డైవర్ట్ చేస్తుంది. ప్రతిసారీ ఇలా చేస్తూ పోతే కొన్ని రోజుల్లోనే సాధారణ పరిస్థితికి చేరుకుంటారని నిపుణులు చెప్తున్నారు. దీంతోపాటు పోషకాహారం, ఫిజికల్ యాక్టివిటీస్, ఇష్టమైన పనుల్లో నిమగ్నమవడం కారణంగా కూడా రిలీఫ్ పొందవచ్చు. అయితే ఒకటి రెండుసార్లు ప్రయత్నించగానే సమస్య నుంచి బయటపడకపోవచ్చు. కొన్ని వారాలు తమను ఇబ్బంది పెట్టే భయంకరమైన ఆలోచనలు, ఆందోళనలను డైవర్ట్ చేసే పద్ధతులను పాలో అయితేనే మంచి ఫలితం ఉంటుందని సైకాలజిస్టులు చెప్తున్నారు. అప్పటికీ కోలుకోకపోతే మానసిక నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవచ్చు.

* నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే మానసిక నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed