Telangana Pride.. జ‌రూర్ ఆనా.. హ‌మారా తెలంగాణ‌.!

by Daayi Srishailam |
Telangana Pride.. జ‌రూర్ ఆనా.. హ‌మారా తెలంగాణ‌.!
X

సువిశాల..

సుంద‌ర..

సోయ‌గాల స‌మాహారం తెలంగాణ.

ఇక్క‌డి ప్ర‌తి నిర్మాణ‌మూ ఓ చ‌రిత్రే.

ప్ర‌తి ప‌ర్యాట‌క‌మూ ఓ చారిత్రక ఆన‌వాలే.

గ‌ల‌గ‌ల‌పారే జ‌ల‌పాతాలు..

ఘ‌న‌ఘ‌న మోగే గుడి గంట‌లు..

క‌ర‌క‌ర‌లాడే పిండి వంట‌లతో ప్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తోంది తెలంగాణ‌.

హిస్టారిక‌ల్‌.. క‌ల్చ‌ర‌ల్‌.. నోస్ట‌లాజిక‌ల్ ఫ్లేవ‌ర్స్ కోసం..

జ‌రూర్ ఆనా.. హ‌మారే తెలంగాణ‌.!!

పనినుంచి కాస్త తీరిక దొరికితే హ‌మ్మ‌య్యా రిలాక్స‌వొచ్చు అనిపిస్తుంది. ఫ‌లితంగా కొత్తకొత్త ప్రదేశాలు చుట్టేయాల‌న్న ఆకాంక్ష మొద‌ల‌వుతుంది. మైండ్ ట్రావెల్ మూడ్‌లోకి వెళ్లిపోతుంది. దునియాలో ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్ ఇదే. ఈ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వాలు టూరిజాన్ని డెవ‌ల‌ప్ చేస్తుంటాయి. తెలంగాణ అందాల గురించి హీరో నాగార్జున మాట్లాడిన వీడియో చూశారు క‌దా.? ఆల‌స్య‌మెందుకూ.. జ‌రూర్ ఆనా.. హమారే తెలంగాణ‌.. ఏమేమున్న‌యో.. ఎలా వెళ్లాలో మేం చెప్తాం.

రామ‌ప్ప టెంపుల్

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పలంపేట గ్రామంలో రామ‌ప్ప టెంపుల్ ఉన్న‌ది. ఓరుగల్లును పాలించిన కాకతీయ రాజులు దీనిని నిర్మించారు. దీనిని రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు.

ప్ర‌త్యేక‌త‌: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందింది. దేవుడి పేరుమీద కాకుండా , ప్రధాన శిల్పి పేరు మీద ఆలయం ఉండటం రామ‌ప్ప‌ ప్ర‌త్యేక‌త‌. శిల్పాలు నాట్యం చేస్తున్నట్లుగా.. శిలలు సప్త స్వరాలను ఆలాపిస్తున్నట్లుగా ఉంటుందిక్క‌డ‌.

ఎలా వెళ్లాలి?: హైదరాబాద్ నుంచి 220 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. వ‌రంగ‌ల్ నుంచి సుమారు 80 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి వ‌రంగ‌ల్ రైల్లో వ‌చ్చి అక్క‌డి నుంచి రోడ్డు మార్గం గుండా రామ‌ప్ప చేరుకోవ‌చ్చు.

సోమ‌శిల

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉండే గ్రామం ఇది. కొల్లాపూర్ నుంచి 8 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. నాగ‌ర్ క‌ర్నూల్ నుంచి 54 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది.

ప్ర‌త్యేక‌త‌: తెలంగాణ మినీ మాల్దీవులుగా సోమ‌శిల‌కు పేరుంది. ప్ర‌పంచ న‌లుమూలల నుంచి ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు. "ఆధ్యాత్మిక - వెల్‌నెస్" విలేజ్‌గా గుర్తింపు పొందింది. కృష్ణానది ఒడ్డున ఆధ్యాత్మిక వాతావరణం.. నిర్మలమైన ప్రకృతి క‌ల‌గ‌లిపి ఆక‌ర్షిస్తోంది సోమ‌శిల‌.

ఎలా వెళ్లాలి?: హైద‌రాబాద్ నుంచి నాగ‌ర్ క‌ర్నూల్ దూరం 120 కిలోమీట‌ర్లు. రోడ్డుమార్గంలో నాగ‌ర్ క‌ర్నూల్ వెళ్లి అక్క‌డి నుంచి కొల్లాపూర్ మీదుగా సోమ‌శిల చేరుకోవ‌చ్చు.

బొగత జలపాతం

ములుగు జిల్లా వాజేడు మండలం బోగత గ్రామంలో ఉంది ఈ జ‌ల‌పాతం. వాజేడు మండలం కేంద్రానికి 5 కిలోమీటర్లు.. చత్తీస్‌గఢ్ సరిహద్దు నుంచి 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

ప్ర‌త్యేక‌త‌: తెలంగాణ న‌యాగ‌రా అని బొగ‌త జ‌ల‌పాతానికి పేరుంది. దీనిని చీకుల‌ప‌ల్లి జ‌ల‌పాతం అని కూడా అంటారు. దట్టమైన పచ్చని అడవుల మధ్య, కొండకోనల నుంచి హోరెత్తే నీటి హోయలతో నిండి తెల్ల‌టి నుర‌గ‌లు పొంగ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.

ఎలా వెళ్లాలి?: బొగత జలపాతం హైదరాబాద్ నుండి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏటూరు నాగారం నుంచి 25 కిలోమీట‌ర్లు ఉంటుంది. ఏటూరు నాగారం చేరుకొని అక్క‌డ్నుంచి బొగ‌త వెళ్లొచ్చు. భద్రాచలం నుంచి బొగ‌త జ‌ల‌పాతం దూరం 120 కిలోమీటర్లు.

అనంత‌గిరి హిల్స్

వికారాబాదు జిల్లా అనంతగిరిలో ఈ హిల్స్‌ ఉన్నాయి. ఈ కొండల పైనుంచి ఉస్మాన్ సాగర్, అనంత సాగర్ నీటి ప్ర‌వాహం ఉంటుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద ద‌ట్ట‌మైన అడ‌వి ఇది.

ప్ర‌త్యేక‌త‌: హైదరాబాద్ నుంచి ప్ర‌వ‌హించే మూసీ న‌ది.. ఈసీ న‌దుల‌కు అనంత‌గిరి జ‌న్మ‌స్థానం. ఇక్క‌డ 400 ఏళ్ల నాటి చ‌రిత్ర క‌లిగిన అనంత ప‌ద్మ‌నాభ స్వామి దేవాల‌యం ఉంది. విష్ణువు "అనంత పద్మనాభస్వామి" రూపంలో ఉండ‌ట‌మే ఈ ఆల‌య ప్ర‌త్యేక‌త‌.

ఎలా వెళ్లాలి?: అనంత‌గిరి హైద‌రాబాద్ నుంచి 90 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. రోడ్డుమార్గం నుంచి వికారాబాద్ చేరుకొని అక్క‌డి నుంచి అనంత‌ర‌గిరి వెళ్లొచ్చు. వికారాబాద్ నుంచి అనంత‌గిరి 5 కిలోమీట‌ర్లు ఉంటుంది.

ల‌క్న‌వ‌రం

ములుగు జిల్లాలో గోవిందరావుపేట మండలంలో బుస్సాపూర్ శివారులో లక్నవరం లేక్ ఉంటుంది. ఇక్క‌డ ద్వీపాలు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్శిస్తున్నాయి. ఎత్తైన కొండల నడుమ నిర్మించిన ఈ సరస్సు నేటి ఆధునిక ఇంజనీరింగ్‌ పరిజ్ఞానాన్ని పోలి ఉంటుంది.

ప్ర‌త్యేక‌త‌: లక్నవరం సరస్సు ప్రతాపరుద్రుని చేతుల మీదుగా రూపుదిద్దుకుంది. కళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కాకతీయ రాజులు ఆనాటి రైతాంగంపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చేవారనేందుకు ఈ సరస్సు సాక్షీభూతంగా నిలుస్తోంది.

ఎలా వెళ్లాలి?: లక్న‌వ‌రం వరంగల్ సిటీకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి వ‌రంగ‌ల్ మీదుగా ల‌క్న‌వ‌రం చేరుకోవాలంటే దాదాపు 210 కిలోమీటర్లు రోడ్డుమార్గం గుండా చేరుకోవ‌చ్చు.

యాద‌గిరి గుట్ట

యాదాద్రి జిల్లా భువ‌న‌గిరి మండ‌ల కేంద్రంలో యాద‌గిరిగుట్ట దేవ‌స్థానం ఉంది. దానికి స‌మీపంలోనే చారిత్రాత్మ‌క భువ‌న‌గిరి గుట్ట ఉంది. ఇవి రెండూ ప్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి.

ప్ర‌త్యేక‌త‌: యాద‌మ‌హ‌ర్షి త‌ప‌స్సు చేసిన ప్ర‌దేశంగా యాద‌గిరి గుట్ట‌ను కీర్తిస్తారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాన్ని క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం అని ఎలా పిలుస్తారో.. ఆ త‌ర్వాత అంత‌టి విశిష్ట‌త క‌లిగిన దేవాల‌యం యాద‌గిరి గుట్ట‌.

ఎలా వెళ్లాలి.?: హైద‌రాబాద్ నుంచి యాద‌గిరి గుట్ట 65 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. వ‌రంగ‌ల్ హైవే నుంచి బీబీ న‌గ‌ర్ మీదుగా భువ‌న‌గిరి చేరుకొని అక్క‌డి నుంచి గుట్ట‌పైకి వెళ్ల‌వ‌చ్చు.

జోడేఘాట్

కొమరంభీం జిల్లా కెరమెరి మండలంలో ఈ గ్రామం ఉంది. తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహీల‌కు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనోద్యమ నాయకుడు కొమ‌రం భీమ్ పుట్టిన నేల ఇది.

ప్ర‌త్యేక‌త‌: ప్రకృతి సౌందర్యం.. కొమరం భీం మెమోరియల్‌కు ఇది ప్రసిద్ధి చెందింది. కొమ‌రం భీమ్ విగ్ర‌హం కూడా ఇక్క‌డ ఫేమ‌స్‌. జోడేఘాట్ ప్ర‌కృతి అందాల‌ను తిల‌కించ‌డానికి ప్ర‌పంచ ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు.

ఎలా వెళ్లాలి.?: హైదరాబాద్ నుంచి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో జోడేఘాట్ ఉంది. క‌రిమెరి నుంచి 20 కిలోమీట‌ర్ల దూరంలో కాగ‌జ్ న‌గ‌ర్ నుంచి 52 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.

వెేయి స్తంభాల గుడి

ఇది హన్మకొండ ప‌ట్ట‌ణంలో ఉంది. వరంగల్ నుండి సుమారు 5 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగుబంగారమై కొలువైనాడు.

ప్ర‌త్యేక‌త‌: వేయిస్తంభాల గుడి ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అధ్భుతమైన వాస్తుకళతో అలరారుతోంది. ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏక పీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడ్డాయి.

ఎలా వెళ్లాలి?: హైదరాబాద్ నుంచి హ‌న్మ‌కొండ దాదాపు 150 కిలోమీట‌ర్లు ఉంటుంది. హ‌న్మ‌కొండ ప‌ట్ట‌ణం చేరుకొని అట్నుంచి వేయిస్తంభాల గుడికి వెళ్లొచ్చు. బ‌స్ స్టేష‌న్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో.. వ‌రంగ‌ల్ బ‌స్ స్టాప్ నుంచి 8 కిలోమీట‌ర్ల దూరంలో గుడి ఉంటుంది.

రాచ‌కొండ

రంగారెడ్డి-యాదాద్రి జిల్లాల‌ సరిహద్దుల్లో సంస్థాన్ నారాయణపురం స‌మీపంలో ఉంది. ఇది పురాత‌న చారిత్ర‌క క‌ట్ట‌డం. కోటపై నుంచి ప్రకృతి అందాలు రమణీయంగా.. ప్రశాంతంగా ఉంటాయి.

ప్ర‌త్యేక‌త‌: కాకతీయుల సామంత రాజులైన రేచర్ల పద్మనాయకులు పాలించిన నేల ఇది. ఈ కోట శత్రు దుర్భేధ్యం. పోత‌న భోగినీ దండ‌కం రాసింది ఇక్క‌డే. ఇప్ప‌టికీ బోగందానిమంచె అని ఉంటుంది. కోటపైనున్న‌ సంకెళ్ల బావికి ఎక్క‌డి నుంచి నీళ్లొస్తాయో తెలియ‌ని ర‌హ‌స్యం.

ఎలా వెళ్లాలి.?: హైదరాబాద్ నుంచి ఎల్బీనగర్ చేరుకొని అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లి రాచకొండ కోటకు చేరుకోవచ్చు. లేదా ఎల్బీనగర్ నుంచి చౌటుప్పల్ కు వచ్చి... అక్కడ నుంచి నేరుగా సంస్థాన్ నారాయణపురంలో ఉన్న కోటకు వెళ్లొచ్చు.

పొచ్చెర జ‌ల‌పాతం

ఆదిలాబాద్‌ జిల్లాలోని బోథ్‌ మండలానికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి ఆరు కిలోమీటర్ల దూరంలో పొచ్చెర గ్రామ సమీపంలో ఉంది.

ప్ర‌త్యేక‌త‌: 65 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఆకట్టుకుంటుంది. పొచ్చెర దగ్గర సినిమాలను సైతం చిత్రీకరిస్తుంటారు. ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ సరదాగా సాహసాలు చేయాలనుకునే వారికి పొచ్చెర జలపాతం దగ్గరకు ట్రెక్కింగ్‌ చేయడానికి వెళుతుంటారు.

ఎలా వెళ్లాలి.?: హైదరాబాద్‌ నుంచి 260 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంటుంది. ఆదిలాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరం. హైద‌రాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్లి అట్నుంచి పొచ్చెర చేరుకోవ‌చ్చు.

ఇలాంటి సుంద‌ర ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో తెలంగాణ‌లో చాలా ఉన్నాయి. ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌.. గోల్కొండ‌.. చార్మినార్‌.. మనసుని తడిమే కుంటాల.. మల్లూరు గుట్టలు.. పాండవుల గుహలు.. బాసర.. వేములవాడ.. నాగార్జునసాగర్ ఒకటా రెండా.? తెలంగాణ దర్శనీయ ప్రదేశాలు కోకొల్లలు. వీటితో పాటు తెలంగాణ ఆహార క‌ల్చ‌ర్‌లో భాగ‌మైన అంకాపూర్ చికెన్‌.. హైద‌రాబాద్ బిర్యానీ.. ఇరానీ చాయ్‌ను ఆస్వాదించ‌డానికి టూరిస్టులు వేలాదిమంది వ‌స్తుంటారు.!

Advertisement

Next Story

Most Viewed