Spicy Foods : టేస్టీగా ఉంటాయని స్పైసీ ఫుడ్స్ అధికంగా తింటున్నారా..? ఈ రిస్క్ పొంచి ఉన్నట్లే!

by Javid Pasha |
Spicy Foods : టేస్టీగా ఉంటాయని స్పైసీ ఫుడ్స్ అధికంగా తింటున్నారా..? ఈ రిస్క్ పొంచి ఉన్నట్లే!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలామంది ఇష్టపడే టేస్టీ ఆహారాల్లో స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. నిజానికి బిర్యానీ, చెకెన్, మటన్, ఎగ్ కర్రీ వంటి కూరలు, కొన్ని రకాల వేపుళ్లు వంటివి కారం కారంగా ఉంటేనే రుచిగా ఉంటాయని చాలా మంది ఇష్టపడుతుంటారు. అప్పుడప్పుడూ స్పైసీ ఎక్కువగా ఉన్న వాటిని తీసుకుంటే ఎమో కానీ, రుచిగా ఉన్నాయని ప్రతిరోజూ అదే చేస్తే మాత్రం హెల్త్ రిస్కులో పడ్డట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

ఇటీవల యూరోపియన్ దేశాల్లో స్పైసీగా ఉండే ఓ రకమైన బ్రాండ్ నూడుల్స్ నిషేధించారు. ఎందుకంటే హెల్త్ పరంగా అది మంచిది కాదని అక్కడి నిపుణులు సిఫార్సు చేశారట. అలాగనీ ప్రజలు స్పైసీ ఫుడ్ తినవద్దనే కఠినమైన ఆంక్షలేవీ అమలు చేయడం లేదు. కాకపోతే కారం అధికంగా తినడం ఎవరికైనా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి మనం రోజూ వాడే మిరప్పొడి, పచ్చి మిర్చి, మిరియాలు వంటి వాటిలో కారంగా అనిపించేందుకు అవసరమైన క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. అధికంగా తింటున్నప్పుడు ఇది నోటికి మండుతున్న అనుభూతిని కలిగిస్తుంది.

ఎక్కువగా తింటే ఏం జరుగుతుంది?

కారం సాధారణంకంటే ఎక్కువగా తినడంవల్ల గొంతులో, పొట్టలో మంట వంటి లక్షణాలు ప్రారంభం అవుతాయి. ఛాతీలో మంట, వికారం, విరేచనలు, అధిక రక్తపోటు, తరచుగా చెమటలు పట్టడం వంటి సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. అందుకే ఈ లక్షణాలు కనిపిస్తే స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడంవల్ల కూడా కావచ్చునని గుర్తుంచుకోవాలి. ఒకవేళ స్పైసీ ఫుడ్ తినకున్నా అలాంటి సింప్టమ్స్ కనిపిస్తే మాత్రం ఇతర అనారోగ్యాలవల్ల కావచ్చు అంటున్నారు నిపుణులు.

స్టమక్ పెయిన్‌, అజీర్తి సమస్యలు

కారం ఎక్కువున్న ఆహారాన్ని తిన్న తర్వాత కొందరికి గంట లేదా రెండు గంటల తర్వాత స్టమక్ పెయిన్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తే చాన్స్ ఉంటుంది. అట్లనే స్పైసీ ఫుడ్ తినగానే శరీరంలోని నరాలు ఎక్కువ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు అనీజీ ఫీలింగ్, అజీర్తి, శరీర భాగాల్లో మంట వంటివి కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి కారం తక్కువగా తినాలని సూచిస్తున్నారు.

క్యాన్సర్ రిస్క్ పెరగొచ్చు

దీర్ఘకాలంపాటు స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తింటే స్టమక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వివిధ అనారోగ్యాలతో ఇబ్బందిపడేవారు కారం అధికంగా తినకపోవడం చాలా మంచిది. గ్యాస్ట్రరైటిస్, గుండె జబ్బులు, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నవారు స్పైసీ ఫుడ్స్ తింటే రిస్క్ మరింత పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఆహారంలో భాగంగా ఉప్పు, కారం తినాల్సిందే కానీ.. ఆరోగ్యానికి హాని కలిగించేంత స్పైసీగా మాత్రమే ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story