Special Story: దేహం.. దానం, మరణానంతరం జీవించే అవకాశం

by Shiva |   ( Updated:2024-09-16 15:42:18.0  )
Special Story: దేహం.. దానం, మరణానంతరం జీవించే అవకాశం
X

ప్రయోగాలు మానవ పరిణామ ప్రగతికి పునాదులు. మనిషి ఎప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉండాలి అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. అయితే, ఎవరో చేస్తే ఆ ఫలాలు మనం అనుభవిద్దాం.. అంతేతప్ప మనం ఒక్క పైసా కూడా సమాజానికి ఉపయోగపడే పని చేయడానికి చాలామంది ముందుకురారు. కానీ, టీకాలు, ఇతర వైద్య పరమైన ప్రయోగాలు విదేశాల్లో చాలామంది స్వచ్ఛందంగా ముందుకువస్తారు. మనదేశంలో మాత్రం చనిపోయిన తర్వాత శరీరాన్ని కూడా వైద్య కళాశాలలకు దానం చేసేందుకు ముందుకురావడం లేదు. నిజానికి పరోపకారార్థం ఇదం శరీరం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.

మరణానంతరం శరీరం కాష్టంలో బూడిద అవుతుంది లేదా మట్టిలో కలిసిపోతుంది. కానీ, భావి వైద్యులకు ఆ శరీరం ఉపయోగపడి, వారి జ్ఞానాభివృద్ధికి తోడ్పడితే అంతకంటే ఏం కావాలి..? ఇదే ఆలోచన శరీర దాతలకు స్ఫూర్తిగా నిలుస్తున్నది. మూడు రోజుల కిందట మరణించిన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్​కి అప్పగించారు. గతంలో సోమనాథ్​ఛటర్జీ, జ్యోతిబసు, నానాజి దేశ్​ముఖ్​ వంటి ప్రముఖులు సైతం వైద్య పరిశోధనలకు శరీరాన్ని దానం చేశారు. హీరో జగపతిబాబు సైతం మరణానంతరం శరీరదానం చేస్తానని రెండేళ్ల కిందట ప్రకటించారు. శరీరదానం ఎందుకు చేయాలి? ఇలా చేయడం వల్ల సమాజానికి కలిగే ఉపయోగాలపై ప్రత్యేక కథనం. - అనిల్‌ కుమార్ శిఖా

శరీరం ఒక గ్రంథాలయం..

వైద్య విద్యార్థులకు శరీర నిర్మాణ అధ్యయనం అత్యంత ముఖ్యమైనది. ఆ విద్యార్థులకు బోధించడానికి చనిపోయిన మానవ శరీరాలను ఉపయోగించాల్సి ఉంటుంది. వైద్య కళాశాలలు ఏర్పడిన తొలినాళ్లలో శవాల కోసం శ్మశానాల చుట్టూ తిరిగేవారట. ఆ తర్వాత గుర్తుతెలియని మృతదేహాలను మార్చురీల నుంచి తీసుకునేవారు. ఆ తర్వాత సమాజంలో కొంత చైతన్యం పెరగడంతో కొందరు చనిపోయాక శరీర దానానికి ముందుకువస్తున్నారు. తమ శరీరం పరిశోధనలకు పనికి వస్తుందనే అవగాహనతో కొందరు ఇలా ముందడుగు వేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం దేశంలో 2014లో మొత్తం 6,916 మంది మాత్రమే శరీర దానం చేశారు. 2022లో ఆ సంఖ్య 16,041 మందికి పెరిగింది.

ఆ గ్రామం 185 మంది అంగీకారం

కర్ణాటకలోని బెళగావి జిల్లా షేగుణసి గ్రామానికి చెందిన 185మంది ఒకేసారి శరీరదానానికి అంగీకార ప్రతాలను అందజేశారు. ఇప్పటి వరకు 108 మృతదేహాలను వైద్య కళాశాలకు అందించారు. గతంలో పనిచేసిన ఓ కలెక్టర్​ వారికి అవగాహన కల్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆ దేహంతో ఏం చేస్తారు?

మానవ శరీరంలో ఏయే అవయవం ఏ స్థానంలో ఉంటుంది? అవి ఏ పరిమాణంలో ఉంటాయి? ఎలా పనిచేస్తాయి? అని చెప్పే శాస్త్రమే హ్యూమన్ అనాటమీ. ఇది మెడిసిన్ చదివే విద్యార్థులకు ఉపయోగపడుతుంది. మెడిసిన్ చదివే విద్యార్థులకు ఈ హ్యూమన్ అనాటమీ పాఠాలను బోర్డుపై, లేదంటే డిజిటల్ క్లాసుల్లో త్రీడీ ఫార్మాట్‌ పద్ధతిలో బోధిస్తుంటారు. ఇందులో ప్రధానంగా అవయవాల గురించి వివరిస్తారు. ఇంకొంత ప్రాక్టికల్‌గా ఉండేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన బొమ్మలను వినియోగిస్తారు. ఒకవేళ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు నేరుగా మనిషి అవయవ క్రమం గురించి మనిషి శరీరంపైనే ప్రయోగాత్మకంగా వివరించే అవకాశం ఉంటుంది. అలా.. చెప్పేందుకు మన ముందున్న మరో మార్గమే ఈ శరీరదానం. ఇలా దానంగా వచ్చిన దేహాలతో మెడిసిన్ విద్యార్థులకు ఈ క్లాసులు చెప్తారు. అందుకే.. మనం చనిపోయినా.. మన దేహం మరొకరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇలా శరీరదానాలు చేస్తుంటారు.

ప్రయోగాలు పూర్తయ్యాక..

దేశవ్యాప్తంగా ఎంతో మంది తమ డెడ్‌బాడీలను మెడికల్ కాలేజీలు దానం చేస్తుంటారు. అయితే .. ప్రయోగ పాఠాలు కంప్లీట్ అయిన తరువాత వాటిని మెడికల్ కాలేజీలు ఏం చేస్తాయనేదే ఎవరికీ తెలియదు. మృతుల చివరి కోరిక, వారి ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ ఆ మృతదేహాన్ని పూడ్చిపెట్టడం లేక ఖననం చేయడం చేస్తారు. అనాథ శవాల విషయంలో వారు ఎవరు? వారి మతం ఏంటి? అనేది క్లారిటీ ఉండదు కాబట్టి అలాంటి మృతదేహాలకు మెడికల్ కాలేజీలు తమ సౌకర్యం ప్రకారమే అంత్యక్రియలు పూర్తిచేస్తారు. ఒకవేళ డోనర్ మెడికల్ కాలేజీలో ప్రయోగాల అనంతరం పార్థివదేహాన్ని తిరిగి వారి కుటుంబసభ్యులకే అప్పగించాలని కోరితే ఆ సంప్రదాయం ప్రకారం కుటుంబసభ్యులకు అందిస్తారు. ఇక కొన్ని దేశాల్లో అయితే.. ఇలా దానంగా వచ్చిన బాడీలకు ఘనంగా అంత్యక్రియలు పూర్తిచేస్తారు. వారికి ఘనమైన నివాళి అర్పిస్తారు. అంతేకాకుండా ఆ శరీరాన్ని దానం చేసిన వారి కుటుంబాలను ఆ కార్యక్రమానికి ఆహ్వానించి వారికి తమ సంస్థ తరఫున కృతజ్ఞతలు చెబుతారు.

ఇవి గుర్తుంచుకోవాలి..

శరీరదానం చేయాలనే నిర్ణయం తీసుకున్న వారు ముందుగా తమ కుటుంబసభ్యులతో ఒప్పించాలి. ఎందుకంటే వ్యక్తి చనిపోయిన తరువాత ఆ సమాచారాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చి శరీరదానానికి సహకరించాల్సింది వాళ్లే కదా. వాళ్ల అనుమతి లేకుంటే మెడికల్ కాలేజీ వాళ్లకు ఆ వ్యక్తి చనిపోయిన విషయం కూడా తెలిసే అవకాశం ఉండదు. అలాగే శరీరదానం గురించి అంగీకారపత్రం రాసి ఇచ్చేందుకు వెళ్లేటప్పుడు తమ కుటుంబంలో ఆ బాధ్యతను తీసుకునే వారిని కూడా వెంటపెట్టుకుని వెళ్లాలి.

దేహం కూడా దేశం కోసమే..

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి భౌతిక కాయాన్ని బోధన, పరిశోధన నిమిత్తం ఎయిమ్స్ కు అప్పగించారు. గతంలో ఆయన తన దేహాన్ని వైద్యశాలకు అప్పగించేందుకు అంగీకారాన్న తెలియజేయగా శుక్రవారం ఏచూరి భౌతిక కాయానికి ఎయిమ్స్ వైద్యులకు శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అందజేశారు.

కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు

భారత రైల్వేశాఖ తన ఉద్యోగులు అవయవ దానం చేస్తే 42 రోజులు స్పెషల్​ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం రక్తదానం చేసిన తన ఉద్యోగులకు ఆ రోజు ప్రత్యేక సెలవు ఇస్తుంది. అవయవ దాత అంత్యక్రియలకు కేంద్రం రూ.పదివేలు మంజూరు చేస్తుంది. ఆగస్టు 3వ తేదీని జాతీయ అవయవదాన దినోత్సవంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

శరీర, అవయవదానం కోసం సంప్రదించాల్సిన వెబ్​సైట్లు

notto.mohfw.gov.in

www.jeevandan.ap.gov.in

jeevandan.gov.in

[email protected]

ఈ ప్రభుత్వ వెబ్​సైట్లలో వివరాలు అందుబాటులో ఉంటాయి. ఆర్గాన్​ ట్రాన్స్ ప్లాంటేషన్​ గైడ్​లోకి వెళ్లి సిటీలో ఏ ఆర్గాన్​లభ్యం అవుతుందో తెలుసుకోవచ్చు. ట్రాన్స్ ప్లాంటేషన్ కోఆర్డినేటర్​ఫోన్​నంబర్లు కూడా ఇందులో ఉంటాయి. నేత్ర, రక్తదాతల వివరాలు ఇందులో ఉంటాయి.

అవయవదానమూ గొప్పదే..

బ్రెయిన్​డెడ్​అయిన పరిస్థితుల్లో కుటుంబసభ్యుల అంగీకారంతో అవయవదానం చేస్తారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దాదాపు ఆరు, ఏడుగురికి జీవితాన్ని ఇవ్వవచ్చు. శరీరంలో దాదాపు 200 అవయవాలు మరొకరికి పనికివస్తాయని వైద్యులు చెప్తున్నారు. అవయవదానం చేయదలచుకున్నవారు జాతీయ స్థాయిలో నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ అసోసియేషన్ , ప్రాంతీయ స్థాయిలో జీవనదాన్ కార్యక్రమంలో పేర్లను నమోదు చేసుకోవచ్చు. బతికుండగానే మూత్రపిండాల వంటివి దానం చేయడం దీని కిందకే వస్తుంది. 2022 ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దేశంలో 0.01 శాతం మంది మాత్రమే మరణం తర్వాత తమ అవయవాలను దానం చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన లోపమే ఇందుకు కారణం. తెలంగాణలో అవయవ దాతల శాతం ఒక్కో మిలియన్​కు 5.48 శాతం ఉంది. అవయవదాన శస్ర్తచికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తూ తెలంగాణ ప్రభుత్వం 2016లోనే ఓ జీవోని జారీ చేసింది. అవయవ దానంలో ఆంధ్రప్రదేశ్​ నిష్పత్తి 0.3 మాత్రమే ఉంది. 2,600మంది కిడ్నీల మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

తమిళనాడు అవయవ దాతలకు అక్కడి స్టాలిన్​ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తున్నది. ఇదే విధానాన్ని ఏపీలో కూడా అమలుచేయాలని సావిత్రి బాయి పూలే ఎడ్యుకేషన్​అండ్​చారిటబుల్​ట్రస్ట్​చైర్​పర్సన్​గూడూరి సీతామహాలక్ష్మి ఆధర్వంలో ఓ బృందం సీఎం చంద్రబాబును కలిశారు. ఆయన దానికి సానుకూలంగా స్పందించారు. అవయవదాతలకు ‘వీరులకు వందనం’ పేరుతో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకువచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అవయవ, శరీర దానంపై అవగాహన ఉన్నవారికి సుపరిచుతురాలు గూడూరు సీతామహాలక్ష్మి. ఓ సాధారణ ఉపాధ్యాయురాలైన ఆమె.. ఓ నినాదంతో సమాజంలో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరణించినా జీవించండి.. అంటూ ఇరు రాష్ట్రాలలో అవయవదానంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆమె పిలుపు నందుకు ని తెలుగు రాష్ర్టాల్లో ఇప్పటి వరకు 58,000 మంది అవయవదానానికి సుముఖత వ్యక్తం చేస్తూ లేఖలు ఇచ్చారు.

అవయవ మార్పిడి.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలి

తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాల వలె అవయవదానం చేసిన వారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలని ఈ మధ్య కాలంలో సీఎం చంద్రబాబును కలిసి విన్నవించాం. ఆయన సానుకూలంగా స్పందించి గత అవయవదాన దినోత్సవ సందర్భంగా దానికి సంబంధించిన ఉత్తర్వులిచ్చారు. అవయదానం చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని, వారిని కర్ణాటక ప్రభుత్వం లాగే జాతీయ పర్వదినాలప్పడు సత్కరించి గౌరవించాలని కోరాం. అన్ని రకాల అవయవ మార్పిడి ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలో కి తీసుకు రావాలని, శరీర దాతల కోసం మహాప్రస్థానం వెహికల్స్ పంపించాలని విన్నవించాం. ఉన్నతస్థాయి విద్యా ప్రణాళికలలో ముఖ్యంగా వైద్య విద్యకు సంభందించిన అన్నిరకాల విభాగాల సిలబస్ లో అవయవదానం, శరీరదానం ఆవశ్యకత బోధనాంశంగా చేర్చాలి. అవయవదానం అంటే మరణించినా బతికుండడమే.. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు మా సంస్థ ద్వారా పలు కార్యక్రమాలను చేపడుతున్నాం. - గూడూరు సీతామహాలక్ష్మి, అఖిల భారత శరీర, అవయవ దాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు

Advertisement

Next Story

Most Viewed