Space Elevator : భూమి నుంచి అంతరిక్షానికి లిఫ్ట్.. ఇక రాకెట్లు లేకుండానే ఈజీగా వెళ్లిరావచ్చు!

by Javid Pasha |   ( Updated:2024-08-14 09:37:28.0  )
Space Elevator : భూమి నుంచి అంతరిక్షానికి లిఫ్ట్.. ఇక రాకెట్లు లేకుండానే ఈజీగా వెళ్లిరావచ్చు!
X

దిశ, ఫీచర్స్ : ఏవరైనా సాధ్యం కాని విషయాల గురించి మాట్లాడుతుంటే.. ఆకాశానికి నిచ్చెనలు వేయకు అంటుంటారు కొందరు. అంటే అవతలి వ్యక్తి చెప్పేది ఎప్పటికీ పాజిబుల్ కాదని వారి ఉద్దేశం. ముఖ్యంగా ఊహల్లో మునిగితేలేవారిని అలా పోల్చుతుంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆధునిక సాంకేతిక, శాస్త్రీయ పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ మానవుల ఊహలను వాస్తవాలుగా మల్చుకునే అనేక సంఘటనలు చూస్తున్నాం.

సాధ్యమేనా?

ఒకప్పుడు పక్షిలా గాలిలో ఎగరగలమా? అని ఊహించుకున్నప్పుడు, అది సాధ్యం చేసి చూపుతామని రైట్ బ్రదర్స్‌ ప్రకటించినప్పుడు కూడా ఎంతోమంది హేళన చేశారు. వాళ్లకు పిచ్చి పట్టిందనుకున్నారు. కానీ తర్వాత వారు విమానాలను కనిపెట్టగానే ప్రపంచమంతా మెచ్చుకున్నారు. హేళన చేసిన నోర్లే ప్రశంసలు కురిపించాయి. ఇప్పుడు జపాన్ దేశంలోని ‘ఒబయాషి కార్పొరేషన్’ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు కూడా అలాంటి మరో కొత్త ఆలోచన చేస్తున్నారు. భూమి నుంచి ఆకాశానికి లిఫ్ట్ ఏర్పాటు చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామని, వాస్తవ రూపం దాల్చే రోజులు వస్తాయని వారు పేర్కొంటున్నారు.

ఎప్పుడు ప్రారంభిస్తారు?

ప్రపంచంలోనే టోక్యో స్కైట్రీ వంటి బిగ్గెస్ట్ టీవీ టవర్ నిర్మించిన చరిత్ర, అనుభవం ఒబయాషి కంపెనీ సాంకేతిక నిపుణులకు ఇప్పటికే ఉంది. ప్రజెంట్ వీరు భూమి నుంచి అంతరిక్షానికి వెళ్లేందుకు లిఫ్ట్ నిర్మించే ఆలోచనను ప్రతిపాదిస్తుండగా.. దానిని స్పేస్ లిఫ్ట్ ఎలివేటర్‌గా పేరు కూడా డిసైడ్ చేశారు. పైగా వారు ఏర్పాటు చేసే ఈ సరికొత్త లిఫ్ట్ భూ కక్ష్యంలోకి, దాని వెలుపలి భాగాలకు విహార యాత్రలకు వెళ్లడానికి కూడా వీలు కల్పిస్తుండట. అనుకున్నట్లు జరిగితే వచ్చే సంవత్సరం నుంచే అంతరిక్షానికి లిఫ్ట్ ఏర్పాటు చేసే పనులు ప్రారంభిస్తామని, 2050 నాటికి పూర్తి చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు వ్యయాన్ని వంద బిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. అదే గనుక సాధ్యం అయితే అంతరిక్షానికి వెళ్లడానికి ఇక నుంచి రాకెట్లు అవసరం లేదని, స్పేస్ ఎలివేటర్‌ లేదా లిఫ్ట్‌లో వెళ్లి రావచ్చునని అంటున్నారు.

ఆలోచన ఎలా పుట్టింది?

అంతరిక్షంలోకి ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన కొత్తదేం కాదంటున్నారు నిపుణులు. 130 ఏండ్ల కిందట రష్యా రాకెట్ తయారీలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త కాన్ స్టాంటిన్ సియోల్ కోవ్ స్కీ 1895లో తన డ్రీమ్స్ ఆఫ్ ఎర్త్ అండ్ స్కై పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అప్పట్లోనే అతను అంతరిక్షానికి భూమి నుంచి లిఫ్ట్ లేదా టవర్ ఏర్పాటు చేయాలని భావించాడు. 22 మైళ్ల ఎత్తులో ఉండే ఒక ఊహాజనిత స్పేస్ ఎలివేటర్‌ను అతను తన పుస్తకంలో వర్ణించాడు. ఆ తర్వాత యూరి ఆర్ట్స్ టానోన్ దానిని మరింత లోతుగా ఆలోచించి విశ్లేషించాడు. భూమి నుంచి అంతరిక్షంలోని అనువర్తిత కక్ష్యలోని శాటిలైట్ వరకు ఒక కేబుల్ ఏర్పాటు చేయాలని, దాని సహాయంతో అంతరిక్ష యాత్ర చేయవచ్చునని ప్రతిపాదించాడు. ప్రజెంట్ జపాన్ శాస్త్రవేత్తలు దానిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుసాధ్యం చేయాలని నిర్ణయించుకున్నారు.

లిఫ్ట్ ఎలా పనిచేస్తుంది?

ఒబ యాషి కంపెనీ శాస్త్రవేత్తలు నిర్మించనున్న స్పేస్ ఎలివేటర్ లిఫ్ట్ నిర్మాణంలో భాగంగా అంతరిక్షం నుంచి భూ స్థిర కక్ష్యంలోని ఉపగ్రహం వరకు ఒక కేబుల్ ఏర్పాటు చేస్తారు. ఇది భూమి నుంచి సుమారు 96 వేల కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఇక్కడి శాటిలైట్ భూమితో భ్రమణ, పరిభ్రమణ వేగాన్ని పంచుకుంటుంది. కాగా శాస్త్రవేత్తలు ఏర్పాటు చేయనున్న కేబుల్‌ను కౌంటర్ వెయిట్ అని కూడా పిలుస్తున్నారు. ఇది భూమధ్య రేఖకు సమీపంలోని సముద్ర ప్రాంతంలోని ఓ ఎర్త్ పోర్ట్ నుంచి ఏర్పాటు చేస్తారు. ఇందులో బలాస్ట్ అనే నిర్మాణం కూడా ఉంటుందని, కేబుల్‌ టెన్షన్‌ను కూడా అక్కడే సర్దు బాటు చేస్తారని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

సముద్రంలో ఎర్త్ పోర్ట్!

ఇక సముద్రంలోని ఎత్తైన పోర్టుకు సమీపంలో నేలపై మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అక్కడి నుంచి సముద్రంలోని ఎర్త్ పోర్టుకు చేరుకునేలా సముద్ర మార్గంలోని కింది భాగం నుంచి ఒక సొరంగాన్ని నిర్మిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే కేబుల్ సహాయంతో క్లైంబర్ అనే విద్యుత్ ఆయస్కాంత వాహనాలు వేగంగా రోదసిలోకి వెళ్తాయి. అదే స్పీడుతో కిందికి కూడా వస్తాయి. ఇవి కేబుల్ ద్వారా పైకి వెళ్లే కొద్దీ అక్కడి వాతావరణంలో ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఆ కొరత తీర్చేందుకు లిఫ్టులో ఆమ్లజని ఏర్పాట్లు కూడా చేస్తారట. దీంతో భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్తున్నప్పుడు భార రహిత స్థితిని తట్టుకోవడం ఈజీ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed