ఏదో లోపం.. బాగా చేసినా వర్క్ సాటిస్‌ఫెక్షన్ ఉండటం లేదా?.. ఈ టిప్స్ మీకోసమే..

by Javid Pasha |   ( Updated:2024-08-25 09:27:29.0  )
ఏదో లోపం.. బాగా చేసినా వర్క్ సాటిస్‌ఫెక్షన్ ఉండటం లేదా?.. ఈ టిప్స్ మీకోసమే..
X

దిశ, ఫీచర్స్: చదువులో, ఉద్యోగంలో, ఇంటి పనిలో.. ఇలా ఎక్కడైనా సరే కొందరు బాగానే వర్క్ చేస్తుంటారు. కానీ ఎంతకీ సాటిస్ ఫెక్షన్ అనిపించదు. సరిగ్గా చేయలేదేమోనని కొన్నిసార్లు, ఇంకా బెటర్‌గా చేయాల్సిందని ఇంకొన్నిసార్లు తమకు తామే ఆలోచిస్తుంటారు. ఎంత చేసినా ఎక్కడో ఒక చిన్న అనుమానం వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా వర్క్ ప్లేస్‌లలో పలువురు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారని మానసిక నిపుణులు అంటున్నారు. సైకాలాజికల్ పరిభాషలో దీనిని ‘ఇంపోస్టర్ సిండ్రోమ్’గా కూడా పేర్కొంటున్నారు. అది ఎందుకు వస్తుంది? ఎలా బయడపడాలో ఇప్పుడు చూద్దాం.

అసంతృప్తి, ఆందోళ అధికమైతే..

సరిగ్గానే వర్క్ చేసినప్పటికీ.. తాము బాగా చేయలేకపోయామనే బాధ, అసంతృప్తి లేదా ఆందోళతో ఇబ్బంది పడటం, తమను తాము అసమర్థులుగా భావించుకోవడం తరచుగా కొనసాగితే ‘ఇంపోస్టర్ సిండ్రోమ్‌’కు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. అంటే దీని బారిన పడిన వ్యక్తులు తమలో తగిన సామర్థ్యం, ప్రతిభ, నైపుణ్యాలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించడంలో ఇబ్బంది పడతారు. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి, సామాజికంగా ఎదుర్కొనే పలు రకాల ఇబ్బందులు, వివక్షలు కూడా ఇందుకు కారణం కావచ్చునని సైకాలజిస్టులు అంటున్నారు.

మొదట ఎవరు గుర్తించారు?

బాగా చేయలేకపోయామనే ఆందోళనకు సంబంధించిన భావన ప్రజల్లో ఉన్నట్లు మొట్ట మొదటిసారిగా పౌలిన్ రోస్ క్లాన్స్, సుజానే ఈమ్స్ అనే పేరుగల ఇద్దరు సైకాలజిస్టులు 1978లో గుర్తించారు. కాకపోతే ఇది తీవ్రమైన మానసిక రుగ్మత కాదని, మనుషుల్లో సాధారణంగా వచ్చిపోయే ప్రాబ్లం లేదా సాధారణ రుగ్మత అని అప్పట్లోనే వారు పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో, సమాజంలో లింగ భేదాలు, వివక్ష, విద్యా వ్యవస్థలో లోపాలు, పక్షపాత ధోరణి వంటివి కూడా ఇందుకు కారణం అవుతుంటాయని కూడా గుర్తించారు. కానీ నేటి ఆధునిక కాలంలో వ్యక్తిగత ఆలోచనలు, సామాజిక పరిస్థితులు, వివిధ రకాల సమస్యలు కూడా ఇందుకు తోడవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. అయితే పనిలో అసంతృప్తి భావన నుంచి బయటపడే మార్గాలు కూడా ఉన్నాయి.

ప్రాబ్లం ఏమిటో ముందుగా గుర్తించండి

మీరు సమర్థులైనప్పటికీ మిమ్మల్ని మీరు నమ్మలేకపోవడం, మీరు చేసిన పనిపట్ల మీరు సంతృప్తి చెందకపోవడం కారణంగా గురయ్యే ఆందోళన నుంచి బయట పడాలంటే.. ముందుగా దానికి గల మూలాలను గుర్తించాలంటున్నారు సైకాలజిస్టులు. ఎందుకంటే మీలో ఎన్నో భావాలు, భావోద్వేగాలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించలేక ఇబ్బంది పడుతుండవచ్చు. మిమ్మల్ని మీరు మెచ్చుకోవడం, సంతృప్తిగా ఫీలవడం, మీపట్ల మీకు ప్రేమ, గౌరవం, కృతజ్ఞతా భావం వంటివి లేకపోవడం కూడా వర్క్‌లో అసంతృప్తికి, అనుమానానికి, ఆందోళనకు, అసమర్థ భావనకు దారితీస్తుంటాయి. అసలు లోపాన్ని గుర్తించి సెట్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం క్లియర్ అవుతుంది.

గత విజయాలను గుర్తు చేసుకోండి

మిమ్మల్ని మీరు అసమర్థులుగా ఊహించుకునే అతి ఆలోచనలు, అసంతృప్తి నుంచి బయటపడాలంటే ఇప్పటి వరకు మీరు సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ఉండాలి. అనవసర ఆందోళన, ప్రతీ దానికి ఒత్తిడికి గురవడం వంటి ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. ఇది మీ భావోద్వేగాలను సెట్ చేసుకోవడంలో సహాయపడుతుందని, వాస్తవాలను ఆలోచించేందుకు దోహదపడుతుందని నిపుణులు చెప్తు్న్నారు.

ప్రతీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోండి

మీరు సాధించిన విజయం చిన్నదే కావచ్చు. కానీ.. మీకు మీరు దానిని సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్స్ చెప్పుకోండి. నిజానికి మీపట్ల మీకు కృతజ్ఞతా భావం లేకపోతే కూడా సంతృప్తి ఉండదని గుర్తుంచుకోండి. స్వీయ సంతృప్తి, స్వీయ ప్రశంసలు, స్వీయ సంరక్షణ కూడా మీలో చక్కటి మార్పునకు దోహద పడతాయి. ఇంపోస్టర్ సిండ్రోమ్ వంటి రుగ్మతల నుంచి కూడా బయటపడేస్తాయి.

ఇతరులు ఏం అనుకుంటారోనని..

మీ గురించి మీరు ఆలోచించకుండా.. ఇతరులు మీ గురించి ఏం అనుకుంటున్నారో అనే వాటిపైనే ఎక్కువ ఫోకస్ చేయడంవల్ల కూడా మీలో అసమర్థ భావాలకు దారితీస్తాయి. కాబట్టి ఇక్కడ వాస్తవంగా నడుచుకోవాలి. ఎల్లప్పుడూ ఇతరుల వైపు నుంచి మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. మీకంటూ ఒక క్లారిటీ ఉంటే.. ఎవరు ఏం అనుకున్నా మీరు సక్సెస్ సాధిస్తారు. దీంతోపాటు సరైన అంచనాలు, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ ఎస్టీమ్, దయాగుణం వంటివి కూడా మీలో ఏదో లోపం ఉందనే ఆలోచనలను దూరం చేస్తాయి. అలాగే పనిలో అసమర్థత, అసంతృప్తి భావాల నుంచి కూడా బయటపడేయడంలో సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story