సింగ్ ఈజ్ కింగ్ : నష్టపోతున్నా తక్కువ ధరకే పెట్రోల్ విక్రయం

by Sathputhe Rajesh |
సింగ్ ఈజ్ కింగ్ : నష్టపోతున్నా తక్కువ ధరకే పెట్రోల్ విక్రయం
X

దిశ, ఫీచర్స్ : ఎవరైనా లాభాలు ఆర్జించేందుకే వ్యాపారం చేస్తారు. దీర్ఘకాలికంగా నష్టాలు పలకరిస్తే చేసేదేం లేక చేతులెత్తేస్తారు. చివరకు ఆ బిజినెస్ క్లోజ్ చేసినా మరో రూట్ వెతుక్కుంటారు. కానీ యూఎస్‌, అరిజోనాలో భారత సంతతికి చెందిన వ్యక్తి మాత్రం తన నష్టాల బాధను సంతోషంగా భరిస్తున్నాడు. రోజుకు $500(దాదాపు 39 వేలు) నష్టపోతున్నప్పటికీ ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్న స్థానికులకు సాయంచేయాలనే లక్ష్యంతో తన ఫిల్లింగ్ స్టేషన్‌లో తక్కువ ధరకే ఫ్యూయల్ విక్రయిస్తూ వార్తల్లో నిలిచాడు.

వివరాల ప్రకారం.. సింగ్ తన సరఫరాదారు నుంచి గ్యాలన్‌కు $5.66(రూ. 442) చొప్పున గ్యాస్ కొనుగోలు చేశాడు. కానీ సదరు ధర కంటే 47 సెంట్లు తక్కువకు అంటే గ్యాలన్‌ $5.19కే విక్రయిస్తున్నాడు. ఇదే విషయమై స్థానిక మీడియాతో మాట్లాడిన సింగ్.. 'నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నేను చేస్తున్న పని చాలా విలువైంది. ప్రస్తుతానికి ప్రజల వద్ద పెద్దగా డబ్బు లేదు. మనకు సరిపడా సంపద ఉంటే ఇతరులకు సాయపడాలని మా అమ్మానాన్న నేర్పించారు. మీకు కూడా స్థోమత ఉంటే కచ్చితంగా ఇతరులతో పంచుకోవాలి' అన్నారు. అంతేకాదు ఇతరులకు సాయం చేయగల సామర్థ్యాన్ని తనకు కల్పించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఫిల్లింగ్ స్టేషన్‌లో తాము ఎదుర్కొంటున్న నష్టాలను కొంతవరకు పూడ్చేందుకు తనతో పాటు అతని భార్య కూడా అక్కడే ఓవర్ టైమ్ పనిచేస్తున్నట్లు చెప్పాడు.

అయితే, సింగ్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. గత మార్చిలోనూ కొనుగోలు చేసిన ధర కంటే 10 సెంట్ల తక్కువ ధరకు గ్యాస్‌ విక్రయించాడు. అప్పటి నుంచి ధరలు ఒక డాలర్‌కు పైగా పెరగడంతో ప్రజలకు వీలైనంత సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో ధరను మరింత తగ్గించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story