Scent in the soil: వర్షంలో తడిసిన మట్టిలో సువాసన ఎందుకు వస్తుంది?.. అసలు కారణం ఇదే!

by Javid Pasha |
Scent in the soil: వర్షంలో తడిసిన మట్టిలో సువాసన ఎందుకు వస్తుంది?.. అసలు కారణం ఇదే!
X

దిశ, ఫీచర్స్ : ఎండలు కాసీ కాసీ గట్టిపడ్డ మట్టి పెళ్లలపై తొలకరి చినుకులు పడగానే వెదజల్లే సువాసనలను మీరెప్పుడైనా ఆస్వాదించారా? మన్నులో అలాంటి పరిమళాలు ఎందుకు వీస్తాయనే అనుమానం కలిగిందా? ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు 1960 కంటే ముందు నుంచే పరిశోధనలు కొనసాగించారు. చివరకు అసలు విషయాన్ని కనుగొన్నారు. అయితే ఆకట్టుకునే ఆ స్మెల్‌కు పెట్రికోర్ (Petrichor) అని పేరు కూడా పెట్టారు. మట్టిలో ఉండే స్ట్రెప్టోమైసెస్ అనే బ్యా్టీరియా విడుదల చేసే జియోస్మిన్ అనే రసాయన సమ్మేళనాల కారణంగా మట్టిలో ఈ విధమైన సువాసన వస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

స్వచ్ఛమైన మట్టిలో సువాసనలతో పాటు మానవాళికి మేలు చేసే పలు బ్యాక్టీరియాలు కూడా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనదేశంలో అయితే పరిమళాలు వెదజల్లే మట్టిని సేకరించి అత్తర్ల తయారీలోనూ వినియోగిస్తున్నారు. ఉత్తర‌ప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో వీటిని తయారు చేస్తున్నారు. అంతేకాకుండా మట్టిలో సువాసనకు కారణమయ్యే స్ట్రెప్టోమైసెస్ బ్యాక్టీరియాను యాంటీ బయోటిక్ మందుల తయారీలోనూ వాడుతుంటారని నిపుణులు చెప్తున్నారు. కాగా అరుదుగా కొందరు మట్టిలో వచ్చే సువాసనకు అట్రాక్ట్ అయి రుచి చూడాలని కూడా అనుకుంటారు. కానీ మట్టిని తినడం మాత్రం అస్సలు మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు.

Advertisement

Next Story