ఈ గ్రామంలో కుక్కలే కోటీశ్వరులు.. ఎలా సంపాదించాయంటే..

by Hajipasha |   ( Updated:2022-08-25 10:26:16.0  )
ఈ గ్రామంలో కుక్కలే కోటీశ్వరులు.. ఎలా సంపాదించాయంటే..
X

దిశ, ఫీచర్స్: మనుషులతో సన్నిహితంగా మెలిగే జీవుల్లో శునకాలది ప్రత్యేక స్థానం. విశ్వాసానికి మారుపేరుగా, ఇంటికి కాపలాగా ఈ మూగజీవాలను ఇష్టపడని వారుండరు. మానసిక ఉల్లాసాన్ని కలిగించి, ఒంటరితనాన్ని దూరం చేసే పెట్ డాగ్స్ అనాదిగా మనుషులకు నేస్తాలుగా మారిపోయాయి. ఇదే క్రమంలో గుజరాత్‌లోని ఓ గ్రామం వీధి కుక్కలకు విలాసవంతమైన జీవితాన్ని కల్పిస్తోంది. ఆ గ్రామంలో ఇదొక సంప్రదాయం కాగా.. అక్కడి శునకాలు కోట్ల రూపాయల ఆస్తి కలిగివుండటం మరింత ఆశ్చర్యపరుస్తోంది.

బనస్కాంత జిల్లా, పాలన్‌పూర్ తాలూకాలోని కుష్కల్ గ్రామంలో వీధి కుక్కల కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ గ్రామానికి చెందిన పూర్వీకులు స్ట్రీట్ డాగ్స్ కోసం 20 బిగాల వ్యవసాయ భూమిని కేటాయించారు. అప్పటి నుంచి ఈ భూమిపై వచ్చే ఆదాయం మొత్తాన్ని వీధి కుక్కల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారు. ఈ భూమి టెక్నికల్‌గా కుక్కల పేర్లపై లేకున్నప్పటికీ కులమతాలకు అతీతంగా గ్రామస్తులందరూ ఈ గొప్ప సంప్రదాయాన్ని నేటికీ పాటిస్తున్నారు. ఈ భూమి మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.5 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అంతేకాదు ఈ ప్రాంతంలోని ఏ ఒక్క కుక్క కూడా ఖాళీ కడుపుతో ఉండదని గ్రామస్తులు హామీ ఇస్తున్నారు. ఇక్కడ దాదాపు 150 శునకాలు ఉండగా.. వాటికి క్రమం తప్పకుండా లడ్డూలు తదితర స్వీట్లు తినిపిస్తుండటం విశేషం.

ప్రత్యేక పాత్రలతో ప్రత్యేక స్థలంలో ఆహారం..

700 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో వీధి కుక్కలకు ఆహారం అందించేందుకు ప్రత్యేకంగా ఒక ఎత్తైన స్థలాన్ని నిర్మించారు. ఈ ఆహారం తయారీతో పాటు వడ్డించేందుకు ప్రత్యేక పాత్రలు కొనుగోలు చేశారు. ప్రతి గ్రామస్తుడు వీధి కుక్కలకు తగినంత ఆరోగ్యకరమైన ఆహారం అందించడంలో శ్రద్ధ వహిస్తాడు. కాగా ఈ ప్రపంచాన్ని మూగజీవాలకు స్నేహపూర్వకంగా మార్చేందుకు ఇక్కడి ప్రతి ఇల్లు ప్రయత్నిస్తుందని స్థానికుడు హితేష్ చౌదరి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed