రాజస్థాన్ టూర్..

by Mahesh |   ( Updated:2024-11-27 15:25:59.0  )
రాజస్థాన్ టూర్..
X


ప్రకృతిలోకి ప్రయాణం భలే మజాగా ఉంటుంది. అడవులు, కొండలు, కోనలు, నదులు, జలపాతాలు, హిమాలయాలు, సముద్రాలు అన్ని చుట్టేసాను. ఎడారి ఒక్కటే మిగిలింది ఈ ప్రయాణాన్ని ఎడారి కేంద్రంగా రూపొందించుకున్నాము. అందుకే రాజస్థాన్ బయలుదేరాము. ఆరుగురు మహిళలం.. అందులో ముగ్గురు రచయితలు. ఇద్దరు 65 ఏళ్లు పైబడిన వారు. మరో ఇద్దరు 60 ఏళ్లు పైబడిన వారు. ఒక్కరు యాభై ఏళ్ళు దాటిన వారు. అందరం పెద్దవాళ్ళు కావడం వల్ల ఐదు రోజుల టూర్‌కు మాత్రమే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. హైదరాబాద్ లో ఉదయం 4.45కు విమానమెక్కి 7.45 కంతా జైపూర్ లో దిగిపోయాము. అప్పటికే మయూర్ ట్రావెల్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన వాహనం మా కొరకు సిద్ధంగా ఉంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నగర పర్యటనకు బయలుదేరారు. జైపూర్ ను పింక్ సిటీ అంటారు కదా... అలా కనిపించడం లేదు ఎందుకు? అని అడిగాను డ్రైవర్‌ని. ఆ ప్రాంతం కొత్తగా అభివృద్ధి చెందిందని, పాత జైపూర్ అంతా గులాబీ రంగులో ఉంటుందని చెప్పాడు. అప్పుడప్పుడే తెరుస్తున్న ఒక హోటల్‌లో వేడి వేడి పరోటాలు చేయించు కొని తిని, నగర పర్యటన మొదలు పెట్టాము. అలా వెళ్తుంటే గులాబీ రంగు భవనాలు రోడ్డుకు ఇరువైపులా కనువిందు చేశాయి.

దేశంలోనే రెండో అతిపెద్ద కోటగోడ

జైపూర్ రాజస్థాన్ రాష్ట్రానికి రాజధాని. పెద్ద నగరం. హెరిటేజ్ నగరం. రాజ్ పుత్ పాలకుడు రెండో సవాయ్ జైసింగ్ అమెర్ ఆ నగరాన్ని స్థాపించాడు. అతడు 1699 నుంచి 1743 వరకు పరిపాలించాడు. అతని పేరు మీద ఆ నగరానికి జైపూర్ అనే పేరు వచ్చిందట. యునెస్కో 2019 లో ఆ నగరాన్ని వారసత్వ సంపదగా గుర్తించిందట. ముందుగా మేము అమెర్ కోటకు బయలుదేరాము. దానిని అంబర్ కోట అని కూడా పిలుస్తారు. అల్లంత దూరంగా కోట, దాని చుట్టూ ప్రహరీగోడ కనిపించాయి. పన్నెండు కిలోమీటర్ల పొడుగుతో ఆ గోడ దేశంలో రెండో స్థానంలో ఉందని గైడ్ చెప్పాడు. మేము నేరుగా అమెర్ రాజ భవనానికి చేరుకున్నాము. ప్రవేశ రుసుము భారతీయులకు ఒక్కరికి 152 రూపాయలు. ఉదయమే కాబట్టి రద్దీ పెద్దగా లేదు. అది రాజపుత్, మొఘల్ వాస్తు నిర్మాణ శైలిలో ఉంది. మహల్ నిర్మాణము ఒకేసారి జరుగలేదట. నాలుగు స్థాయిలలో జరిగిందని గైడ్ చెప్పాడు. దివాన్- ఏ - ఖాస్, షీష్ మహల్, సుఖ్ నివాస్ మొదలైన విభాగాలున్నాయి. కొన్ని చోట్ల గోడల పైన, పైకప్పులో బంగారం, నీలం, పచ్చల సహజ రంగులతో చేసిన చిత్రకళ ఆనాటి రాజుల వైభవానికి తార్కాణం.

ఆనాడే ఏసీ చల్లదనంతో రాజ మందిరాలు

రాజస్థాన్ వేడి అధికంగా ఉండే ప్రాంతం కాబట్టి, ఆ రోజుల్లోనే నీటి క్యాసెట్ మీదుగా వీచే గాలుల ద్వారా చల్లని వాతావరణం (AC) ఏర్పడే విధంగా నిర్మించడం నాటి సాంకేతిక జ్ఞానానికి నిదర్శనం. రాజా మాన్ సింగ్‌కు పన్నెండు మంది భార్యలు. ప్రతి ఒక్కరికి విడి విడిగా గదులు ఉన్నాయి. పట్టపురాణి గది అద్దాలతో ప్రత్యేకంగా ఉన్నది. ఆ గదులకు ఎదురుగా రాణులందరూ కాలక్షేపం చేయడానికి వీలుగా విశాలమైన ప్రాంగణం ఉన్నది. ప్యాలెస్ లోపలి నుంచి రెండున్నర కిలోమీటర్ల సొరంగ మార్గం ఉన్నది. దీని గుండా జైఘర్ కోటకు చేరుకోవచ్చు. సమయం లేనందు వల్ల నేను ఆ మార్గం గుండా వెళ్ళలేకపోయాను. ఆసక్తి, సమయం ఉన్నవాళ్ళు ఆ సొరంగ మార్గంలో వెళితే చాలా బాగుంటుంది. అందంగా అలంకరించిన ఏనుగుల మీద కొందరు పైకి వెళుతున్నారు. మేము మాత్రము కాలినడకనే పైకి వెళ్ళాము. పైనుంచి చూసే వాళ్ళకు ఆ ఏనుగుల వరుస ఆ కాలం నాటి రాచరిక దర్పాన్ని గుర్తుకు తెస్తుంది.

గజ గమన విశేషం

మేము ఏనుగు సవారి కోటలో కాకుండా మరోచోట ఎక్కువ సేపు చేయడానికి వీలుగా ఉన్న హాథీ గావ్ అనే ప్రదేశానికి వెళ్ళాము. కోటకు సవారీకి వెళ్ళిన ఏనుగులు ఒక్కొక్కటిగా అక్కడికి చేరుకుంటున్నాయి. అక్కడ ఏనుగు సవారికి భారతీయులకు ఒక్కరికి I800 రూపాయలు. ఒక్క ఏనుగుపై విధిగా ఇద్దరు కూర్చోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య ఏనుగు మీద కూర్చొని వెళుతుంటే ఆ గజగమనానికి అనుగుణంగా మనసు కూడా అడుగులు వేసింది. అక్కడి నుంచి జల్ మహల్ చూసుకుంటూ సిటీ ప్యాలెస్ చేరుకున్నాము. జల్ మహల్‌లో లోపలికి ప్రదేశాన్ని నిషేధించారు. బయటనుంచే చూసి తృప్తి పడ్డాము.

సిటీ ప్యాలెస్‌లో అద్భుత జలకలశం

సిటీ ప్యాలెస్ నిర్మాణం 1729 లో మొదలై 1732 లో పూర్తయింది. రాజపుత్ మొఘల్ నిర్మాణ శైలిలో ఉన్నది. అక్కడ సవాయి మాన్ సింగ్ మ్యూజియం కూడా ఉన్నది. అక్కడ ఉన్న బహిరంగ వరండా పైకప్పులో ఉన్న పెద్ద శాండిలైర్ ప్రత్యేక ఆకర్షణ. ఆనాడు ఉపయోగించిన గన్‌లను గోడలకు ఇరువైపులా అందంగా అమర్చారు. మరో పక్కన ఉన్న వెండి జలకలశం సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తుంది. దాని ఎత్తు 5.2 అడుగులు. 340 కిలోల వెండితో దానిని తయారు చేశారట. ఆ వెండి కలశం కాంతిలో మన ప్రతిబింబాలు కనిపిస్తాయి. దసరా, సంక్రాంతి, తీజ్ లాంటి పండుగల సంప్రదాయ ఉత్సవాలు ఇప్పటికీ అక్కడ జరుగుతాయని గైడు చెప్పాడు. అక్కడి నుంచి మేము ఆల్బర్ట్ మ్యూజియం వెళ్ళాము. అక్కడ కూడా ఆనాటి దుస్తులు, ఆయుధాలు, అందమైన కళాకృతులతోపాటు మమ్మీ ఉండడం విశేషం. సాయంత్రం 5.30 లకే మాకు జైసల్మేర్ రైలు ఉన్నందువల్ల క్షుణ్ణంగా దానిని చూడలేక పోయాము.

గాలి సులువుగా లోనికి వచ్చేలా నిర్మాణాలు


తిరుగు ప్రయాణంలో మేము జైసల్మేర్ నుంచి జైపూర్ చేరుకునేసరికి మధ్యాహ్నం ఒకటిన్నర అయింది. IRCTC నుంచి రైల్వేస్టేషన్లో ముందే బుక్ చేసుకున్న గదులలో స్నానాదికాలు ముగించి, బయటకు వెళ్ళి భోజనం చేశాము. తరువాత తిరుగు ప్రయాణంలో చూడవచ్చు అనుకున్న హవా మహల్ సందర్శనకు వెళ్ళాము. అది జైపూర్ నగరం నడి బొడ్డులో ఉన్నది. దానిని the Palace of winds అని కూడా పిలుస్తారు. జైపూర్ స్థాపకుడైన మహారాజా సవాయి జైసింగ్ మనుమడు సవాయి ప్రతాప్ సింగ్ 1799 లో నిర్మించాడు. లాల్ చంద్ ఉస్తాద్ దాని రూపకర్త. ఐదు అంతస్తుల భవనం. పిరమిడ్ ఆకారంలో ఉన్నది. ఎత్తు 50 అడుగులు. 953 చిన్న చిన్న ఉన్నాయి. వీటిని జీరో ఖాస్ అని అంటారు. వీటి వల్ల గాలి సులభంగా లోపలికి వస్తుంది. అందువల్ల మందిరం అంతా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది.

గాజు రంగుటద్దాలతో సూర్యకాంతి

రాణివాసపు స్త్రీ లు బయటి వారికి కనిపించకుండా బయట జరిగే విశేషాలను, వేడుకలను చూడడానికి వీలుగా ఆ మహలు నిర్మాణం జరిగింది. రోడ్డు వైపు ఉన్న మందిరం వెనుక వైపు చూసి చాలా మంది మహల్ ముందు భాగమని భ్రమపడతారు. వెనక వైపు నిర్మాణం కూడా అంత అందంగా ఉన్నదన్నమాట. మందిరం లోనుంచి పైకి వెళ్ళడానికి చిన్న చిన్న దారులున్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తాత్కాలికంగా పైకి వెళ్ళడాన్ని నిషేధిస్తారట. మేము పైకి కూడా వెళ్ళి చూసాము. రెండు అంతస్తుల వరకు మాత్రమే పైకి వెళ్ళడానికి అనుమతిస్తారు.లోపల కిటికీలకు గాజు రంగుటద్దాలు బిగించడం వల్ల సూర్యకాంతి గది అంతటా పరుచుకుని ఎంతో అందంగా కనిపిస్తుంది. మహల్ లోపల కింది భాగంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా విశాలమైన ప్రాంగణం ఉన్నది. ప్రవేశ రుసుము భారతీయులకు ఒక్కరికి 52 రూపాయలు.

గిరిజ పైడిమర్రి

ట్రావెలర్

99494 43414

Advertisement

Next Story

Most Viewed