Pregnant health : పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే.. గర్భిణులు ఈ పని తప్పక చేయాల్సిందే!

by Javid Pasha |   ( Updated:2024-10-15 14:42:41.0  )
Pregnant health : పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే.. గర్భిణులు ఈ పని తప్పక చేయాల్సిందే!
X

దిశ, ఫీచర్స్ : సంతానం కనాలనుకున్న స్త్రీకి గర్భధారణ అనేది అత్యంత సంతోషాన్ని కలిగించే అశంగా పేర్కొంటారు. అదే సందర్భంలో ఆరోగ్యంపట్ల అధిక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని కూడా ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణ సమయంకంటే, ప్రెగ్నెన్సీ టైమ్‌లో తీసుకునే ఆహారాల్లో ఎక్కువ పోషక విలువలు ఉండేలా చూసుకోవాలని, అప్పుడే గర్భిణితోపాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే అందుకోసం తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఆకుకూరలు

ఫోలిక్ యాసిడ్, ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి, గర్భిణులు ఆకు కూరలు తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బచ్చలి కూర, మెంతికూర, ఆవాలకూర, తోట కూర, పాలకూర వంటివి వారంలో రెండు మూడు సార్లయినా తింటూ ఉండాలి. ఇవి గర్భిణికి మేలు చేయడంతోపాటు పుట్టబోయే శిశువు మెదడు, వెన్నుపూస అభివృద్ధికి సహాయపడతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.

ప్రోటీన్, ఫైబర్ రిలేటెడ్ ఫుడ్స్

కడుపులో శిశువు ఆరోగ్యంగా ఎదగాలన్నా, గర్భిణి హెల్తీగా ఉండాలన్నా ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ కలిగిన ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. వివిధ రకాల పప్పులు, కిడ్నీ బీన్స్‌, చిక్కుళ్లు వంటి కాయగూరల్లో ఇవి పుష్కలంగా లభిస్తాయి. శిశువు శరీర నిర్మాణానికి, కండరాల అభివృద్ధికి సహాయపడతాయి. అలాగే ఫైబర్ కలిగి ఉన్నందున గర్భిణుల్లో మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తాయి.

మిల్క్ ప్రొడక్ట్స్

ప్రోటీన్లు, విటమిన్లతోపాటు క్యాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి గర్భిణులు పాలు, పెరుగు, జున్ను వంటి మిల్క్ ప్రొడక్ట్స్ తప్పక తీసుకోవాలని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇవి పుబ్టబోయే బిడ్డలో దంతాలు, ఎముకల దృఢత్వానికి మేలు చేస్తాయి.

తాజా పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయలు తినడంవల్ల అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి గర్భిణులు తింటే, వారికే కాకుండా పుట్టబోయే శిశువుకు మేలు జరుగుతుంది. కాబట్టి అరటి, ద్రాక్ష, నారింజ, యాపిల్ వంటి పండ్లు డైట్‌లో భాగంగా ఉండేలా చూసుకోవాలి.

గుడ్లు, తృణ ధాన్యాలు

గర్భిణులు తగిన పోషకాలు అందించే ఆహారాల్లో గుడ్లు, తృణ ధాన్యాలు చాలా ముఖ్యమైనవి. గుడ్లలో ప్రోటీన్, విటమిన్ డి, కోలిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కడుపులోని బిడ్డ మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యం. ఇక తృణ ధాన్యాల విషయానికి వస్తే గోధుమలు, రాగులతో చేసిన రొట్టెలు, అలాగే బ్రౌన్ రైస్, ఓట్స్ కూడా గర్భిణుల ఆరోగ్యానికి మంచిది. వీటన్నింటిలో ఫైబర్, విటమిన్ బితోపాటు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవన్నీ గర్భిణులకు, పుట్టబోయే సంతానానికి పోషకాలు అందించడంలో ఇవి అద్భుతంగా సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. గర్భిణుల ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాల్లో నిర్ణయం తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story