పేరెంట్స్ ఎప్పుడూ ఇలా చేయకండి.. పిల్లల ఆత్మ విశ్వాసం దెబ్బతినవచ్చు!

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-15 10:43:57.0  )
పేరెంట్స్ ఎప్పుడూ ఇలా చేయకండి..  పిల్లల ఆత్మ విశ్వాసం దెబ్బతినవచ్చు!
X

దిశ, ఫీచర్స్: పిల్లల విషయంలో పేరెంట్స్ ఎప్పుడూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రులు చేసే కొన్ని పొరపాట్లు పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అలా చేయడం వల్ల పిల్లలు మానసికంగా కుంగిపోతారు. చిన్నపిల్లల మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. వారు జీవితంలో ఎదగాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు నిరంతరం కృషి చేస్తుంటారు. దీనికోసం వారిని చిన్నప్పటి నుంచే కొన్ని విషయాలను అలవాటు చేస్తారు. ఈ ప్రాసెస్‌లోనే చాలామంది పేరెంట్స్ పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. ఆ ప్రవర్తన పిల్లలను మానసికంగా, శారీరకంగా బాధపడేలా చేస్తుంది. వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ పొరపాట్లు ఏమిటో తెలుసుకోండి.

అతి జాగ్రత్త తీసుకోవడం: పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిదే. కానీ, కొందరు పేరెంట్స్ అతి జాగ్రత్తగా ఉంటారు. పిల్లలను ఏ పని చేయనివ్వరు. వారు సొంతంగా ఎలాంటి పని చేయాలనుకున్నా..ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోనివ్వరు. ఇలా చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. అందుకే తల్లిదండ్రులు వారి నిర్ణయాల పట్ల దృష్టి సారించాలి. ఏదైనా తప్పు చేస్తే, ఆ పొరపాటును సరిదిద్దుకునేలా చేయాలి. ఇలా కాకుండా ప్రతీ చిన్న నిర్ణయంను పేరెంట్స్ తీసుకున్నారంటే.. పిల్లలు స్వతహాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతారు.

ఇతరులతో పోల్చడం: చాలామంది పేరెంట్స్ వారి పిల్లలను చదువు విషయంలో లేదా ప్రవర్తనలో కానీ ఇతరుల పిల్లలతో పోలుస్తుంటారు. ఇలా ఎప్పుడూ పోల్చకండి. చిన్న విషయాలు అయినా పెద్ద విషయాలు అయినా ఇతరులతో పోల్చడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. వారు ఏదైనా చేయాలనుకుంటే.. దానికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వండి. ఇలా చేయడం వల్ల వారిలో ఉత్సాహం పెరుగుతుంది.

చిన్న పొరపాట్లను తప్పుగా చూడడం: పిల్లలు ఏదైనా పని చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఆ విషయంలో కొంతమంది పేరెంట్స్ వారిపై కొప్పడుతూ తిట్టడం తేదా కొట్టడం చేస్తుంటారు. అలా ఎప్పటికీ చేయకూడదు. వాళ్లు ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తల్లిదండ్రులు ప్రశాంతంగా వారికి తెలియజేయాలి. ఇలాంటి పొరపాట్లు సహజమేనంటూ వారిలో ఉత్సాహం నింపాలి.

ప్రశంస: పిల్లలు చిన్న చిన్న విషయాలకే చాలా సంతోషపడుతుంటారు. ఏదైనా పని చేస్తే, అందులో వారు విజయం సాధిస్తే పేరెంట్స్ వారిని ప్రశంసించాలి. అలా చేయకపోతే వారు బాధపడతారు. ఇది పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ప్రతీ చిన్ని విషయానికి పేరెంట్స్ అప్రిషియేట్ చేయండి. ఒకవేళ వారు ఓడిపోతే, గెలవాలనే ప్రోత్సాహంను ఇవ్వండి.

Advertisement

Next Story