అతి తినడం, తాగడం చేస్తున్నారా?.. అది మానసిక రుగ్మత కావచ్చు

by Vinod kumar |   ( Updated:2023-03-05 15:17:20.0  )
అతి తినడం, తాగడం చేస్తున్నారా?.. అది మానసిక రుగ్మత కావచ్చు
X

దిశ, ఫీచర్స్: ఎక్కువ బాధలో లేదా సంతోషంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు కొందరిలో అతి ధోరణి కనిపిస్తూ ఉంటుంది. అంటే వారు ఏది చేసినా అధికంగా చేస్తారు. అన్నం, పండ్లు, స్నాక్స్ ఏవి కనిపించినా ఫుల్లుగా లాగించేస్తారు. ఇక టీవీముందు కూర్చుంటే క్షణంలో పదులకొద్దీ చానల్స్ మారుస్తూ ఉంటారు. దీనినే మానసిక నిపుణులు అతిధోరణి, అతి ప్రవర్తన అని కూడా అంటున్నారు.


‘‘నాకు వీకెండ్స్ అన్నీ ఒకేలా గడుస్తుంటాయి. సోఫాలో కూర్చొని సెల్‌ ఫోన్ లేదా, టీవీలో ప్రోగ్రామ్స్ మార్చుతుంటాను. సోషల్ మీడియాలో దూరిపోతాను. ఇక ఆన్ లైన్‌లో ఫుడ్ ఆర్డర్ తప్పక చేస్తాను. అసలు విషయం ఏంటంటే.. ఇదంతా చేస్తూనే నేను ఏదో ఒకటి తింటూనే ఉంటాను. నాకు సరిపోయే దానికంటే అతిగా తింటాను. ఎంతకీ ఈ అలవాటు పోవడం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు 34 ఏళ్ల యువకుడు. అతనొక్కడే కాదు, ఇలాంటివారు చాలామంది తారసపడుతుంటారని ఫ్యామిలీ కౌన్సెలర్లు, సైకాలజిస్టులు చెప్తున్న మాట.


అయితే ఈ అతిగా తినే అలవాటు, అతి ప్రవర్తనా ధోరణి ఉన్నవారెవరూ తామలా ఉండాలని అనుకోరు. ఈ అలవాటు మంచిది కాదని తెలిసిప్పటికీ మానుకోలేక పోతుంటారు. కానీ కాస్త మనస్సు పెడితే లేదా మానసిక నిపుణులను సంప్రదిస్తే అతి ధోరణి సమస్యకు చెక్ పెట్టవచ్చు.

భావోద్వేగాల ప్రభావం..

భావోద్వేగాల సమయంలోనూ మనుషుల్లో అతి ధోరణి, అతిగా తినడం, తాగడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయని నిపుణులు చెప్తున్నారు. ఎక్కువగా ఆహారం తీసుకోవడం, షోలను బ్యాక్ టు బ్యాక్ చూడటం, సోషల్ మీడియాకు అతుక్కుపోవడం, తక్కువ సమయంలోనే ఎక్కువగా మద్యం సేవించడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం కూడా అతిధోరణి లక్షణాల్లో భాగం. ఇటువంటి అలవాట్లను చెడు అలవాట్లుగానే ఎప్పుడూ పరిగణించలేమని అవి మానసిక రుగ్మతలు కూడా అయి ఉంటాయని సైకాజిస్టులు చెప్తున్నారు.


తీవ్రమైన భావోద్వేగాలు, ఒంటరి తనం, ఆత్మ న్యూనతా భావం, తమపై తాము విశ్వాసం కోల్పోవడం వంటి మానసిక సమస్యలు కలిగిన వారు ఇటువంటి అతి ధోరణి ప్రదర్శిస్తుంటారు. పైగా తమ అతి ప్రవర్తనతో త్వరగా అలిసిపోయినట్లు కనిపిస్తారు. ప్రతీ విషయంలో అసంతృప్తి కనబరుస్తుంటారు.

పరిష్కారమేది..?

ఇటువంటి అతి ధోరణి సమస్యకు చక్కటి పరిష్కారం ఏంటంటే.. ఏ పరిస్థితులైతే ప్రభావితం చేస్తున్నాయో వాటికి దూరంగా ఉండటం. ఉదాహరణకు సోషల్ మీడియా, టీవీ, ఒంటరితనం, బాధ వంటి వాటికి దూరంగా ఉండాలి. లేదా ఆ సమయంలో ఒంటరిగా ఉండకూడదు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుండటం చేయాలి. ఫుడ్, చిరుతిళ్లు అందుబాటులో ఉంటే తినాలనిపిస్తుంది కాబట్టి వాటిని అందుబాటులో లేకుండా చూసుకోవాలి. అప్పటికీ సమస్యకు పరిష్కారం లభించకపోతే మానసిక నిపుణులను సంప్రదిస్తే అతి ధోరణి ప్రవర్తనకు చక్కటి ట్రీట్మెంట్ ఇస్తారు.

ఇవి కూడా చదవండి :

HuggieBot 3.0: HuggieBot 3.0.. వెచ్చని కౌగిలింతను అందించే రోబట్ !

Advertisement

Next Story