రెగ్యులర్‌గా బెడ్‌షీట్స్ ఉతకడం లేదా? అయితే మీ ఇంట్లో ఈ సమస్యలు వచ్చాయేమో చెక్ చేసుకోండి..

by Prasanna |   ( Updated:2023-08-03 08:18:41.0  )
రెగ్యులర్‌గా బెడ్‌షీట్స్ ఉతకడం లేదా? అయితే మీ ఇంట్లో ఈ సమస్యలు వచ్చాయేమో చెక్ చేసుకోండి..
X

దిశ, ఫీచర్స్: బెడ్ షీట్స్ క్రమం తప్పకుండా వాష్ చేయని ఇంట్లో అనేక రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే చాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పైకి మురికిగా కనిపించనప్పటకీ మృత చర్మ కణాలు, చెమట ఫలితంగా ఏర్పడే చిన్న చిన్న పురుగులు గడ్డలు, మొటిమలు, దురద, ఇతర చర్మ సమస్యలకు కారణమవుతాయని చెప్తున్నారు. బెడ్ షీట్స్ మురికితో నిండిపోయినప్పుడు.. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని, ఇది వివిధ చర్మ వ్యాధులకు దారితీస్తాయని వివరిస్తున్నారు.

బెడ్‌షీట్‌లను ఎన్ని రోజులకోసారి మార్చాలి?

నిద్రలో ఎక్కువగా చెమటలు పడితే లేదా ఇన్ఫెక్షన్‌లకు గురయ్యే చర్మ పరిస్థితులు ఉంటే.. కనీసం వారానికి ఒకసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు బెడ్‌షీట్‌లను మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు క్రమం తప్పకుండా స్నానం చేయడం, గాయాలైనప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడం, చర్మాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచడం వల్ల స్కిన్ ఇన్‌ఫెక్షన్స్ ప్రమాదాన్ని మరింత తగ్గించవచ్చు. చర్మ వ్యాధి వచ్చినట్లు అనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్.

బెడ్‌షీట్స్ మార్చకపోవడం వల్ల సంక్రమించే ఇన్‌ఫెక్షన్స్

1. ఫోలిక్యులిటిస్

బెడ్‌షీట్‌లను తరచుగా మార్చకపోతే చెమట, డెడ్ స్కిన్ సెల్స్, ఆయిల్స్ పేరుకుపోయి హెయిర్ ఫోలికల్స్ మూసుకుపోతాయి. ఇది ఫోలిక్యులిటిస్‌కు దారి తీస్తుంది. జుట్టు కుదుళ్ల చుట్టూ ఎరుపు, ఎర్రబడిన గడ్డలు ఏర్పడతాయి. స్టెఫిలోకాకస్ ఆరియస్ వంటి బాక్టీరియా తరచుగా ఈ సంక్రమణలో పాత్ర పోషిస్తుంది.

2. మొటిమలు

డర్టీ బెడ్‌షీట్స్ బ్యాక్టీరియా, సెబమ్‌ కలిగి ఉంటాయి. ఇది మొటిమలను తీవ్రతరం చేస్తుంది. రాత్రి బెడ్‌షీట్‌ను యూజ్ చేశాక.. ఉదయం మొటిమల తీవ్రత పెరుగుతుంది. మంట ఎక్కువైపోతుంది.

3. రింగ్ వార్మ్

శిలీంధ్రాలు వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందుతాయి. అపరిశుభ్రమైన బెడ్‌షీట్‌.. వాటికి అనువైన సంతానోత్పత్తి ప్రదేశాన్ని అందిస్తుంది. రింగ్‌వార్మ్.. ఫంగల్ ఇన్‌ఫెక్షన్, కలుషితమైన షీట్‌ల ద్వారా వ్యాపిస్తుంది. చర్మంపై దురద, ఎరుపు, వృత్తాకార దద్దుర్లను కలిగిస్తుంది.

4. ఇంపెటిగో

ఇంపెటిగో అనేది స్ట్రెప్టోకోకస్ లేదా స్టెఫిలోకాకస్ వంటి హానికరమైన బ్యాక్టీరియా.. చర్మంపైన ఏర్పడిన కట్స్, గాయాల ద్వారా ప్రవేశించినప్పుడు సంభవించే అంటువ్యాధి. మురికిగా ఉండే బెడ్‌షీట్స్ ఈ బ్యాక్టీరియాను కలిగి ఉండవచ్చు. ఇది ఇంపెటిగో వ్యాప్తికి దారితీయవచ్చు.

5. అథ్లెట్స్ ఫుట్

అథ్లెట్స్ ఫుట్.. మరొక సాధారణ ఫంగల్ ఇన్ఫెక్షన్. అపరిశుభ్రమైన షీట్లలో ఉండే శిలీంధ్రాల ద్వారా ఇది సంక్రమిస్తుంది. నిద్రపోతున్నప్పుడు పాదాలను బెడ్‌షీట్‌తో కప్పేస్తాం. శిలీంధ్రాలు అనుకూలమైన పరిస్థితులను కనుగొంటే.. అవి దురద, ఎరుపు, పాదాలపై చర్మం పొట్టుకు కారణమవుతాయి. కాబట్టి ఈ చర్మ వ్యాధులను నివారించడానికి.. బెడ్‌షీట్‌లను క్రమం తప్పకుండా మార్చడం మంచిది.

Read more :

హోటల్ బెడ్స్‌పై తెల్లటి బెడ్ షీట్‌లను మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?

మైండ్ డైట్ ఫర్ చిల్డ్రెన్

Advertisement

Next Story