మాటలు వద్దు.. మేసేజ్‌లే ముద్దు.. ప్రతి 10 మందిలో ఏడుగురిది అదే ధోరణి

by Javid Pasha |   ( Updated:2024-07-06 08:08:22.0  )
మాటలు వద్దు.. మేసేజ్‌లే ముద్దు.. ప్రతి 10 మందిలో ఏడుగురిది అదే ధోరణి
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిస్తే గంటల తరబడి మాట్లాడుకునేవారు. నలుగురైదుగురు స్నేహితులు ప్రత్యక్షంగా కలుసుకొని తెగ ముచ్చట్లు చెప్పుకునేవారు. సెల్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక కూడా చాలా మంది బంధువులకో, ఆత్మీయులకో, సహచరులకో కాల్ చేసి మనసారా పలకరించేవారు. యోగ క్షేమాలు అడిగేవారు. కానీ ఇప్పుడదంతా జాన్తా నై అంటున్నారు జనాలు.. పక్క పక్కనే ఫర్ లాంగ్ దూరంలో ఉన్నా మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. వాటి స్థానాన్ని 90 శాతం టెక్ట్స్ మెసేజెస్ ఆక్రమించాయని ప్రముఖ బిజినెస్ సొల్యూషన్ ప్రొవైడర్‌గా అయిన LivePersonకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

4000 మందిపై సర్వే

స్టడీలో భాగంగా పరిశోధకులు 18 నుంచి 34 ఏండ్ల మధ్య వయస్సుగల వివిధ దేశాలకు చెందిన మొత్తం 4000 మందిని సర్వే చేశారు. నేటి మిలీనియల్స్ (1981-1996), అలాగే జెన్‌ జెడ్ (1997-2012) ఆలోచనలు, ప్రాధాన్యతలు, కమ్యూనికేషన్ విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి 10 మందిలో ఏడుగురు వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుకోవడం కంటే టెక్ట్స్ మెసేజెస్ ద్వారా డిజిటల్ కమ్యూనికేషన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు గుర్తించారు.

65 శాతం అదే ఆసక్తి

సర్వే చేయబడిన వారిలో 65 శాతం మంది మొబైల్ ఫోన్‌లో టెక్ట్సింగ్ ద్వారానే స్నేహితులు, కొలీగ్స్‌, సన్నిహితులతో కమ్యూనికేట్ అవుతామని వెల్లడించారు. కాగా ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. యునైటెడ్ స్టేట్స్ అండ్ యునైటెడ్ కింగ్‌డమ్ రెండింటిలోనూ దాదాపు 74 శాతం మంది మిలీనియల్స్ అండ్ జెన్ జెడ్స్ ఇతరులతో డిజిటల్‌గానే కమ్యూనికేట్ అవుతున్నారట. ఇక టెక్ట్స్ మెసేజెస్ విషయానికి యూకేలో 74 శాతం మంది, అమెరికన్లు 73 శాతం మంది ఇదే ఫాలో అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎనలైజ్ చేసినప్పుడు 69 శాతం మంది మాట్లాడుకోవడానికి బదులు వచన సందేశాలు చేసుకోవడానికే ప్రయారిటీ ఇస్తున్నారట.

ఎక్కడికెళ్లినా వదలట్లేదు..

ఇక యువత విషయానికి వస్తే దాదాపు 62 శాతం మంది బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తారనే కారణంతో మాత్రమే ఫోన్‌ను మర్చిపోకుండా వెంట తీసుకెళ్తుండగా, ఇంట్లో ఉన్న వాలెట్‌ను చాలా సందర్భాల్లో మర్చిపోతున్నారు. మరో 70 శాతం మంది ఏవైనా మెసేజెస్ వస్తే చూసుకోవడానికి అనుకూలంగా నిద్రపోయేముందు చేతికి అందేంత దూరంలోనే ఫోన్లను పెడుతున్నారు. విచిత్రం ఏంటంటే.. 66 శాతం మంది తమ డివైస్ లేదా ఫోన్‌ను టాయిలెట్‌కి వెళ్లినప్పుడు కూడా వెంటతీసుకెళ్లి మెసేజెస్ చెక్ చేస్తున్నారు. ఈ డిజిటల్ కనెక్టివిటీ ఎంతగా ప్రభావితం చేస్తుందో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

సంభాషణల మధ్యలో కూడా..

కొందరు పెద్దలు డైనింగ్ టేబుల్ వద్ద, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఫోన్‌చెక్ చేయడం మంచిది కాదని నమ్ముతుండగా మిలీనియల్స్, జెన్ జెడ్స్ మాత్రం అది పట్టించుకోవడం లేదు. పైగా 42 శాతం మంది డైనింగ్ టేబుల్‌పై ఉన్నప్పుడు, 28 శాతం మంది సంభాషణల మధ్యలో ఫోన్లలో నోటిఫికేషన్లు, టెక్ట్స్ మెసేజెస్ చెక్ చేస్తున్నారట. సర్వే చేయబడిన సమూహంలో దాదాపు 70 శాతం మంది ప్రత్యక్షంగా మాట్లాడుకోవడం మెసేజెస్ ద్వారా కమ్యూనికేట్ అవడం కంఫర్టుగా ఉన్నట్లు భావిస్తున్నారట. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్తులో వ్యాపారాలు, ఆన్‌లైన్ కొనుగోళ్లు వంటివన్నీ మరింత ఎక్కువగా టెక్ట్సింగ్ రూపాన్ని సంతరించుకునే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed