- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Fitness : రోజూ ఆ పని చేస్తే చాలు.. జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదిక!

దిశ, ఫీచర్స్ : ఈపొద్దు రేపట్ల యూత్ పోరగాల్లు మస్తు మారిపోయిన్రు తెల్సా.. నలుగురు పెద్దోల్లు గుమిగూడితే చాలు ఇప్పుడు ఎక్కువగా వినిపించే ముచ్చట గిదే. ఏ మాటకామాట జెప్పుకోవాలె.. ఎంతైనా జమానా మారిందబ్బా.. పిల్లలు మస్తు ఉషారైతున్రు అంటూ ఒకటే బాతాఖాని వేస్తరు. నిజమే మల్ల.. అన్ని విషయాల్లోనూ అట్లనే ఉంది. ముఖ్యంగా అందం, ఆరోగ్యం, ఫిట్‌నెస్ మీద ఎక్కువ ఫోకస్ జేస్తున్నరు యువతీ యువకులు. అందుకోసం జిమ్‌లకు పోయి వర్కౌట్లు చేస్తన్నరు. అయితే అందరికీ వర్కౌట్లే కాదు.. డ్యాన్స్ చేసినా అచ్చం అదే ఫలితం ఉంటుందని బోస్టన్, మసాచుసెట్స్‌లోని నార్తీస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం వెల్లడైంది. అదెట్లనో చూద్దామా..
ఎంతసేపు చేయాలి?
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఫిట్‌గా కనిపించాలంటే జిమ్‌కు వెళ్లి గంటల తరబబడి కసరత్తులు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి రోజు ఉదయం ఆడుతూ పాడుతూ కూడా అదే ఫలితం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. మీ వంటగదిలో ఉండి కూడా జస్ట్ 20 నిమిషాలు డ్యాన్స్ చేస్తే చాలు మీ ఫిట్ నెస్‌కు ఢోకా లేదని చెప్తున్నరు. నేషనల్ హెల్త్ సర్వీస్ మార్గదర్శకాల ప్రకారం కూడా.. పెద్దలు వీక్లీ 150 నిమిషాల సాధారణ లేదా తమ శరీర తత్వాన్ని బట్టి తీవ్రమైన వ్యాయామం చేయాలె. ఇగ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారమైతే పెద్దలు వారానికి 150 నుంచి 300 నిమిషాలు మోడరేట్ లేదా 75 నుంచి 150 నిమిషాల వ్యాయామం చేయాలి. ఇందుకోసం జనాలు రకరకాల మార్గాలు అనుసరిస్తుంటారు. రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి తమకు నచ్చినవి చేస్తుంటారు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుంటారు. కానీ చాలామంది డ్యాన్సింగ్‌కు ప్రయారిటీ ఇవ్వరు. కానీ ఇది కూడా అంతే మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.
అధ్యయనం ఇలా..
హెల్త్ అండ్ ఫిట్‌నెస్ విషయంలో డ్యాన్స్ ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు 18 నుంచి 83 ఏండ్ల మధ్య వయస్సు గల మొత్తం 48 మందిని పరిశీలించారు. మోడరేట్ వ్యాయామానికి ఈక్వల్‌గా ఉండాలంటే డైలీ ఎంత సేపు డ్యాన్స్ చేస్తే బాగుంటుందో, దానివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనం చేకూరుతుందో గమనించారు. మ్యూజిక్ వింటూ డ్యాన్స్ చేయడం, అట్లనే మ్యూజిక్ లేకుండా డ్యాన్స్ చేయడాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ రెండు పరిస్థితుల్లో హార్ట్ రేట్, బ్రీతింగ్ వంటివి పరిశీలించారు.
డ్యాన్స్‌తో బెనిఫిట్స్
దీనిని బట్టి డ్యాన్స్ కూడా మోడరేట్ వ్యాయామం లెక్కనే మేలు చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. కేలరీలను బర్న్ చేయడంలో, ఆరోగ్యానికి మేలు చేయడంలో ఇతర వ్యాయామాలు, జిమ్‌లో వర్కౌట్లకు సమానంగా డ్యాన్స్ కూడా ప్రభావం చూపిందని కనుగొన్నారు. మ్యూజిక్ వింటూ డ్యాన్స్ చేసినా, వినకుండా చేసినా సేమ్ బెనిఫిట్స్ ఉంటున్నాయని గుర్తించారు పరిశోధకులు. అందుకే సమయం లేకనో, బయటకు వెళ్లలేకనో వ్యాయామాలు చేయలేనివారు, బయటకు, జిమ్‌లకు వెళ్లలేని వారు ఇంట్లోనే రోజూ 20 నమిషాలు డ్యాన్స్ చేసినా సరిపోతది. ఇక్కడ డ్యాన్స్ అంటే ఏదో ఫలానా విధంగానే చేయాలనేం లేదు. మీకు ఇష్టమొచ్చినట్టు స్టెప్పులేస్తూ ఎగిరినా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయంటున్నారు నిపుణులు.