Mind Detoxification : మిమ్మల్ని మీరే మార్చుకునే ‘మైండ్ డిటాక్సిఫికేషన్’.. ఆ సందర్భంలో అలా చేస్తూ..!

by Javid Pasha |
Mind Detoxification : మిమ్మల్ని మీరే మార్చుకునే ‘మైండ్ డిటాక్సిఫికేషన్’.. ఆ సందర్భంలో అలా చేస్తూ..!
X

దిశ, ఫీచర్స్: బాడీ డిటాక్సిఫికేషన్ గురించి మీరు వినే ఉంటారు. శరీరంలో పేరుకుపోయిన విషపూరిత పదార్థాలను తొలగించేందుకు చేసే ప్రయత్నమే ఇది. వైద్య నిపుణుల సహకారంతో గానీ, ఇంటిలోనే పాటించగలిగే సహజసిద్ధమైన చిట్కాలతో గానీ ఇలా చేస్తారు. రకరకాల పానీయాలు, ఆహార పదార్థాల ద్వారా పేరుకుపోయిన మలినాలు బయటకు పోతాయి. ఆ తర్వాత రిలాక్స్ అవుతారు. అయితే ఇక్కడ శరీరానికే కాదు. బిజీ లైఫ్‌లో ప్రతికూల ఆలోచనలతో ఇబ్బంది పడుతున్న వారి మనసుకూ డిటాక్సిఫికేషన్ (నిర్విషీకరణ) అవసరం అంటున్నారు నిపుణులు.

ఒక్కమాటతో..

ఒక మంచి మాట మనసును హత్తుకున్నట్లే.. ఒక చెడు మాట హృదయాన్ని గాయపరుస్తుంది. అలాగే ఒక మంచి ఆలోచన మీలో ఆనందాన్ని, సానుకూల దృక్పథాన్ని కలిగించినట్లే.. ఒక చెడు ఆలోచన మీలో మానసిక ఆందోళనకు, రుగ్మతకు, తద్వారా ఇతర అనేక సమస్యలకు దారితీస్తుంది. ఇక్కడ చెడు ఆలోచనలు అంటే.. మీ ప్రవర్తనను, మీ జీవితాన్ని ప్రభావితం చేసే ప్రమాదకర లేదా ప్రతికూల ఆలోచనలుగా అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు.

వాస్తవాలు - భ్రమలు

ఎప్పుడైతే మీరు వాస్తవాలను విస్మరించి భ్రమలకు లోనవుతుంటారో ప్రతికూల ఆలోచనలు వేధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నిపుణులు చెప్తున్నమాట. అరుదుగా కొన్నిసార్లు ఇవి శారీరక సమస్యలు, హార్మోన్ల అసమతుల్యతవల్ల కూడా సంభవించే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువగా పుట్టి పెరిగిన వాతావరణం, సమాజంలో నుంచి నేర్చుకోవడం, జీవితంలో ఎదుర్కొన్న వివివిధ సంఘటనలు, అనుభవాల ఆధారంగా మీలో ప్రతికూల ఆలోచనలు లేదా ప్రతికూల దృక్పథం ఏర్పడుతుంటాయని మానసిక నిపుణులు చెప్తున్నారు. అలాంటి ఆలోచనలను డైవర్ట్ చేయడానికి నచ్చిన పుస్తకం చదవడం, వ్యాయామం చేయడం, ఇతర యాక్టివిటీస్‌లో పాల్గొనడం వంటి చేయవచ్చు. వీటితోపాటు ఇంకేం చేయవచ్చో చూద్దాం.

యాక్షన్ .. రియాక్షన్

మీ చుట్టూ జరిగే సంఘటనలు, వివిధ విషయాలపట్ల మీరు స్పందించే తీరు, ఆయా పరిస్థితులను అర్థం చేసుకునే విధానాన్ని అర్థం చేసుకోగలిగితే.. వాటిని నియంత్రించడం కూడా సులువు అంటున్నారు నిపుణులు. అందుకే రోజువారీ అనుభవాలు, ఆయా సందర్భాల్లో మీ ప్రవర్తన, స్పందనపై ఒక అవగాహనకు రావాలి. మీలో ప్రతికూల స్పందనలు ఎక్కువగా ఉంటున్నాయా? సానుకూల స్పందనలా? అలాగే వాటిపట్ల మీ వైఖరిలో ఏది ఎక్కువగా ఉంది అనేది మీకు మీరు పరిశీలించుకోండి. అవసరమైతే మీ కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు, సహచరులు సహాయం తీసుకోండి. మీలో ప్రతికూల ఆలోచనలు రావడానికి గల కారణాలను విశ్లేషిస్తూ వాటిని పోగొట్టేందుకు మీకు మీరే శిక్షణ ఇచ్చుకోండి. ఈ విధమైన మైండ్ డిటాక్సిఫికేషన్ మెథడ్ మీలో గొప్ప మార్పును తెస్తుంది.

హేతుబద్ద ఆలోచన

ప్రతికూల ఆలోచనలు పదే పదే మీ మైండ్‌లో మెదులుతుంటే.. అవి ఎందుకు వస్తున్నాయి? వాస్తవ పరిస్థితులు ఏమిటి? మీరు ఆ ఆలోచనల్లో ఎందుకు కూరుకుపోవాల్సి వస్తోంది? అని ప్రశ్నించుకుంటే సగం సమస్యల నుంచి బయటపడిట్లే అంటున్నారు నిపుణులు. మీకున్న భయాలు, ఆందోళనలు మీరు ఎదుర్కొన్న అనుభవాలే అందుకు కారణమైతే వాటికి వ్యతిరేక ఆలోచనలవైపు మీ మనసును నిమగ్నం చేయండి. ఏ విషయంలో అయినా సరే హేతు బద్ధంగా లేదా తర్కబద్ధంగా ఆలోచిస్తే సరైన మార్గమేదో తెలుస్తుంది.

పోలిక వద్దు

ప్రతికూల ఆలోచనలకు కారణం ప్రతీ విషయంలో ఇతరులతో పోల్చుకోవడం కూడా ఒకటి అయి ఉండవచ్చు. విద్యార్థులు, ఉద్యోగులు సహజంగానే కొన్ని అంచనాలను కలిగి ఉంటారు. వాటిని అందుకోలేనప్పుడు కూడా ఇతరులతో పోల్చుకొని బాధపడే పరిస్థితులు ప్రతికూల దృక్పథానికి కారణం అవుతుంటాయి. కాబట్టి ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేయాలంటున్నారు నిపుణులు.

విమర్శలకు భయపడకండి

కొందరు విమర్శను అస్సలు తట్టుకోలేరు. ఫలితంగా ప్రతికూల ఆలోచనల్లో కూరుకుపోయి మైండ్ పాడు చేసుకుంటారు. నిజానికి వాటిని సానుకూలంగా స్వీకరిస్తే మీరు అద్భుతాలు చేస్తారని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే సద్విమర్శలు స్వీకరించడం మీలోని లోపాలను అధిగమిస్తారు. మీ మైండ్ సెట్ మార్చుకుంటారు. విజయం వైపు నడిపించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అందుకే విమర్శను స్వీకరించడం కూడా నిజమైన ‘మైండ్ డిటాక్సిఫికేషన్’ అవుతుంది అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed