మానసిక దృఢత్వమే సక్సెస్ మంత్ర.. ఇలా చేస్తే మీరు కూడా..

by Javid Pasha |
మానసిక దృఢత్వమే సక్సెస్ మంత్ర.. ఇలా చేస్తే మీరు కూడా..
X

దిశ, ఫీచర్స్ : ‘‘జీవితంలో ఏది కోల్పోయినా మానసిక దృఢత్వాన్ని మాత్రం కోల్పోకండి. ఎందుంటే.. అదొక్కటి ఉంటే చాలు మీరు కోల్పోయిన మిగతావన్నీ ఏదో ఒకరోజు తిరిగి సంపాదించుకోవచ్చు’’ అంటున్నారు నిపుణులు. వాస్తవ జీవితంలోనూ ఇది కళ్లకు కడుతున్న సందర్భాలు మనకు అనేకం ఎదురవుతుంటాయి. సంతోషం, బాధ, భావోద్వేగాలు, సమస్యలు, సవాళ్లు ఇవన్నీ జీవితంలో ఒక భాగంగా ఉంటాయి. కాకపోతే వాటిని ఎలా స్వీకరిస్తున్నామనే దానిని బట్టే, మానసిక ఆరోగ్యం, గెలుపోటములు ఆధారపడి ఉంటాయని, మానసిక దృఢత్వమే సక్సెస్ మంత్ర అని సైకాలజిస్టులు చెప్తున్నారు. అందుకే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీరు మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలని సూచిస్తున్నారు. అదెలా సాధ్యమో సూచిస్తున్నారు.

సమస్యలు - సవాళ్లు

నిజానికి మనం బలమైన మానసిక ధోరణితో ఉండటమనేది లైఫ్‌లో చాలా ముఖ్యం. హ్యాపీగా ఉన్నామా, బాధల్లో కూరుకుపోయామా అనేది భావన కూడా చాలా వరకు మన మెదడు ఆలోచించే తీరును బట్టే మనల్ని ప్రభావితం చేస్తుందని ఫిలాసఫర్లు అంటున్నారు. అందుకే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మనం ధైర్యంగా ఉంటే.. సమస్యలు, సవాళ్లు ఏవైనా కానీ క్రమంగా సమసిపోతాయని, మానసిక దృఢత్వం ముందు ఇబ్బందులు ఓడిపోతాయని నిపుణులే కాదు, పెద్దలు కూడా చెప్తుంటారు. అయితే అలా మెంటల్లీ స్ట్రాంగ్‌గా తయారవాలంటే రోజువారీ సాధన, అలవాట్లు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి మనం కొన్నింటిని దినచర్యలుగా లేదా అలవాట్లుగా మార్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

వీక్‌నెస్ - సక్సెస్

మనం ఒక రంగంలో రాణించాలన్నా, ఒక సమస్య నుంచి బయట పడాలన్నా అంతుకు ముందు మనం అనుభవిస్తున్న పరిస్థితి గురించి ఒక అవగాహనకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మన బలాలు, బలహీనతలు ఏమిటనేదానిపై క్లారిటీ ఉండాలి. దీనివల్ల ఆయా పరిస్థితుల్లో బలహీతలను ఎలా అధిగమించాలి, మన బలాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే ప్రణాళిక రూపొందించుకోవచ్చు. ఇలా ప్రయత్నించడంవల్ల క్రమంగా మానసిక దృఢత్వం ఏర్పడి సానుకూల ఆలోచనలకు, సక్సెస్ సాధనకు ప్రేరణగా నిలుస్తుందని నిపుణులు అంటున్నారు.

లిమిటేషన్స్ - బౌండరీస్

మనం ఒక విషయంలో ఎలా స్పందిస్తాం? ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం అనేదే కాకుండా, అనుకున్నది సాధించడానికి తగిన పరిస్థితులు, వనరులు కూడా ఉండాలి. అంటే ఇక్కడ అసాధ్యం కాని విషయాల జోలికి వెళ్లకుండా సక్సెస్ వైపు దూసుకెళ్లే క్రమంలో మనకంటూ కొన్ని పరిధులు, పరిమితులు, సరిహద్దులు కలిగి ఉండాలని నిపుణులు చెప్తున్నారు. మనకంటూ ఒక స్పష్టత, అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు ఎక్కడ ఎస్ చెప్పాలి. ఎక్కడ నో చెప్పాలో తెలిసిపోతుంది. ఈ విధమైన వ్యక్తిత్వమే మానసిక ధృఢత్వానికి నిదర్శనంగా నిపుణులు పేర్కొంటున్నారు.

పర్సనల్ గ్రోత్ - సెల్ఫ్‌ లవ్

మనం ఏ పనిచేసినా అందులో అన్ని కోణాలు, ప్రయోజనాలు ఉంటాయి. అలాగే ఇక్కడ పర్సనల్ గ్రోత్ కూడా చాలా ముఖ్యం. దానికి ప్రయారిటీ ఇచ్చినప్పుడే వ్యక్తిగతంగా, సామాజికంగా, వృత్తిపరంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండగలుగుతాం. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. ఏంటంటే.. పర్సనల్ గ్రోత్ అయినా, ప్రొఫెషనల్ గ్రోత్ అయినా సరిగ్గా ఉండాలంటే మిమ్మల్ని ముందుగా మనల్ని మనం నమ్మాలి. మన పనిని మనం, మన వ్యక్తిత్వాన్ని మనం, మన శ్రమను మనం ప్రేమించాలి. సెల్ఫ్ లవ్ సహజంగానే మానసిక ఆనందాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది.

అనుభవాలు - గుణపాఠాలు

పుట్టుకతోనే ఎవరూ మేధావులు కారు, ఒక రంగంలో లేదా ఒక వృత్తిలో నైపుణ్యం అనేది సహజంగానే ఏర్పడదు. నేర్చుకోవడం ద్వారా, పరిశీలించడం, ప్రయత్నించడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతాయి. ఈ క్రమంలో ప్రతీ వ్యక్తి ఏదో ఒక పొరపాటు చేయకుండా ఉండలేరు. వాస్తవానికి ప్రతీ పనిలో తప్పులు, పొరపాట్లు వంటి అనుభవాలను ఎదుర్కొంటాం. అయితే వీటిని చూసి మానసికంగా కృంగిపోతే మాత్రం జీవితంలో ఏదీ సాధించలేమని, అనుభవాలను గుణపాఠాలకు మార్చుకుంటూ మెరుగైన దిశగా ప్రయత్నిస్తేనే సక్సెస్ సాధ్యం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధమైన అలవాటును ఏర్పర్చుకోవాలని సూచిస్తున్నారు.

భావోద్వేగాల నియంత్రణ

ప్రతీ విషయంలో అతి భావోద్వేగాలు వాస్తవానికి అవగాహనా రాహిత్యంగా పేర్కొంటున్నారు నిపుణులు. తగిన సందర్భం, సమయం లేకుండా ఎవరిలోనైనా ఇవి కనిపిస్తున్నాయంటే మానసిక బలహీనతతో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఒక స్పష్టత, అవగాహన కలిగి ఉంటామో అప్పుడు భావోద్వేగాలు మన నియంత్రణలో ఉంటాయి. ఎమోషనల్ కంట్రోలింగ్ కూడా మనల్ని బలమైన మనస్తత్వం గల వ్యక్తులుగా తయారు చేస్తుందని, జీవితంలోని ప్రతీ సందర్భం మనకు ఏదో ఒక గుణపాఠం నేర్పుతుందని నిపుణులు చెప్తున్నారు. దీంతోపాటు జీవితంలో కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం వల్ల కూడా ఆనందం, మానసిక దృఢత్వం పెంపొందుతుంది.

Advertisement

Next Story

Most Viewed