Low Blood Sugar : లో బ్లడ్‌ షుగర్‌తో మాటల్లో తడబాటు.. కారణం అదేనట !

by Prasanna |   ( Updated:2023-04-28 10:21:34.0  )
Low Blood Sugar : లో బ్లడ్‌ షుగర్‌తో మాటల్లో తడబాటు.. కారణం అదేనట !
X

దిశ, ఫీచర్స్: డయాబెటిస్ పేషెంట్లలో అనుకోకుండా మాటలు తడబడటం, అప్పటికప్పుడు చెమటలు పట్టడం, వణకడం వంటి లక్షణాలను మీరెప్పుడైనా గమనించారా? ఇలాంటి పరిస్థితి ఎదురయ్యాక జాగ్రత్త పడకపోతే కోమాలోకి వెళ్లి ప్రాణహాని సంభవించే అవకాశం కూడా ఉంటుంది. ఇదంతా రక్తంలో షుగర్ లెవల్స్ తీవ్రస్థాయికి పడిపోవడంవల్ల జరుగుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ పరిస్థితినే హైపోగ్లైసీమియా అంటారు. గ్లూకోజ్ లెవల్ సాధారణ స్థాయి కంటే పడిపోయినప్పుడు ఇది సంభవిస్తుంది.

ఎక్స్‌ట్రీమ్ హైపోగ్లైసీమియా

రక్తంలో చక్కెర స్థాయి బాగా తగ్గితే కొన్నిసార్లు అది ఎక్స్‌ట్రీమ్ హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. గందరగోళం, అస్పష్టమైన దృష్టి, ఒళ్లు జలదరింపు లేదా తిమ్మిరి, అస్పష్టమైన ప్రసంగంతోపాటు ఇతర నాడీ సంబంధిత లక్షణాలకు ఇది కారణం అవుతుందని ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే మానవ మెదడు ఎనర్జీకోసం కోసం గ్లూకోజ్ లేదా షుగర్ సాధారణ సరఫరాపై డిపెండ్ అయి ఉంటుంది. రక్తంలో ఇవి క్లిష్టమైన స్థాయికి పడిపోయినప్పుడు మెదడు సరిగ్గా పనిచేయదు. చికిత్స అందించకపోతే ప్రాణహాని జరగవచ్చు. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎందుకు తగ్గుతుంది?

రక్తంలో షుగర్ లెవల్ తగ్గడానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ఓరల్ యాంటీ డయాబెటిక్స్ (sulfonylureas), మందులు తరచుగా వాడాల్సి రావడం, అలాగే సెప్సిస్, లివర్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, ఆల్కహాల్ తీసుకోవడం, ట్యూమర్ లేదా కార్టిసాల్ వంటి హార్మోన్ల లోపాలు హైపోగ్లైసీమియాకు దారితీస్తాయి.

ఇలా నివారించవచ్చు

ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ సరఫరా మెరుగు పడుతుంది. అలాగే రోజంతా క్రమం తప్పకుండా భోజనం చేయడం, స్నాక్స్ తీసుకోవడం చేయాలి. బ్లడ్ షుగర్ లెవల్స్‌ రికార్డును మెయింటెన్ చేయాలి. వాటి లెవల్‌ను బట్టి మందులను వాడే పద్ధతిని డాక్టర్లను అడిగి తెలుసుకోవాలి. భోజనం మానేయడం లేదా ఉపవాసం చేయడం మంచిది కాదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. ఎక్కడికైనా వెళ్లినప్పుడు గ్లూకోజ్ మాత్రలు లేదా స్వీట్ వంటి వేగంగా పనిచేసే గ్లూకోజ్ మూలాన్ని తీసుకెళ్లండి. రక్తంలో చక్కెర తక్కువగా ఉన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే గ్లూకోజ్ మాత్రలు తీసుకోవచ్చు. అలాగే మీరు డయాబెటిక్ పేషెంట్ అని సూచించే మెడికల్ ఐడీని ఎప్పుడూ వెంట తీసుకెళ్లండి.

Also Read..

వేసవిలో కర్భూజ తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Advertisement

Next Story