మంచోళ్లకే చెడు ఎందుకు జరుగుతుంది? ఇదేం లెక్క.. అసలు స్టోరీ ఇది.

by Sujitha Rachapalli |   ( Updated:2025-02-21 11:14:07.0  )
మంచోళ్లకే చెడు ఎందుకు జరుగుతుంది? ఇదేం లెక్క.. అసలు స్టోరీ ఇది.
X

దిశ, ఫీచర్స్ :మనకు ఏదైనా ఆపదొచ్చినప్పుడు.. మన పెద్దలు ఏం చెప్తారు.. ఏం బాధపడకు బిడ్డా ‘‘మంచోళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది’’ అని.. ఆ మాట మనకు ఓదార్పునిస్తుంది. ఏదైనా నష్టపోయినా సరే కాస్త ప్రశాంతత దొరుకుతుంది. ఎవరితోనైనా గొడవ జరిగిందనుకోండి..‘‘పైన దేవుడున్నాడు.. నిన్ను విడిచిపెట్టడు.. నువ్వు చేసిన ఈ పనికి ఫలితం అనుభవిస్తావ్.. చెడ్డోడికి చెడు జరగక మానదు’’ అని శత్రువును తిట్టిపోస్తాం. అంటే ‘‘కర్మ’’ సిద్ధాంతం యూనివర్సల్ స్కోర్‌ను బ్యాలెన్స్ చేస్తుందని.. మంచికి మంచి చెడుకు చెడు బహుమతిగా ఇస్తుందని నమ్ముతాం. కానీ నిజంగా ఇలాగే జరుగుతుందా? నువ్వు ఎంత మంచిగున్నా.. అస్సలు ఊహించని ట్విస్టులు నీ జీవిత తలుపులు తట్టడం లేదా?

1. చెడు ఎప్పుడూ శిక్ష కాదు

ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది. చెడు చేస్తే తిరిగి చెడు జరగదు. మంచి చేస్తే రెట్టింపు మంచి అస్సలే రాదు. ఉదాహరణకు అర్జెంటుగా వెళ్లాల్సిన పని ఉన్నప్పుడు.. కాఫీ షాపు దగ్గర బిల్లు కట్టకుండా మరిచిపోయి వెళ్లిపోయావనుకో.. ఇది తప్పు కాబట్టి లైఫ్‌లో చెడు జరుగుతుందనే భయం అవసరం లేదు. మరోవైపు వానలో తడుస్తున్న ఓ ముసలవ్వకు నీ గొడుగు ఇచ్చి సహాయం చేశావని అనుకుందాం.. నువ్వు ఇప్పుడు ఆమెకు హెల్ప్ చేశావ్ కాబట్టి నీకు మళ్లీ మంచే కలుగుతుందనే నమ్మకం కూడా ఉండకూడదు. ఎందుకంటే జీవితం అనేది మంచి, చెడుల కలయిక. అస్తవ్యస్తంగా, అనూహ్యంగా ఉంటుంది. కష్టనష్టాలు మీ ప్రయాణంలో భాగం కాబట్టి సవాళ్లతో ముంచెత్తుతుంది. చెడును శిక్షగా భావించి అక్కడే ఉండిపోకుండా.. దాని నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సిందే.

2. ట్రాకింగ్ ఏం ఉండదు

విషయం ఏమిటంటే.. కర్మ అనేది స్వర్గంలో కూర్చుని మీ మంచి పనులను నిశితంగా ట్రాక్ చేసే ఏదో దైవిక శక్తి కాదు. ప్రతి తప్పుకు లెక్కలు వేయబడతాయని అనుకోవడం మూర్ఖత్వమే. విశ్వం మీ స్కోర్‌కార్డ్ గురించి పట్టించుకోదు. అది అనుభవాన్ని పట్టించుకుంటుంది. మంచి వ్యక్తులకు చెడు జరగడం వ్యవస్థలోని లోపం కాదు. ఇది నైతిక నియమాలకు మించినది. మంచిగా ఉన్నందుకు బహుమతి పొందడం లేదా చెడుగా ఉన్నందుకు శిక్షించబడటం అనే నమ్మకాలతో సంబంధం లేకుండా జరుగుతుంది.

3. తప్పించుకోవడమనేది భ్రమే

మనమందరం విధి మనల్ని నియంత్రిస్తుందని అనుకుంటాము. మనం తగినంత మంచివారమైతే, తెలివైనవారమైతే, దయగలవారమైతే.. బహుశా మనం బాధ నుండి తప్పించుకోబడవచ్చనే భ్రమలో ఉంటాం. కానీ అది ఒక ఉచ్చు. జీవితం న్యాయంగా ఉంటే ముందుకు సాగుతుంది.. అన్యాయంగా ఉంటే సాగదు.. అనుకోవడం తెలివితక్కువతనం. ఎందుకంటే మంచోళ్లు, చెడ్డోళ్లు.. అందరూ లైఫ్ జర్నీ చేస్తుంటారు. మంచి చెడు అని పిలువబడే స్నేహితులకు హాయ్ చెప్పేస్తారు. ఇది అసలైన సత్యం. మంచికి మంచి అనే ఆలోచనను వదిలేస్తే.. నేను మంచోడినే కదా నాకెందుకు ఇలా జరుగుతుంది అనే అంశం గురించి కాకుండా ఎదురైనా చెడు నుంచి విముక్తి పొందేందుకు ప్రయత్నిస్తారు. దాని నుంచి త్వరగా బయటపడుతారు.

4. బాధ కాదు బలం

జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణాలు ఓటమికి సంకేతాలు కాదు.. నిజమైన బలాన్ని మేల్కొల్పడానికి ఆహ్వానాలు. బాధ అనేది మరణశిక్ష కాదు. ఒక ఉత్ప్రేరకం. ఇది మీ పాత్రను సృష్టించే కొలిమి. తమ సారాన్ని కోల్పోకుండా కష్టాలను భరించే వ్యక్తి.. ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ పైకి లేచి మునుపటి కంటే గొప్పగా మారతాడు. చెడు విషయాలు మీ దారిలో కనిపించవచ్చు. కానీ అవి మీ జీవితానికి ముగింపు కాకూడదు మరో మెట్టు ఎదిగేందుకు ప్రారంభంగా ఉండాలి. చెడు చెడ్డవారికి మాత్రమే జరుగుతాయనే ఆలోచన అబద్ధం. మంచి, చెడు ఏది జరిగినా.. వాటి ద్వారా ఎలా రూపాంతరం చెందుతారనేదే ముఖ్యం.

5. పవర్‌ఫుల్ రియాక్షన్

మనకు మంచి జరుగుతుందా లేక చెడు ఎదురవుతుందా అనే ఆలోచనతో ఉండకుండా.. గుడ్ ఆర్ బ్యాడ్ ఏ సిట్యుయేషన్ ఎలా ఫేస్ చేస్తారు.. ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవుతారు అనేది ముఖ్యం. ఆ పరిస్థితే మిమ్మల్ని డిఫైన్ చేయగలదు. కర్మ సిద్ధాంతం, యూనివర్సల్ స్కోర్ కార్డ్, న్యాయం, ధర్మం వీటన్నింటి గురించి ఆలోచించి.. వాటికి శక్తి ఉందని నమ్మకుండా.. విశ్వమే మనకు కావాల్సింది ఇస్తుందనే భరోసాతో సాగకుండా.. సొంత అర్థాన్ని క్రియేట్ చేసుకోవడం బెటర్. బాధను ఇంధనంగా మార్చుకుని జీవితంలో దూసుకుపోండి. కర్మ నిజం కాకపోవచ్చు కానీ ప్రతి విషయంలో స్పందించడానికి, దాన్నిమార్చడానికి, దాని ద్వారా ఎదగడానికి, లక్ష్యాన్ని చేరుకోవడానికి మీలో సామర్థ్యం ఉందని గుర్తించండి.

Next Story

Most Viewed