Japanese tradition : భార్యా భర్తలే అయినా కలిసి పడుకోరు..! ఈ జపనీస్ సంప్రదాయం వెనుక అసలు ఉద్దేశం అదే..

by Javid Pasha |
Japanese tradition : భార్యా భర్తలే అయినా కలిసి పడుకోరు..! ఈ జపనీస్ సంప్రదాయం వెనుక అసలు ఉద్దేశం అదే..
X

దిశ, ఫీచర్స్ : భార్యా భర్తలన్నాక సహజంగానే ఒకే బెడ్‌పై కలిసి నిద్రిస్తారు. ప్రత్యేక కారణాలు ఉన్నప్పుడో, జలుబు, జ్వరాలు వంటివి వచ్చినప్పుడో విడిగా పడుకుంటారు. కానీ జపాన్‌లో మాత్రం అలా కాదు. అక్కడి సంప్రదాయం ప్రకారం దంపతులు ఒకే రూములో పడుకున్నప్పటికీ, ఒకే మంచం మీద మాత్రం కలిసి నిద్రించరు. దీనికి గల కారణలేమిటో ఇప్పుడు చూద్దాం.

వినడానికి కాస్త వింతగా అనిపించినా ఇది నిజం.. జపాన్‌లో పెళ్లికి ముందు వ్యక్తులు ఎలా నిద్రిస్తారో, పెళ్లి తర్వాత కూడా వారి నిద్ర అలవాట్లు అలానే ఉంటాయి. అలాగని భాగస్వాములు శృంగారంలో పాల్గొనరు అనుకుంటే పొరపాటే. కాకపోతే దానికి కేటాయించిన సమయం వరకు మాత్రమే ఒకే బెడ్‌పై ఉంటారట. తర్వాత నిద్రపోయేందుకు వేర్వేరు మంచాలపైకి మారుతారు. పైగా ఇది జపాన్ సంస్కృతి లేదా ఆచారంలో భాగమని నిపుణులు చెప్తున్నారు. అలాగని దంపతుల మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉండదని భావించాల్సిన అవసరం లేదు. ఇక్కడి జంటల్లో లవ్ అండ్ ఎమోషనల్ బాండింగ్ కూడా అధికమే అంటున్నారు నిపుణులు. అయితే కచ్చితంగా విడిగా పడుకోవాలనే సంప్రదాయాన్ని కొనసాగించాలని కూడా ఎవరూ ఒత్తిడి చేయరు. అది జంటల వ్యక్తిగత అభిప్రాయం, నిర్ణయానికే పూర్తిగా వదిలేస్తారు. కాకపోతే అనాదిగా వస్తున్న ఆచారంగా ఇప్పటికీ చాలామంది దీనిని గౌరవిస్తూ శృంగార కార్యకలాపాల తర్వాత భార్య భర్తలు విడిగా పడుకుంటారు.

29 శాతం జంటలే కలిసి నిద్రిస్తారు

జపాన్ ఆరోగ్య, కార్మిక సంక్షేమ మంత్రిత్వశాఖ తరపున 2019లో నిర్వహించిన సర్వేల ప్రకారం 20 నుంచి 69 సంవత్సరాల మధ్య వయస్సుగల 1,662 మంది జంటలను నిపుణులు ప్రశ్నించారు. వీరిలో 29.2 శాతం మంది జంటలు మాత్రమే ఒకే బెడ్‌పై నిద్రిస్తున్నారు. మిగతా చాలామంది ఒకే గదిలో పడుకుంటున్నప్పటికీ, నిద్రించే సమయంలో మాత్రం వేర్వేరు బెడ్‌లకు మారుతారు. పైగా ఇది జపాన్‌ సంస్కృతి, సంప్రదాయంలో భాగమని, ప్రజలు నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం దీనివెనుకున్న అసలు ఉద్దేశమని నిపుణులు చెప్తున్నారు.

విడిగా ఎందుకు పడుకుంటారంటే..

కలిసి పడుకోవడంవల్ల మధ్యలో ఒకరు తరచుగా లేవడం లేదా గురకపెట్టడం, కాస్త ముందుగా లేవడం కారణాలతో భాగస్వాముల్లో ఒకరికి నిద్రా భంగం కలుగవచ్చు. దీనివల్ల వారు నాణ్యమైన నిద్రను కోల్పోయి అనారోగ్యాలకు గురికావచ్చునని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే వేర్వేరుగా పడుకుంటారు. ఈ పద్ధతిని ఇక్కడ ‘సెపరేట్ స్లీపింగ్’ లేదా ‘కెసోంబైన్’ అంటారు. మరి పిల్లలు పుడితే నిద్ర అలవాట్లు ఎలా ఉంటాయన్న సందేహం కూడా ఎవరికైనా కలుగుతుంది! అయితే పిల్లలు కాస్త పెద్దయ్యే వరకు ఎక్కువగా తల్లి పక్కనే పడుకుంటారు. అలాగని తండ్రివద్ద పడుకోవడానికి అభ్యంతరాలేమీ ఉండవు. కానీ అక్కడి ప్రజల వారసత్వపు అలవాట్ల ప్రకారం ఇలా చేస్తారు. ఇక కాస్త పెద్దయ్యాక పిల్లలకు కూడా వేరే మంచం కేటాయిస్తారు.

Next Story

Most Viewed