అద్దెకు ద్వీపం.. గంటకు రూ.154,166 మాత్రమే..

by Sumithra |
అద్దెకు ద్వీపం.. గంటకు రూ.154,166 మాత్రమే..
X

దిశ, ఫీచర్స్ : ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలామంది తమ బిజీ లైఫ్ లో కాస్త రిలాక్స్ అవ్వడానికి ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు సమీప ప్రాంతాలకు టూర్స్ వేసుకుంటారు. మరికొంత మంది నేరుగా విదేశాలకు వెళుతూ ఉంటారు. వీరిలో కొంతమంది ద్వీపానికి వెళ్లేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడి అందం ఎవరినైనా ఆకర్షిస్తుంది. అయితే ప్రపంచంలో ఒక ద్వీపాన్ని అద్దెకు తీసుకోవచ్చట. ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేయవచ్చు. వింటుంటేనే ఆ ద్వీపం గురించి తెలుసుకోవాలని ఉంది కదా. ఇంతకీ ఆ ద్వీపం ఎక్కడ ఉంది. దాని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ద్వీపం పేరు ఒస్సీ ద్వీపం. ఇది చెమ్స్‌ఫోర్డ్, ఎసెక్స్ నుండి కేవలం 10 మైళ్ల దూరంలో, అలాగే లండన్ నుంచి 45 మైళ్ల దూరంలో ఉంది. సముద్రం మధ్యలో ఉన్న ఈ ద్వీపం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అందుకే ఇక్కడ పర్యాటకుల రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ తెలిసిన వారు తరచుగా ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ద్వీపం చాలా అందంగా ఉంది. మరో విషయం ఏంటంటే విలాసవంతమైన ఫ్లాట్‌లు, అద్భుతమైన రెస్టారెంట్లు వంటి అన్ని రకాల సౌకర్యాలు ఈ ద్వీపంలో అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రజలు అక్కడ నివసించడానికి ఎటువంటి సమస్యలను ఎదుర్కోరు.

ఈ ద్వీపం 380 ఎకరాల్లో విస్తరించి ఉంది..

కొన్ని నివేదిక ప్రకారం 380 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ద్వీపంలో వేల సంఖ్యలో చెట్లు, మొక్కలు ఉన్నాయని వెల్లడించింది. ఇవి ఆ ద్వీపం అందాన్ని పెంచుతాయి. అంతే కాదు అనేక రకాల అడవి జంతువులు కూడా ఇక్కడ నివసిస్తాయట. వాటి భయానక శబ్దాలు తరచుగా వినబడతాయట. అలాగే పర్యాటకుల అలసటను దూరం చేసేందుకు ఎప్పుడూ సంగీతం వినబడతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ద్వీపంలో రెండు స్టూడియోలు నిర్మించారు. ఇక్కడ తరచుగా పార్టీలు, ఈవెంట్‌లు జరుగుతాయి.

అద్దెకు ద్వీపం..

ఈ దీవి యజమాని పేరు నిగెల్ ఫ్రీడా. అతను సంగీత నిర్మాత. అతను ఈ దీవిని 2004 సంవత్సరంలో కొనుగోలు చేశాడు. ఇక్కడ ఒక రాత్రికి గది అద్దె దాదాపు రూ.32 వేలు అయినప్పటికీ, ఎవరైనా కోరుకుంటే, మొత్తం ద్వీపాన్ని అద్దెకు తీసుకోవచ్చు. ఇందుకోసం రోజుకు దాదాపు రూ.37 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఒక వేళ గంట అద్దెకు తీసుకుంటే రూ.154,166 వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ద్వీపంలో 173 మంది కలిసి హాయిగా జీవించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed