యూట్యూబర్ ఉచిత పెట్రోల్ ఆఫ‌ర్‌.. బార్లుతీరిన‌ జ‌నం.. ఆ త‌ర్వాత‌..? (వీడియో)

by Sumithra |   ( Updated:2023-10-02 08:16:12.0  )
యూట్యూబర్ ఉచిత పెట్రోల్ ఆఫ‌ర్‌.. బార్లుతీరిన‌ జ‌నం.. ఆ త‌ర్వాత‌..? (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఎన్నిక‌ల మ‌త‌ల‌బో, కొన‌సాగుతున్న‌ మ‌తం స్ట్రాట‌జీని మ‌రిపించాల‌నేమో గానీ ఇటీవల భార‌త కేంద్ర ప్ర‌భుత్వం సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో దేశ‌వ్యాప్తంగా ఇంధనం ధర తగ్గింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 వ‌ర‌కూ తగ్గింది. ఎలాగూ, త‌గ్గింది కాబ‌ట్టి దీన్ని కూడా పాపులారిటీకి వాడేసి, ఇప్ప‌టి వ‌ర‌కూ చ‌మురు కంపెనీలు దండుకున్న డ‌బ్బును జ‌నాల నుండి మ‌నం కూడా దండుకుందామ‌ని ఓ యూట్యూబ‌ర్‌కు సూప‌ర్ ఐడియా వ‌చ్చింది. అమిత్ అనే యూట్యూబర్ తన వీడియోను వైరల్ చేయడానికి ఈ ప్రత్యేకమైన ఆలోచన అమ‌లు చేశారు. రూ. 1 లక్ష వరకు ఉచిత పెట్రోల్, డీజిల్‌ను అందిస్తున్నట్లు ఓ పెట్రోల్ బంకు ద‌గ్గ‌ర ప్ల‌కార్డులు ప‌ట్టుకొని, దిగాడు. దీని కోసం ఓ పెట్రోల్ పంపును ఎంచుకొని, అందులో పనిచేస్తున్న వారిలా దుస్తులు ధరించాడు. 'క్రేజీ పెట్రోల్ పంప్' అనే బ్యాన‌ర్ పెట్టుకొని క‌స్ట‌మ‌ర్ల‌కు ఉచిత పెట్రోలు పోయ‌డం మొద‌లెట్టాడు. ఇక్క‌డే, అస‌లు రియాక్ష‌న్ మొద‌ల‌య్యింది.

వీడియో స‌క్సెస్ అయ్యి, వ‌చ్చే డ‌బ్బుల‌ను లెక్కేసుకునే వ‌ర‌కూ ఉచితం ఓకే గానీ, విష‌యం తెలుసుకున్న జనాలు పెట్రోల్ పంపు ద‌గ్గ‌ర‌ భారీగా వ‌చ్చి చేరారు. క్రేజీ XYZ అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వాహ‌కుడు అమిత్‌కు ఈసారి షాక్ త‌గిలింది. అప్ప‌టి వ‌ర‌కూ ఫుల్ ట్యాంక్‌లు నింపినవాడు, ఒక్క‌సారిగా వ్య‌క్తికి రూ.200 పోస్తానన్నాడు, ఆ త‌ర్వాత‌, ఒక టాస్క్ ఇస్తాను ఇందులో గెలిచిన‌వారికే పెట్రోల్ అంటూ ఫిట్టింగ్ పెట్టాడు. కొంతసేప‌టి త‌ర్వాత ప‌రిస్థితి చేదాటిపోతుంద‌ని తెలుసుకొని, ఉచితాన్ని బంద్ చేశాడు. ఏదేమైనా, మొత్తానికి అమిత్‌కు ఫ‌లితం ద‌క్కింది. యూట్యూబ్‌లో ఈ వీడియో ఇప్పటికే 42 ల‌క్ష‌ల వ్యూవ్స్ దాటింది. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఇక‌, దీనిపైన కొంత మంది నెటిజన్లు యూట్యూబర్ దాతృత్వాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు కొంత ఖర్చు చేసి, డబ్బు సంపాదిస్తున్న ఇత‌డి ఆలోచన బాగుందంటున్నారు.

Advertisement

Next Story