యూత్ లో సడెన్ ‘స్ట్రోక్’

by Javid Pasha |   ( Updated:2023-03-01 05:39:37.0  )
యూత్ లో సడెన్ ‘స్ట్రోక్’
X

జిమ్ లో వ్యాయామం చేస్తూ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ గుండెపోటుతో ప్రాణాలొదిలాడు... ఓ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న హైదరాబాద్ పాతబస్తీ లోని కాలపత్తర్ కు చెందిన రబ్బానీ కూర్చున్నచోటే కుప్పకూలిపోయాడు... నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి గ్రామంలో పెళ్లి బరాత్ లో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు తో అకస్మాత్తుగా చనిపోయాడు.

ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అప్పటివరకు ఆడిపాడుతున్న వారు అకస్మాత్తుగా కుప్ప కూలిపోతున్నారు. చూస్తుండగానే ప్రాణాలొదులుతున్నారు. వీరిలో 30 ఏళ్లు నిండని యువకులు కూడా ఉంటున్నారు. కరోనా తర్వాత గుండెపోటు మరణాలు పెరిగిపోతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ఇటీవలి కాలంలో హార్ట్ అటాక్స్ తో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరిగిపోతున్నది. ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న వయసులోనే చాలా మంది చనిపోతున్నారు. మారుతున్న జీవనశైలితోపాటు ఇంకా అనేక రీజన్స్ ఈ గుండెపోట్లకు కారణమవుతున్నాయి.

కరోనా టీకాలు కారణమా?

చిన్న వయసులో గుండెపోట్లు రావడానికి కరోనా వ్యాక్సిన్ కూడా ఒక కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీన్ని తోసిపుచ్చలేమని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శశికాంత్ తెలిపారు. టీకాలు వేయించుకున్న వారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని అమెరికా లోని ఫ్లోరిడా సర్జన్ జనరల్ డాక్టర్ జోసెఫ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. ముఖ్యంగా 18 నుంచి 39 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి ప్రమాదం ఎక్కువని ఫ్లోరిడా హెల్త్ డిపార్టుమెంటు చేసిన అధ్యయనాన్ని విశ్లేషించారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో న్యూరో సమస్యలు, కాళ్లల్లో వాపులు రావటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నట్టు చెప్పారు.

ఇంకా అనేక కారణాలు..

గుండె సమస్యలతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుండటానికి ఇంకా అనేక కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. వేపుళ్లు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లాంటివి గుండె సమస్యలకు కారణమవుతున్నాయి. ఊబకాయం, మద్యపానం, ధూమపానం వంటివి కూడా గుండె జబ్బులకు దారి తీస్తున్నాయి.

జిమ్ లో జాగ్రత్త

వ్యాయామం చేస్తూ హార్ట్ అటాక్స్, కార్డియాక్ అరెస్ట్ లకు గురవుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతున్నది. దీంతో జిమ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు. కొత్తగా జిమ్ వెళ్లాలనుకునేవారు ముందుగా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. ఈసీజీ, ఈకో టెస్ట్, థ్రెడ్ మిల్ పరీక్ష చేసుకోవాలి. ట్రైనర్ల సమక్షంలోనే వ్యాయామం చేయాలి. కంటిన్యూగా జిమ్ చేయొద్దు. జిమ్ చేసే సమయంలో ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి కనీసం మూడు నిముషాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

సీపిఆర్ లో శిక్షణ ఇస్తే..

ఆరామ్ ఘర్ చౌరస్తాలోని బస్టాప్ లో బాలరాజు అనే యువకుడు గుండెపోటుతో కుప్ప కూలిపోగా కానిస్టేబుల్ రాజశేఖర్ వెంటనే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. సీపీఆర్ పై జిమ్ ట్రైనర్లు, ఫ్రంట్ లైన్ ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇస్తే కొంతమేరకైనా ఇలాంటి మరణాలను నివారించవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పాఠశాల స్థాయి నుంచే గుండె ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీపీఆర్ పై అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.

Also Read: రోగ నిరోధక శక్తిని తగ్గిస్తున్న ఉపవాసం.. కంటిన్యూ చేస్తే అంతే సంగతి!

Advertisement

Next Story