ఏడువారాల నగల వెనుక ఇంత చరిత్ర దాగి ఉందా.. అదేంటో చూసేద్దామా..

by Sumithra |
ఏడువారాల నగల వెనుక ఇంత చరిత్ర దాగి ఉందా.. అదేంటో చూసేద్దామా..
X

దిశ, ఫీచర్స్ : బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. బంగారం అంటేనే ఒక స్టాండర్డ్‌. బంగారానికి భారతీయ సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ఎంతటి పేదవారైనా సరే ఒంటి మీద కాస్తైనా బంగారం ఉండాలని ఆశపడతారు. చిన్నపిల్లల నుంచి మొదలుకుని వృద్దుల వరకు బంగారాన్ని ధరిస్తుంటారు. అయితే ఒకప్పటికాలంలో స్త్రీలతో సమానంగా పురుషులు కూడా బంగారు ఆభరణాలను ధరించేవారు. చెవులకి దుద్దులు, చేతికి కడియాలు, మెడలో హారాలు ఇలా. అలాగే స్త్రీలు కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడువారాల నగలను చేయించుకుని రోజుకు ఒక సెట్ ని వేసుకునేవారు. అయితే చాలామంది ఏడువారాల నగలు అనే మాటలు వినడమే కానీ అసలు వాటిలో ఎలాంటి ఆభరణాలు ఉంటాయి, వాటికి ఆ పేరు ఎందుకు వచ్చిందని తెలియదు. మరి మీకు కూడా ఈ ఏడువారాల నగలు అంటే ఏంటో తెలుసుకోవాలని ఉందా అయితే ఇప్పుడే తెలుసుకుందాం.

ఈ మధ్యకాలంలో చాలామంది తమ రాశులు, గ్రహాలకు అనుకూలంగా ఉండే జాతకపు రాళ్ల ఉంగరాలను ధరించడం చూస్తూనే ఉన్నాం. అదే పూర్వం రోజుల్లో బంగారు నగలలోనే రాళ్లను పొదిగి ధరించేవారు. వారంలో ఉండే ఒక్కోరోజుకు సంబంధించిన గ్రహం అనుగ్రహం కోసం, అలాగే ఆరోగ్యం కోసం బంగారు నగలను వేసుకునేవారు. ఆ ఆభరణాలనే ఏడువారాల నగలు అని పిలుస్తారు. మరి ఏరోజున ఏ రత్నానికి సంబంధించిన ఆభరణాలు ధరించేవారో చూద్దాం.

ఆదివారం : సూర్యుని అనుగ్రహం కోసం కెంపుల కమ్మలు, హారాలు మెదలైన వాటిని ధరించేవారు.

సోమవారం : చంద్రుని అనుగ్రహం పొందేందుకు ముత్యాల హారాలను, ముత్యాల గాజులు మొదలైన నగలను ధరించేవారు.

మంగళవారం : కుజుని అనుగ్రహం కోసం పగడాల ఉంగరాలు, పగడాల దండలు మొదలైనవాటిని ధరించేవారు.

బుధవారం : బుధుని అనుగ్రహం పొందేందుకు పచ్చల గాజులు, పచ్చల పతకాలు మొదలైనవాటిని వేసుకునేవారు.

గురువారం : బృహస్పతి అనుగ్రహం కోసం పుష్యరాగం ఉంగరాలు, కమ్మలు మొదలైన ఆభరణాలను ధరించేవారు.

శుక్రవారం : శుక్రుని అనుగ్రహం కోసం వజ్రపు ముక్కుపుడక, వజ్రాల హారాలు మొదలైనవాలిని వేసుకునేవారు..

శనివారం : ఇక శనికోసం అనుగ్రహం పొందేందుకు నీలమణి హారాలు, మొదలైనవాటిని ధరించేవారు.

ఏడు రోజుల పాటు ఏడువారాల నగలను ధరించిన స్త్రీలకు అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం కలిగేలా గ్రహాలు అనుకూలించేవని చెబుతున్నారు.

Advertisement

Next Story