జర్మనీలో ప్రారంభమైన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైల్!

by Naresh |   ( Updated:2022-08-26 08:13:55.0  )
జర్మనీలో ప్రారంభమైన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైల్!
X

దిశ, ఫీచర్స్ : హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచే బస్సులు పుణెలో ఇటీవలే ప్రారంభమైనట్లు ఇదివరకే దిశలో కథనం వెలువడింది. అయితే ఇదే ఇంధన శక్తితో నడిచే రైలు జర్మనీలో పరుగులు తీస్తోంది. ఈ మేరకు దాని సామర్థ్యాన్ని పరీక్షించేందుకు రెండేళ్లుగా ట్రయల్ రన్ చేస్తున్న అక్కడి ప్రభుత్వం.. సానుకూలం ఫలితం రావడంతో ప్యాసింజర్స్ కోసం అధికారికంగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇంధన ఆధారిత రైలును తాజాగా ప్రారంభించింది.

2018 సెప్టెంబరులో ప్రారంభమైన ప్యాసింజర్ సర్వీస్ ట్రయల్, దాదాపు రెండేళ్లపాటు కొనసాగింది. కాగా లోయర్ సాక్సోని మార్గంలో ప్రాజెక్ట్ అధికారికంగా ప్రజా సేవలోకి ప్రవేశించగా.. జర్మనీలోని సాల్జ్‌గిట్టర్‌, ఫ్రాన్స్‌లోని టార్బెస్‌లోని సెంటర్‌‌లలో14 రైళ్లకు ఈ సేవలను విస్తరించడం విశేషం. ఈ రైళ్లను లోయర్ సాక్సోనీ రవాణా మంత్రిత్వ శాఖ కొనుగోలు చేయగా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే LNVG (Landesnahverkehrsgesellschaft Niedersachsen) రైల్వే అథారిటీ యాజమాన్యంలో ఉన్నాయి. డీజిల్ లోకోమోటివ్‌లకు ప్రత్యామ్నాయం కోసం 2012 నుంచి ఈ కంపెనీ ప్రయత్నాలు చేస్తుండగా, ఇప్పటికి ఫలించింది.

ప్రతీ రైలు కుక్స్‌హావెన్, బ్రెమర్‌హేవ్, బ్రెమెర్‌వోర్డ్, బక్స్‌టెహుడ్ మధ్య ఒక రోజంతా 1,000 కి.మీ (~620 మైళ్లు) పరిధితో ఒకే ట్యాంక్ హైడ్రోజన్‌పై నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ రైళ్లు గంటకు 80 - 120 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నాయని, 140 కి.మీ. వేగాన్ని కూడా అందుకోగలవని పేర్కొన్నారు. ప్రస్తుతం వివిధ మార్గాల్లో ఐదు రైళ్లు నడుస్తుండగా, 2022 చివరి నాటికి 15 డీజిల్ రైళ్లను భర్తీ చేస్తాయని భావిస్తున్నారు. దీంతో ఏడాదికి 1.6 మిలియన్ లీటర్ల డీజిల్ సహా 4,400 టన్నుల CO2 ఉద్గారాలు తగ్గిపోతాయని అంచనా వేస్తున్నారు.

'ఈ ప్రాజెక్ట్ ప్రపంచానికి రోల్ మోడల్. లోయర్ సాక్సోనీలో విజయవంతమైన ట్రయల్ రన్ గొప్ప మేలిమలుపునకు కారణమైంది. పునరుత్పాదక ఇంధన దిశలో, రవాణా రంగంలో వాతావరణ పరిరక్షణకు మేము సైతం ఓ ప్రత్నామ్నాయాన్ని ఏర్పాటు చేస్తున్నాం' - లోయర్ సాక్సోనీ ప్రీమియర్ స్టీఫన్ వెయిల్

Advertisement

Next Story

Most Viewed