మనుషులను చంపేస్తున్న పుట్టగొడుగు.. అదే టార్గెట్ (వీడియో)

by Hamsa |   ( Updated:2023-12-15 16:56:31.0  )
మనుషులను చంపేస్తున్న పుట్టగొడుగు.. అదే టార్గెట్ (వీడియో)
X

దిశ, ఫీచర్స్: ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పుట్టగొడుగుగా గిన్నిస్ రికార్డు సృష్టించిన ‘డెత్ క్యాప్’ పుట్టగొడుగు కాలిఫోర్నియాను ఆక్రమించేసింది. అమనిటా ఫాలోయిడ్స్ అని కూడా పిలవబడే ఇది.. లేతరంగుగల ఆకుపచ్చ టోపీలు, తెల్లటి కాండం, తెల్లటి మొప్పలు కలిగి, పెళుసుగా కనిపిస్తూ మానవులు తినే పుట్టగొడుగుల మాదిరిగానే ఉంటాయి. కానీ వీటిలోని ప్రాణాంతక అమటాక్సిన్స్.. పేగు ద్వారా కాలేయంలోకి ప్రవేశించి, ఆపై ప్రోటీన్-ఉత్పత్తి చేసే ఎంజైమ్‌లను బంధిస్తాయి. తద్వారా క్రమంగా కాలేయం చనిపోవడం ప్రారంభమవుతుంది. దీని వలన వికారం, విరేచనాలు సంభవిస్తాయి. తర్వాతి దశలో ఆర్గాన్ ఫెయిల్యూర్స్, కోమా, మరణం సంభవిస్తాయి.

అమనిటా ఫాలోయిడ్స్ ఉత్పత్తి చేసే అమాటాక్సిన్‌లు థర్మోస్టేబుల్.. అంటే అవి వేడి కారణంగా వచ్చే మార్పులను నిరోధిస్తాయి. కాబట్టి టాక్సిన్స్ ప్రభావాలు వంట ద్వారా అస్సలు తగ్గవు. డెత్ క్యాప్ మష్రూమ్‌లో సగం వయోజన మానవుడిని చంపడానికి సరిపోతుందని అంచనా వేయబడింది. ఈ క్రమంలో హెచ్చరిక బోర్డులు వెలిశాయి. అలాంటి మష్రూమ్స్ రికార్డ్ సమయంలో కొత్త భూములకు వ్యాప్తి చెందే విధానం కారణంగా శాస్త్రవేత్తలను అబ్బురపరిచింది. ఐరోపాలో ఉద్భవించిన డెత్ క్యాప్.. అక్కడి యూరోపియన్ ఓక్ చెట్ల మూలాల్లోకి ప్రవేశించి, వాటితో సహజీవన సంబంధాన్ని ఏర్పరుచుకోవడం ద్వారా పెరిగింది.

అంటార్కిటికా మినహా ప్రతీ ఖండాన్ని వలసరాజ్యంగా మార్చగలిగింది. 19వ శతాబ్దంలో ఐరోపా నుంచి మట్టికుండల మొలకలతో రైడ్ ప్రారంభించిన ఈ విషపూరిత పుట్టగొడుగు.. US అంతటావ్యాపించగా.. అదెలా సాధ్యమైందో శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. కాలిఫోర్నియా నలుమూలల నుంచి సేకరించిన డెత్ క్యాప్ నమూనాలు ఒకదానికొకటి ఖచ్చితమైన కాపీలు, క్లోన్‌లు అలైంగికంగా ఉత్పత్తి చేయబడ్డాయి. కానీ యూరోపియన్ డెత్ క్యాప్స్ DNA నమూనాలు లైంగికంగా పునరుత్పత్తి చేయబడ్డాయని నిరూపించబడింది. ఇది న్యూజెర్సీ, న్యూయార్క్ పుట్టగొడుగులకు కూడా వర్తిస్తుండగా.. కాలిఫోర్నియాలోని డెత్ క్యాప్ పుట్టగొడుగులు ఖచ్చితమైన జన్యు పదార్థాన్ని కలిగి ఉన్నాయి. దాదాపు 30 సంవత్సరాల పాటు అలైంగికంగా పునరుత్పత్తి చేసే సామర్థ్యంతో ఉన్నాయి. అమనిటా ఫాలోయిడ్స్ కొత్త ప్రాంతాలలో వేగంగా వ్యాప్తి చేయడంలో అలైంగిక పునరుత్పత్తి సహాయపడగలదని శాస్త్రవేత్తలు సిద్ధాంతీకరించారు.

Advertisement

Next Story