దోమ కాటు తర్వాత ఎన్ని రోజులకు డెంగ్యూ ఫీవర్ వస్తుంది?.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

by Javid Pasha |
దోమ కాటు తర్వాత ఎన్ని రోజులకు డెంగ్యూ ఫీవర్ వస్తుంది?.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
X

దిశ, ఫీచర్స్ : అసలే వర్షాకాలం.. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దోమల సంఖ్య పెరగడంతో డెంగ్యూ, మలేరియా, పలు ఇతర అంటు వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తాయి. ఇటీవల చాలా మంది డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో డెంగ్యూ కారక దోమకాటు ప్రభావం ఎలా ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? నివారణ కోసం ఏం చేయాలో తెలుసుకుందాం.

వాస్తవానికి డెంగ్యూ ఈడిస్ ఈజిప్టి అనే ఆడ దోమలు కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. అయితే ఈ దోమల లైఫ్ టైమ్ రెండు రోజులు మాత్రమే. కానీ వర్షాకాలంలో వాటి సంఖ్య ఎక్కువగా ఉండటం కారణంగా వ్యాధుల విజృంభణకు అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈజిప్టి దోమలు సాధారణంగా 3 అడుగుల ఎత్తు వరకు మాత్రమే ఎగుర గలుగుతాయి. ఈ కారణంగా అవి మనిషి పడుకున్నప్పుడు, పగటి వేళల్లో అయితే కాళ్లు, నడుము వంటి దిగువ భాగాల్లో ఎక్కువగా కుడుతుంటాయి.

దోమల ఆవాసాలు, పుట్టుక

దోమలు ఎక్కువగా అపరిశుభ్రత ఉన్నచోట, డ్రైనేజీలు, రోడ్ల పక్కన ఉండే నీటి గుంతల్లో తిరుగాడుతుంటాయి. అంతేకాకుండా ఇండ్లల్లో కూలర్లు, పూల కుండీలు, ఇంటి పైకప్పుపై ఖాళీగా పడేసిన వస్తువులు, మూతలు, టైర్లు వంటివి కూడా దోమలకు ఆవాసాలుగా మారుతాయి. ఇక్కడే అవి గుడ్లు పెడుతుంటాయి. డెంగ్యూ దోమలు ఒకేసారి వంద నుంచి మూడు వందల గుడ్లు పెడతాయట. ఇవి 2 నుంచి 7 రోజుల తర్వాత లార్వాలుగా మారి, 4 రోజుల తర్వాత దోమలుగా పరిణామం చెంది ఎగరడం మొదలు పెడతాయి.

దోమకాటుతో ఏం జరుగుతుంది?

డెంగ్యూ దోమ కాటు వేసిన వెంటనే దాని లక్షణాలు కనబడవు. కొన్ని రోజుల తర్వాత ప్రారంభం అవుతాయి. అంటే ఈడిస్ లేదా ఈజిప్టి దోమలు కుట్టిన 3 నుంచి 5 రోజుల తర్వాత డెంగ్యూ ఫీవర్ వస్తుందన్నమాట. అయితే ఇవి ఎక్కువగా ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో మాత్రమే మనుషులపై దాడి చేస్తాయట. మధ్యాహ్నం వేళల్లో ఇవి ఇండల్లోని మూలల్లో, చీకటి ప్రదేశాల్లో, తలుపుల వెనుక దాక్కుంటాయి. అయితే ఫీవర్ ఎక్కువగా ఉండటం, మోకాళ్ల నొప్పి, దంతాలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, తలనొప్పి, కండరాల నొప్పి, చర్మంపై ఎర్రటి దద్దుర్లు, కళ్లకింద నొప్పి వంటివి డెంగ్యూ జ్వరం లక్షణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.

డెంగ్యూను ఎలా నివారించాలి?

డెంగ్యూ జ్వరానికి దోమకాటు ప్రధాన కారణం కాబట్టి అవి కుట్టకుండా జాగ్రత్త పడాలి. దోమలు ఎక్కువగా ఉన్న సీజన్‌లో మొత్తం శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించడం ఉత్తమం. అట్లనే నిద్రపోయేటప్పుడు దోమ తెరలు వాడటం, నిద్రకు ముందు, అంటే సాయంకాలం నుంచే బయటి దోమలు లోపలకు రాకుండా తలుపులు, కిటికీలు మూసి ఉంచడం వంటివి చేయవచ్చు. అలాగే శరీరంపై నూనె లేదా క్రీములు రాయడంవల్ల కూడా దోమలు అంతగా దగ్గరికి రావు. ముఖ్యమైన విషయం ఏంటంటే.. వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలి. సంపులు, కూలర్లు, వాటర్ ట్యాంకులను తరచుగా క్లీన్ చేస్తూ ఉండాలి. డెంగ్యూ లక్షణాలు గుర్తించగానే డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.

Advertisement

Next Story

Most Viewed