కౌగిలింతతో మానసిక ఒత్తిడి దూరం..మధురానుభూతి సొంతం

by Prasanna |   ( Updated:2023-01-06 12:37:42.0  )
కౌగిలింతతో మానసిక ఒత్తిడి దూరం..మధురానుభూతి సొంతం
X

దిశ, ఫీచర్స్ : స్కూలుకు వెళ్లనని బిడ్డ మొండికేసి మారాం చేస్తున్నప్పుడు.. తల్లి ప్రేమతో కౌగిలించుకుని ముద్దు ముద్దు మాటలతో సముదాయిస్తుంది. అంతలోనే బిడ్డ మూడ్ చేంజ్ అవుతుంది. 'సరే మమ్మీ వెళ్తాను' అంటాడు. తల్లి కౌగిలింతలో ఉన్న వాత్సల్యం అలాంటిది మరి. చదువుకుంటున్నప్పుడు మార్కులు తక్కువొచ్చాయని కూతురు బాధపడుతుంటే..తండ్రి తన గుండెలకు హత్తుకుని 'బాధ పడకు బిడ్డా మరోసారి పరీక్షరాసి మంచి మార్కులు తెచ్చుకోవచ్చు' అని ఓదారుస్తాడు. అప్పుడా కూతురు వెయ్యి ఏనుగుల బలం తనలోనే ఉన్నట్టు ఫీలవుతుంది. అంతేకాదు..తీవ్ర ఒత్తిడిలోనో, బాధలోనో ఉన్నప్పుడు ప్రేమికులు, స్నేహితులు, తోబుట్టువులు, నానమ్మలు, తాతయ్యలు చేసుకునే కౌగిలింత గొప్ప టానిక్ లా పనిచేస్తుందట. ఇలాంటి సందర్భాలు మీరు కూడా చూసుంటారు. హగ్ చేసుకుని చెప్పే మాటలు మీలో ఆత్మ స్థయిర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని నింపుతాయంటారు మానసిక నిపుణులు. చాలామంది అనుభవం, అవగాహన కూడా ఇది వాస్తవమనే విషయాన్ని అవగతం చేస్తుంది. ప్రేమతో హగ్ చేసుకోవడం అనేది మాటల్లో చెప్పలేని మధురానుభూతి. అది భావ వ్యక్తీకరణలో ఉన్నతస్థితి, గ్రేట్ కమ్యూనికేషన్ స్విచ్చువేషన్ అని చెప్పవచ్చు. 'అందుకే మనల్ని ఎంతగానో ఇష్టపడే అభిమానులో, బంధువులో, రక్త సంబంధీకులో ఒక్క హగ్ ప్లీజ్' అంటుంటారు. అదేదో సరదాకోసమే అనుకోకండి. కౌగిలింతలోని మమతల మాధుర్యాన్ని అందించాలన్న ఉద్దేశం కూడా కావచ్చు. అదే మనకు కొండంత ధైర్యమిస్తుంది.

ఒత్తిడిని దూరం చేస్తుంది

చదువులో..ఉద్యోగంలో..సమస్యల సుడిగుండాలు ఎదురైనప్పుడు ఆత్మీయులు ఇచ్చే ఒకే ఒక్క హగ్ మనల్ని వాటి నుంచి బయట పడేస్తుంది. పని ఒత్తిడితో ఇబ్బందిగా ఫీలవుతున్న ఒక వ్యక్తి తన భార్య లేదా ప్రియురాలు ఇచ్చే ఒక్క హగ్‌తో అది దూరమై పోతుందట. ఆనంద పరవశంలో ముంచెత్తుతుందట. అందుకే పెద్దలు అంటుంటారు 'దగ్గరకు తీసుకుని సముదాయించు. లేదా నచ్చజెప్పు' అని దాని అంతరార్థం కూడా అదే.. ఒక్కసారి హగ్ చేసుకుని ఓదార్చాలని. అన్నింటికంటే గొప్ప మోటివేషనల్ ప్రాసెస్ హగ్ అంటుంటారు మానసిక నిపుణులు.

బీపీని కంట్రోల్ చేస్తుంది

ఏదో తీవ్రమైన మానసిక ఆందోళనవల్లో, ఒత్తిడివల్లో, జీవన శైలి మార్పుల కారణంగానో ఈరోజుల్లో బ్లడ్ ప్రెషర్ సమస్య చాలామందిని వేధిస్తోంది. అప్పటికప్పుడు బీపీ పెరిగే పరిస్థితిని కూడా ఆత్మీయుల హగ్ అదుపు చేస్తుందట. అందుకే దానిని శక్తిమంతమైనదని చెప్తుంటారు. ''ఏదైనా కారణంగా ఒత్తిడికి లోనైనప్పుడు.. అప్పుడే.. ఆ మరు క్షణమే రిలాక్స్ అయ్యేలా చేసేది కౌగిలింత. కాబట్టి ఆత్మీయులను ఆశ్రయించండి. వారిచ్చే ఒకే ఒక్క హగ్ మిమ్మల్ని ఉత్సాహ పరిచే ఔధంలా పనిచేస్తుంది. ఉపశమనం పొందేలా చేస్తుంది'' అంటున్నారు సైకియాట్రిస్టు సరయూ తుషార్. అంతేకాదు హగ్‌వల్ల రక్తపోటు తగ్గుతుందనడానికి అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. సైంటిఫిక్ ఆధారాలు కూడా ఉన్నాయి అంటారామె.

అనారోగ్యాలను దూరం చేస్తుంది

కౌగిలింత మానసిక వికాసాన్ని కలిగించి తద్వారా శారీరక అనారోగ్యాలను కూడా దూరం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. తనకు ఏదో జరుగుతుందనే ఆందోళనతోనో, ఆలోచనతోనో సతమతం అవుతున్న వ్యక్తిని అతని ఆత్మీయులు హగ్ చేసుకుని 'నీకేం కాదు. ఎందుకు భయం అనవసరంగా టెన్షన్ పడుతున్నావ్' అంటూ ధైర్యం చెప్పడంతో అతనిలోని నెగెటివ్ ఫీలింగ్స్ పోయి, మెదడులో సంతోషాన్ని కలిగించే ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అయి. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అనేది అనేక అధ్యయనాల్లో తేలిన విషయమే. అంతేకాదు జ్వరం, జలుబు వంటి అనారోగ్యాలకు దారితీసే ప్రక్రియను దూరం చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందట హగ్. ''హగ్ అనేది అద్భుతం చేస్తుంది. తక్షణ ఒత్తిడిని తగ్గించడానికి, అనారోగ్యాన్ని దూరం చేయడానికి అది దోహదం చేస్తుంది'' అని మోటివేషనల్ నిపుణులు జిమ్ గ్రే చెప్తున్నాడు. ప్రేమికులు లేదా దంపతులు ఒకరినొకరు ఒక్క నిమిషంపాటు కౌగలించుకునే పరిస్థితి, అలాగే తమ పిల్లలను పేరెంట్స్ ఒక్క నిమిషం పాటు కౌగిలించుకునే స్విచ్చువేషన్ వారిలో గొప్ప ఇమ్యూనిటీ పవర్ లా పనిచేస్తుందని మానసిక నిపుణులు చెప్తున్నారు. ఆ పరిస్థితి మైండ్ రిలాక్స్ అయ్యేలా చేసి, వ్యాధి నిరోధక హార్మోన్‌‌లు రిలేజ్ అయ్యేందుకు తోడ్పడి, దానివల్ల రోగాలు రాకుండా ఉంటాయని నిపుణుల పరిశీలనలు రుజువు చేశాయి. అందుకే హగ్ అనేది అనేకమందికి అమృతం వంటిదని అంటుంటారు. ఆంక్షలు అమల్లో ఉన్న తీవ్రమైన కరోనా వంటి పరిస్థితులు మినహా మిగతా ఎటువంటి సందర్భాల్లోనైనా ఆత్మీయులు హగ్ చేసుకునే పరిస్థితిని నివారించవద్దు అంటున్నారు దీనిపై అధ్యయనం చేసిన రీసెర్చ్ స్కాలర్స్ రీతాసింగ్. అందుకే కౌగిలింత ఓ అద్భుతం.. కౌగిలింత ఓ మధురానుభూతి.

ఇవి కూడా చదవండి: 'కృష్ణగారితో నాకు అక్రమ సంబంధం అంటగట్టాడు'.. నరేష్‌ భార్య షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed