ప్రేమ పెళ్లి చేసుకుంటే అమ్మాయికి ఆస్తిలో వాటా..?! గుజ‌రాత్ హైకోర్టు కీల‌క తీర్పు

by Sumithra |
ప్రేమ పెళ్లి చేసుకుంటే అమ్మాయికి ఆస్తిలో వాటా..?! గుజ‌రాత్ హైకోర్టు కీల‌క తీర్పు
X

దిశ‌, వెబ్‌డెస్క్ః చనిపోయిన వ్యక్తి ఆస్తులను అతని కుమార్తెకు తక్షణమే బదిలీ చేయాలని గుజరాత్ హైకోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకోవాలనే నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు వ్యతిరేకించిన‌ప్ప‌టికీ, ఆస్తిపై ఆమెకున్న‌ హక్కును కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసిన హైకోర్టు, ఆస్తిపై స్త్రీకి ఉన్న హక్కు "రక్షింపబడాలి. కేవ‌లం, తన జీవిత భాగస్వామిని మాత్రమే ఎంపిక చేసుకునే రాజ్యాంగ హక్కు ఆమెకు సంతృప్తికరమైన, నాణ్యమైన జీవితాన్ని ఇవ్వకపోవచ్చు" అని కోర్టు పేర్కొంది. చ‌నిపోయిన త‌న తండ్రి ఆస్తిలో రెండు ఇళ్లు, ఒక దుకాణం, వ్యవసాయ క్షేత్రాన్ని మహిళ పేరుపైకి మార్చే ప్రక్రియను చేపట్టాలని స్థానిక పోలీసు, న్యాయ సేవాధికార సంస్థలను కోరింది.

ఈ కేసు గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లా ప్రాంజతిజ్ తాలూకాకు చెందిన 24 ఏళ్ల మహిళకు సంబంధించింది. మహిళ తండ్రి డిసెంబర్ 2021లో మరణించగా, ఆమె తల్లి కొన్నేళ్ల క్రితం మరణించింది. ఆమె తండ్రి మరణం తరువాత, మిగిలిన కుటుంబ సభ్యులు వాళ్లు ఎంపిక చేసిన వ్యక్తినే వివాహం చేసుకోవాలని ఆమెను బలవంతం చేయడానికి ప్రయత్నించారు. కానీ, ఆమె ఫిబ్రవరిలో అదే గ్రామానికి చెందిన తన ప్రియుడిని వివాహం చేసుకుంది. ఈ నిర్ణయంతో కోపోద్రిక్తుడైన మహిళ పెదనాన్న ఆమె భర్త, బావపై దాడి చేసి, ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆమె భర్త తన భార్య కస్టడీ కోరుతూ న్యాయవాది భునేష్ రూపేరా ద్వారా హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేయడంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

ఆ మహిళను గ‌త‌ బుధవారం కోర్టులో హాజరుపరిచారు. కాగా, ఆమె పెద‌నాన్న‌ తన తండ్రి ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నాడ‌ని ఆమె కోర్టులో చెప్పింది. ఈ సంద‌ర్భంగా జ‌స్టీస్ సోనియా గోకాని, జస్టిస్ మౌనా భట్‌లతో కూడిన ధర్మాసనం ఆస్తులపై ఆమెకున్న హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది, ఎందుకంటే, ఆమె ప్రేమ వివాహం త‌న నాణ్యమైన జీవితాన్ని హరించడానికి ఒక కార‌ణం కాకూడ‌ద‌ని, సదరు మహిళకు ఆస్తులను బదలాయించేందుకు ప్రతీజ్ పోలీస్ స్టేషన్‌తో కలిసి పని చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని కోరారు. నివేదిక ప్రకారం, వీలైనంత త్వరగా స్త్రీ ఆస్తులను భౌతికంగా స్వాధీనం చేసుకునేలా చూడాలని న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Next Story

Most Viewed