Tips: అమ్మమ్మ చెప్పిన చిట్కా.. అద్భుతంగా పనిచేస్తుంది..!

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-12-06 15:56:32.0  )
Tips: అమ్మమ్మ చెప్పిన చిట్కా.. అద్భుతంగా పనిచేస్తుంది..!
X

దిశ, ఫీచర్స్: అందాన్ని మెరుగుపరచడం కోసం మహిళలు మార్కెట్‌లో లభించే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. ముఖ్యంగా చలికాలంలో చర్మాన్ని సంరక్షించుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా రసాయనాలు కలిపిన వాటిని కాకుండా అమ్మమ్మల కాలం నుండి చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తున్న సున్నిపిండిని ఒంటికి పట్టించి రుద్దితే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో చర్మాన్ని మెరిపించే పోషకాలు చాలా ఉంటాయి. సున్నిపిండి తయారీలో ఉపయోగించే శనగపిండి, పెసర పిండి, పసుపు చర్మాన్ని సంరక్షిస్తాయి. సున్నిపిండిలో వాడే గులాబీ రేకులు ట్యాన్‌ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఇవి చర్మాన్ని జిడ్డుగా మారకుండా కాపాడుతాయి.

సున్నిపిండిలో కలిపే పసుపు యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తాయి. మచ్చలు లేకుండా చేసి, చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. సున్నిపిండిలో కాస్త నువ్వులనూనెను వేసి ఒంటికి పట్టిస్తే, చర్మానికి రక్తప్రసరణ జరుగుతుంది. ప్రతి రోజూ ఉపయోగించే సబ్బు పైపై ఉండే జిడ్డును మాత్రమే తొలగిస్తుంది. సున్నిపిండి అయితే చర్మ రంధ్రాల లోపల ఉన్న మురికిని తొలగిస్తుంది. అంతేకాకుండా రోజంతా శరీరాన్ని తేలికగా ఉంచుతుంది. ప్రతి రోజూ సున్నిపిండితో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు దరిచేరవు. మొటిమలు, ముడతలు తగ్గి, చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం:

పచ్చి శనగ పప్పు, పెసర పప్పు, ఉలవలు, ముల్తానీ మట్టిని సమానంగా కావాల్సిన మోతాదులో తీసుకోవాలి. పసుపు, గులాబీ రేకులు, తులసి ఆకులు, నారింజ తొక్కలు, బియ్యప్పిండి, మెంతులను గ్రాములలో తీసుకోవాలి. ఒకవేళ మీరు పచ్చి శనగ పప్పు, పెసర పప్పు, ఉలవలు, ముల్తానీ మట్టిని పావు కేజీ తీసుకున్నట్లైతే.. పసుపు, గులాబీ రేకులు, తులసి ఆకులు, నారింజ తొక్కలు, బియ్యప్పిండి, మెంతులను 60 గ్రాముల వరకు తీసుకోవాలి.

ముందుగా పైన తెలిపిన పదార్థాలన్నింటిని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. ఆ తరువాత మెత్తని పిండిలా చేసి, అన్నింటిని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజూ స్నానానికి ముందు ఈ పిండిని ఉపయోగిస్తే చర్మానికి మేలు జరుగుతుంది. స్నానం చేసేటప్పుడు సమయం కుదరకపోతే ఈ పిండిని ఫేస్ ప్యాక్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు.

ఫేస్ ప్యాక్ ఇలా వేసుకోండి:

నిల్వ చేసిన సున్నిపిండి పొడిని ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ స్వచ్ఛమైన రోజ్ వాటర్, ఒక స్పూన్ పెరుగు, కొద్దిగ నీళ్లు కలుపుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. దానిని ముఖానికి అప్లై చేసి, 20 లేదా 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత శుభ్రమైన నీళ్లతో కడిగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాకుండా ముఖంపై ఉన్న మచ్చలు, మొటిమలను తొలగిస్తుంది. వారానికి మూడు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Read More...

Health : ఓవర్ ఈటింగ్ డిజార్డర్.. బయటపడే మార్గమిదిగో!




Next Story

Most Viewed