AI Misuse: ఏఐ మిస్ యూజ్.. నియంత్రణకు కాలిఫోర్నియాలో చట్టం.. అంతటా అవసరమంటున్న నిపుణులు

by Javid Pasha |   ( Updated:2024-09-22 15:02:48.0  )
AI Misuse: ఏఐ మిస్ యూజ్.. నియంత్రణకు కాలిఫోర్నియాలో చట్టం.. అంతటా అవసరమంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI).. ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇది. దీనివల్ల మానవాళికి ఎలాంటి ప్రయోజనం ఉందనే విషయమై సోషల్ మీడియా వేదికగా చర్చలు, వివాదాలు కామన్ అయిపోతున్నాయి. ఈ టెక్నాలజీతో మంచి బెనిఫిట్స్ ఉన్నాయని కొందరు వాదిస్తుండగా.. ప్రయోజనాలు ఏమో కానీ.. నష్టాలే అధికంగా ఉంటాయని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఏఐ అందుబాటులోకి వచ్చాక జరిగిన నష్టాలు ఊహించని రీతిలో ఉన్నాయని అనేకమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొంటున్నారు.

పెరుగుతున్న ఆందోళన

రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోల క్రియేషన్, తప్పుడు ప్రచారం వంటివి ఊపందుకోవడం చూస్తుంటే.. ఏఐ ఎంత ప్రమాదకరమో అర్థం అవుతోందని కొందరు సాంకేతిక నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా రీసెంట్‌గా కాలిఫోర్నియా ప్రభుత్వం ఏఐని సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలు, మానవాళికి ముప్పు కలిగించేలా తప్పుడు కంటెంట్ క్రియేట్ చేయడం వంటి వాటికి వినియోగించకుండా గట్టి నియంత్రణ చర్యలను చేపట్టింది. అందులో భాగంగా ఇటీవల ఓ ముసాయిదాను తీసుకురాగా.. ఈ నియంత్రణ చట్టంపై ఆ దేశ గవర్నర్ కూడా సంతకం చేయడంతో ఇప్పుడు మరోసారి అందరి దృష్టి ఏఐ టెక్నాలజీ వైపు మళ్లింది.

ఇండియాలో ఇలా..

ఇక భారత దేశంలోనూ ఏఐ టెక్నాలజీ కొన్ని వివాదాలకు కారణమైంది. ముఖ్యంగా ఆ మధ్య హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో లీక్ కాగా, ఆ తర్వాత వరుసగా కత్రినా కైఫ్, సారా టెండూల్కర్‌కు కూడా చేదు అనుభవం ఎదురైంది. మహిళల ప్రైవసీకి భంగం కలిగించేలా ఈ టెక్నాలజీని కొందరు మిస్ యూజ్ చేస్తున్నారు. దీనిని యూజ్ చేసి ఇటీవల కేరళలో సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ. 50 వేల లూటీ చేసినట్లు వార్తలు వచ్చాయి. వరల్డ్ వైడ్ చూసుకుంటే.. సౌత్ కొరియాలోని ఓ ప్లాంట్‌లో మనిషిని, కూరగాయల బుట్టను వేరు చేసి గుర్తించడంలో విఫలమైన రోబో సదరు వ్యక్తి మరణానికి కారణమైంది. ఇలా ఒకటో రెండో కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలా సంఘటనలు జరిగాయి. అంతేకాకుండా కృత్రి మేధ కారణంగా భవిష్యత్తులో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన సైతం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఏదైనా జరగొచ్చు !

ఏఐ మెషిన్ లెర్నింగ్ ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారిందంటున్నారు పలువురు. ఎందుకంటే స్వయంగా ఏదైనా నేర్చుకోగల సామర్థ్యం అది కలిగి ఉంటుంది. దానితో అనుసంధానమైన రోబోలు ఇందులో భాగంగా ఒకానికి మించి మరొకటి నేర్చుకుంటూ ఉంటాయి. అయితే ఈ పరిస్థితి వల్ల అవి సూపర్ ఇంటెలిజెన్స్‌గా మారి కొన్నిసార్లు మనుషుల ఆదేశాలు బేఖాతర్ చేసే అవకాశం దాదాపు 10 శాతం వరకు ఉందని పరిశోధకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా స్పేస్ ఫోర్స్ విభాగం ఏఐ ఆధారంగా పనిచేసే ఛాట్ జీపీటీ వంటి టూల్స్ వాడకాన్ని నిలిపివేసింది. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఏఐని నియంత్రించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై కూడా సంతకం చేశారు. ఇక బ్రిటిన్‌లో మొదటిసారిగా ఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశ ప్రధాని కూడా ప్రకటించారు. ఆ మధ్య ఇండియాలో కూడా ఏఐ సమ్మిట్ జరిగింది. ఇక్కడ కూడా లాభ నష్టాలపై చర్చలు జరిగాయి.

కాలిఫోర్నియాలో నియంత్ర చట్టం

ఇక ఏఐ నియంత్రణపై ప్రస్తుతం కాలిఫోర్నియా ప్రభుత్వం తీసుకున్న చర్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అన్ని దేశాలకంటే ముందుగా ఏఐని నియంత్రించడంలో చట్టం చేసింది. మరణించిన వారితో సహా ఆడియో అండ్ విజువల్ ప్రొడక్షన్‌లలో నటీనటుల ప్రదర్శన, వారి డిజిటల్ అనుకరణ, ప్రవర్తన, పోలికలను డీప్ ఫేక్‌లకు, అశ్లీలతకు ఉపయోగించకుండా నియంత్రించేలా రెండు ముసాయిదా బిల్లులను కాలిఫోర్నియా తయారు చేయగా.. తాజాగా ఆ దేశ గవర్నర్ గావిన్ న్యూసోమ్ (Gavin Newsom ) దానిపై సంతకం చేశారు. ఎంటర్టైన్మెంట్ రంగం సహా అనేక రంగాల్లో ప్రజలు, ప్రముఖులు, సెలబ్రిటీలు, కార్మికులకు మరింత రక్షణ కల్పించడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర డిజిటల్ మీడియా సాంకేతికతలను బాధ్యతా యుతంగా వినియోగించేలా చట్టం సహాయం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఏఐ సహా అన్ని రకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నుంచి ప్రజల నైతిక హక్కులు, విలువలు కాపాడేలా చట్టపరమైన రక్షణ అవసరమనే చర్చలు ఊపందుకున్నాయి.

Read More...

Special Story: మోడుబారుతున్న పల్లెలు.. పార్ట్ టైం జాబ్‌లా వ్యవసాయం

Advertisement

Next Story

Most Viewed