- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Psychological complexes : అపరాధ భావం నుంచి అత్యుత్సాహం వరకు.. భిన్న మానసిక ధోరణులివే..
దిశ, ఫీచర్స్ : ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందిస్తున్నారా? చిన్న పొరపాటుకే అపరాధ భావం వెంటాడుతోందా? అవసరం లేకపోయినా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా? పలు విషయాల్లో ఇతరులను మార్చాలని ఎక్కువగా ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ తరహా వ్యక్తులు విభిన్న సంక్లిష్ట మానసిక ధోరణులకు దారితీసే ‘సైకలాజికల్ కాంప్లెక్సెస్’ బారిన పడి ఉండవచ్చు అంటున్నారు సైకాలజిస్టులు. వీటిని ఒక రుగ్మతగా పేర్కొంటున్నారు. వ్యక్తిగత ఆసక్తులు, ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలు, కోరికలు వంటివన్నీ ఒక కామన్ థీమ్ చుట్టూ తిరుగుతూ పరిస్థితులను అంచనా వేసేలా ఇవి ప్రేరేపిస్తుంటాయని చెప్తున్నారు. వాటికి సంబంధించిన ప్రవర్తన ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
అనుభవాలు - ఆలోచనలు
మానవ సంబంధాలలో చాలా వరకు భిన్న మానసిక ధోరణలు, భిన్న ప్రవర్తనలు కనిపిస్తుంటాయి. బాల్యంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు, విషాద ఘటనలు, ఆనందకరమైన సందర్భాలు, పుట్టి పెరిగిన వాతావరణం వంటివి కూడా ఇందుకు దోహద పడుతుంటాయి. తద్వారా ఏర్పడిన వ్యక్తిత్వం లేదా రుగ్మతల కారణంగా కూడా పలువురు ఇతరులను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. కొందరైతే తమ ఆలోచనల పరిధిలోనే అవతలి వ్యక్తులను అంచనా వేస్తుంటారు. అపరాధ భావం మొదలు కొని అత్యుత్సాహం వరకు ప్రవర్తనా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.
ఇతరుల ప్రయోజనాలే ముఖ్యం
తాము బాగుండటంతోపాటు ఇతరులు కూడా బాగుండాలని అనుకోవడం సహజం. కానీ కొందరు ఇందుకు భిన్నంగా ఆలోచించే రకం కూడా ఉంటారు. తమను తాము అనేక విషయాల్లో విస్మరించుకుంటారు. కానీ ఇతరులను మాత్రం విస్మరించరు. ముఖ్యంగా తమ సొంత ప్రయోజనాలకంటే తమకు నచ్చిన ఇతర వ్యక్తుల ప్రయోజనాలు అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తుంటారు. ఈ స్వభావాన్నే మార్టెర్ కాంప్లెక్స్ (Martyr complex) అంటున్నారు నిపుణులు. ఈ విధమైన మానసిక ధోరణి కలిగిన వారు ఎప్పుడూ ఇతరుల అవసరాలను తీర్చడం, ఇతరులకోసం త్యాగం చేయడం వంటి దూకుడు ప్రవర్తనను కలిగి ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే తమను తాము బలిపశువులను చేసుకునేందుకు సిద్ధపడతారని నిపుణులు అంటున్నారు. బాల్యంలో తమ సొంత భావాలను గుర్తించకుండా చేసిన పరిస్థితుల్లో పెరిగినవారిలో కూడా ఇతరుల శ్రేయస్సుకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే ఈ మానసిక ధోరణి ఏర్పడే చాన్స్ ఉందంటున్నారు నిపుణులు.
అనుమానమే అసలు రోగం
మనుషుల్లో కనిపించే మరో రకమైన సంక్లిష్ట మానసిక ధోరణి ఏంటంటే.. ఇతరులను ఓ పట్టాన నమ్మరు. బయటకు చెప్పకపోయినా ప్రతీ విషయంలో అనుమానిస్తూ అవతలి వ్యక్తులతో అలర్ట్‌గా ఉండాలని భావిస్తుంటారు. దీనినే పర్ సెక్యుషన్ (Persecu tion complex) కాంప్లెక్స్‌గా నిపుణులు చెప్తున్నారు. క్రమంగా ఇదొక రుగ్మతగా మారవచ్చు. అప్పుడు ఒక్కోసారి మతిస్థిమితం లేని వ్యక్తుల్లా కూడా ప్రవర్తించే చాన్స్ కూడా ఉంటుందని నిపుణులు చెప్తు్న్నారు. ఈ రకమైన మానసిక ధోరణి కలిగిన వ్యక్తులతో వారి కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల వారు కూడా ఇబ్బందులు పడవచ్చు. ఎందుకంటే వీరు తమకు ఉన్న బలహీనతలు ఇతరులకు కూడా ఉన్నాయని భావిస్తుంటారు. అలాగే సమాజం పట్ల, ఇతరులపట్ల నిరాధారమైన నమ్మకాలను, మూఢ నమ్మకాలను కలిగి ఉంటారు. ఇతరులతో తమకు ఏదైనా హాని కలగవచ్చని ఎక్కువగా భయపడటం, భ్రమలకు లోనవడం చేస్తుంటారు.
స్త్రీలపట్ల ఆరాధనా భావం
కొందరు స్త్రీలపట్ల సాధారణంకంటే ఎక్కువ భావోద్వేగాలను ప్రదర్శిస్తుంటారు. ముఖ్యంగా ఈ తరహా వ్యక్తులను స్త్రీ లోలురుగా, స్త్రీ ఆరాధకులుగా పేర్కొంటారు. వీరికి స్త్రీలపట్ల మోజు లేదా వ్యామోహం కూడా ఎక్కువే. దీనిని సైకాలజీ పరిభాషలో కాసనోవా కాంప్లెక్స్ అంటున్నారు మానసిక నిపుణులు (Casanova complex) నిజానికి 18వ శతాబ్దపు ఇటాలియన్ సాహసికుడు, రచయిత కాసనోవా వల్ల ఈ రుగ్మత లేదా మానసిక ధోరణికి ఆ పేరు వచ్చిందట. ఈ విధమైన మానసిక స్వభావం కలిగిన వారు ఎప్పుడూ మనోహరంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంటారు. వాస్తవాలతో సంబంధం లేకుండా తాము ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోవాలని, ఎక్కువ మంది మహిళలను ప్రేమించాలనే కోరికను కలిగి ఉంటారట. ఈ విధమైన సంక్లిష్ట మానసిక ధోరణి అభద్రతా భావం, తీవ్రమైన ఒత్తిళ్లను అనుభవిస్తూ పెరిగిన వారిలో ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. తమ బలహీనతను అధిగమించే ప్రయత్నంలో భాగంగా వీరు ఇతర మహిళలతో ఎఫైర్ పెట్టుకుంటారు.
తక్కువ అంచనా వేయడం
విభిన్న సంక్లిష్ట మానసిక ధోరణుల్లో తరచుగా కనిపించేది తమను తాము తక్కువ అంచనా వేసుకునే స్వభావం కూడా ఒకటి. దీనినే ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ (Inferiority complex) అని కూడా అంటారు. ఈ విధమైన మనస్తత్వం కలిగిన వారు సమర్థవంతులే అయినప్పటికీ ఇతరులతో పోల్చుకుంటూ తమకు అంత సామర్థ్యం లేదని ఫీలవుతుంటారు. క్రమంగా అభద్రత, ఆత్మ న్యూనతా భావాలకు లోనవుతారు. దీంతో ఇతరులపట్ల కోపం కూడా ప్రదర్శిస్తుంటారు.
పరిష్కారం ఏమిటి?
సమాజంలో భిన్న స్వభావాలు, మానసిక ధోరణులు కలిగిన వ్యక్తులు ఉండటం సహజం. అయితే సదరు వ్యక్తులకుగానీ, సమాజంలో ఇతర వ్యక్తులకు గానీ ఇబ్బందిగా మారనంత వరకు పర్లేదు. కానీ అందుకు భిన్నంగా అతి ధోరణులుగా లేదా రుగ్మతలుగా మారితేనే సమస్య. ఇదంతా సహజంగానే వచ్చిపోయే సమస్యలుగా ఉంటాయి. పరిస్థితుల ప్రభావం, సామాజిక అవగాహన, అనుభవాల ద్వారా గుణపాఠాలు నేర్చుకోవడంవల్ల చాలామంది తమలోని ఇబ్బందికరమైన మానసిక ధోరణులను మార్చుకుంటారు. అలా జరగనప్పుడు అరుదుగా కొందరికి వైద్య నిపుణుల ద్వారా చికిత్స, సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ వంటివి అవసరం అవుతాయి.
Also Read: శృంగారంపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన సర్వే... ఆ రోజు ఆ టైమ్ బెస్ట్... వరెస్ట్ మాత్రం..