Frequent urination : పిల్లలు ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్తున్నారా..? ఆ వ్యాధి వల్ల కూడా కావచ్చు!

by Javid Pasha |
Frequent urination : పిల్లలు ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్తున్నారా..? ఆ వ్యాధి వల్ల కూడా కావచ్చు!
X

దిశ, ఫీచర్స్: తరచుగా మూత్ర విసర్జన చేయడం అనేది పిల్లల్లో కనిపించే సహజ లక్షణమే. అయితే ఇది సాధారణంగా ఉన్నంత వరకే అంటున్నారు వైద్య నిపుణులు. నార్మల్ కంటే ఎక్కువసార్లు పిల్లలు యూరిన్‌కు పోవడం, వారు ఇబ్బందిగా ఫీల్ అవడం వంటివి గమనిస్తే ఏదో సమస్య ఉన్నట్లు అనుమానించాలని చెప్తున్నారు.

పాలి యూరియా కావచ్చు

నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల యూరిన్ ఎక్కువసార్లు పోతే పర్లేదు కానీ.. కొందరు పిల్లలు వాటర్ తాగకపోయినా రోజుకూ 10 నుంచి 12 సార్లు పాస్ చేస్తుంటారు. అలాంటప్పుడు దీనిని మూత్ర అనియంత్రిత వ్యాధి అయినటువంటి ‘పాలియూరియా’గా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా 3 నుంచి 8 ఏండ్ల వయస్సు గల పిల్లలు ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఎక్కువ. ఈ వ్యాధి బారిన పడ్డ పిల్లలు కొందరైతే రోజులో 10 నుంచి 30 సార్లు కూడా యూరిన్‌కు పోతుంటారు. అట్లనే పాస్ చేస్తున్న సమయంలో నొప్పి కూడా వస్తుంది. అలా ఎందుకు జరుగుతుందో అవగాహన లేక చాలామంది పిల్లలు ఈ విషయాన్ని చెప్పకుండా మిన్నకుండి పోతుంటారు. కాకపోతే పేరెంట్స్ వారిని కాస్త అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

రాత్రిపూట ఎక్కువసార్లు పోతుంటే..

ఎనిమిది సంవత్సరాలలోపు పిల్లలు రాత్రిపూట మాత్రమే ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు పోతుంటే అది నోక్టురియా వ్యాధి వల్ల కూడా కావచ్చు అంటున్నారు డాక్టర్లు. ఈ వ్యాధి ఉన్నవారు నిద్రలో మంచంపైనే తమకు తెలియకుండానే మూత్ర విసర్జన చేస్తుంటారు. ఎక్కువకాలం ఈ సమస్యను ఎదుర్కొనే పిల్లల్లో మూత్ర విసర్జన సమయంలో మంట, అప్పుడప్పుడూ జ్వరం, కడుపు నొప్పి, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా అరుదుగా కనిపిస్తుంటాయి.

కారణాలు ఇవే..

తరచుగా ఆటల్లో మునిగిపోయి, స్కూళ్లల్లో ఉన్నప్పుడు పిల్లలు మూత్రాన్ని ఆపుకోవడం, అలాగే స్పైసీ ఫుడ్స్ తినడం, సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే పండ్లను తినడం, అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లు, బాత్రూములను యూజ్ చేయడం వంటి కారణాలతో అధిక మూత్ర విసర్జన వ్యాధులు వస్తుంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. మూత్ర మార్గంలో బ్యాక్టీరియా చేరడం కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుందని అంటున్నారు. కాబట్టి పిల్లల్లో అధిక మూత్ర విసర్జన సమస్యలు, లక్షణాలు ఐదారు రోజులకు మించి కనిపించిస్తే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed