Fitness feats: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నాయా..? ఆ వ్యాయామాలు అస్సలు చేయొద్దు!

by Javid Pasha |
Fitness feats: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నాయా..? ఆ వ్యాయామాలు అస్సలు చేయొద్దు!
X

దిశ, ఫీచర్స్ : వ్యాయామాలు చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తుంటారు. గ్రౌండ్‌కు లేదా జిమ్‌కు వెళ్లి రకరకాల వర్కవుట్స్ ప్రయత్నించేవారు ఈ రోజుల్లో చాలా మంది ఉంటున్నారు. ముఖ్యంగా యువతలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరుగుతోంది. అది అవసరమే అయినప్పటికీ మనసుకు రిలాక్సేషన్ అవసరమైనప్పుడు, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు మాత్రం వ్యాయామాలు చేయకూడదు అంటున్నారు నిపుణులు. అవి ఏవి?, ఎందుకు చేయకూడదో ఇప్పుడు చూద్దాం.

* గుండ దడ, బెణుకు : బయటి పరిస్థితుల్లో మానసిక పరమైన ఏ కారణాలు లేకపోయినా.. ఒక్కోసారి గుండె దడ, భయం, ఆందోళన వంటివి అనుకోకుండా ఏర్పడుతుంటాయి. కాళ్లు, చేతుల్లో వణుకు, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు వ్యాయామం చేస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుందని కొందరు భావిస్తుంటారు. కానీ కరెక్ట్ కాదంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. రక్త ప్రసరణ వ్యవస్థలో ఆటంకంవల్ల, గుండె సంబంధింత సమస్యలకు సూచనగా కూడా కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో వ్యాయామం ఆపేయడం మంచిది. శరీరానికి సౌకర్యంగా అనిపించేలా చిన్నగా నడవడం చేయవచ్చు.

* తలనొప్పి : రోజువారీ అలవాటులో భాగంగా చిన్న చిన్న అనారోగ్యాలు చేసినా కొందరు వ్యాయామం కొనసాగిస్తుంటారు. అయితే తలనొప్పి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు. ఎందుకంటే బాడీ డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు, అలాగే అధిక రక్తపోటు వల్ల కూడా తలనొప్పి సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వ్యాయామంవల్ల శరీరం మరింత అలసటకు గురై ఒక్కసారిగా నిర్జలీకరణ పెరిగిపోతే ప్రాణాపాయం సంభవించవచ్చు అంటున్నారు నిపుణులు.

* జలుబు, దగ్గు : జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఉన్నప్పుడు వ్యాయామం చేయకూడదు. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడంవల్ల ఇవి సంభవిస్తుంటాయి. అలాగే శరీరం బ్యాక్టీరియాతో పోరాడటానికి ఎక్కువ శక్తిని వెచ్చిస్తుంది. కాబట్టి వ్యాయామం కూడా చేయడం వల్ల మరింత అలసటకు, బలహీనతకు గురవుతుందని నిపుణులు చెప్తున్నారు.

*నిద్ర లేమి, ఆల్కహాల్ : తగినంత నిద్రలేకపోయినా ఎక్సర్‌సైజ్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే నిద్రలేమితో శరీరం అలసటకు గురవుతుంది. వ్యాయామంవల్ల అది మరింత ఎక్కువై సమస్యలు రావచ్చు. అలాగే ఆల్కహాల్ సేవించిన తర్వాత కూడా వ్యాయామానికి దూరంగా ఉండాలి. లేకపోతే ఆ సమయంలో బాడీ డీహైడ్రేషన్‌కు గురికావచ్చు.

*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed