Newly married : పెళ్లైన కొత్తలో.. ఆ ఆందోళన దేనికి?

by Javid Pasha |
Newly married : పెళ్లైన కొత్తలో.. ఆ ఆందోళన దేనికి?
X

దిశ, ఫీచర్స్ : పెళ్లి ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా పేర్కొంటారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన జంటలు ఎంతో అన్యోన్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆ తర్వాత మళ్లీ ఉద్యోగాలు, పిల్లలు, ఇంటి బాధ్యతలు వంటివి సహజంగా ఉండేవే. అయితే ఇక్కడే కొందరు మిడిల్ క్లాస్ పీపుల్ అవస్థలు పడుతుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఎదరై, ఆందోళన చెందుతుంటారు. అందుకు గల కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం.

ప్లానింగ్ లేకపోవడం

ఈ రోజుల్లో చాలా మంది జంటలు పెళ్లికి ముందు జరిగే ముఖ్యమైన వేడుకలకోసం సొంతంగా కొంత డబ్బు వెనుకేసుకుంటున్నారు. ఇక పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీ, హల్దీ వేడుక, మెహందీ వేడుక, అలాగే మ్యారేజ్ రోజు, రిసెప్షన్ రోజు వాటిని ఖర్చు చేస్తుంటారు. అయితే కొందరు తమ అంచనాలకు మించి ఖర్చు చేయడం, అప్పులు చేసి మరీ వేడుకలు చేయడం ఆర్థిక ఆందోళనకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఆదాయానికి మించిన ఖర్చులు వివాహం తర్వాత ఇబ్బందుల్లో నెడతాయి.

ఆందోళన, ఒత్తిడి

పెళ్లి ప్రారంభం కాకముందు నుంచే పలువురు భారీగా ఖర్చు చేస్తుంటారు. పెళ్లి చాలా ఘనంగా జరగాలనుకోవడంలో తప్పులేదు. కానీ తాహతుకు మించిన అంచనాలతో ఉండటమే ఇక్కడ సమస్యగా మారుతుంది. ఫంక్షన్ హాల్స్ కోసమని, బట్టలు, జ్యువెలరీస్, క్యాటరింగ్, బ్యుటీషన్లు, ఫొటో గ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షూట్, కట్న కానుకలు వంటివి ఆర్థిక పరిస్థితులపై ప్రభాం చూపుతాయి. కొందరైతే అప్పుచేసి మరీ పెళ్లి తంతు పూర్తిచేయాలని అనుకుంటారు. కానీ పెళ్లి తర్వాత భారంగా మారుతుంది అంటున్నారు నిపుణులు.

హనీమూన్‌ కష్టాలే వేరు..

పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లడం చాలా కామన్. ఇందుకోసం ఖర్చు కూడా బాగానే ఉంటుంది. జంటలు వెళ్లాల్సిన ప్రదేశాలు, హోటల్స్, రిసార్ట్‌ల‌ను బట్టి ఎక్కువమొత్తంలో ఖర్చయిపోతుంటాయి. ఇక జర్నీకోసం అయ్యే ఖర్చులు కూడా ఉంటాయి. పెళ్లికి ముందే ఇవన్నీ ఆలోచించి తగిన బడ్జెట్ సమకూర్చుకోకుంటే మాత్రం తర్వాత అవస్థలు పడాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు.

ఇంటి ఖర్చులు.. ఇబ్బందులు

పెళ్లి తర్వాత పరిస్థితులు మారిపోతాయి. ఖర్చులు, బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఉద్యోగస్తులు ఇతర ప్రాంతాల్లో ఉండటానికి ఇల్లు కిరాయికి తీసుకోవాలి లేదా పర్మినెంట్‌గా ఉద్యోగం ఉన్న సిటీలోనే సెట్ అవ్వాలనుకుంటే సొంత ఇల్లు కొనుక్కోవాలి. ఇందుకోసం డబ్బు అవసరం అవుతుందని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సొంత ఇల్లు కాకపోయినా అద్దె ఇంటిలో ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నెల నెలా రెంటు కడుతూ సంతోషంగా జీవించేలా సంపాదన ఉంటే బెటర్. దీంతోపాటు కొంత బ్యాలెన్స్ ఉంటేనే ఈరోజుల్లో లైఫ్ బిందాస్‌గా ఉంటుంది.

బాధ్యతల భారం మోయలేక..

పెళ్లయ్యాక ఖర్చులే కాదు, బాధ్యతలు అధికం అవుతాయి. అంతకాలం బ్యాచిలర్‌గా పెరిగిన వారు ఎలాబడితే అలా ఖర్చు చేసి ఉండి ఉండవచ్చు. కుటుంబంపై ఆధారపడటంవల్ల మీకు ఈజీ అయి ఉండవచ్చు. ఉద్యోగం చేసినా, మీ సొంత డబ్బే ఖర్చు పెట్టుకున్నా పెళ్లికాకుముందు కుటుంబం నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదో ఒక రూపంలో ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత మీరే కుటుంబానికి ఆధారం కావచ్చు. అప్పుడు ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకుంటే ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి పెళ్లికి ముందే ఇలాంటి విషయాల్లో ఆలోచించుకోవడం, కొంత బడ్జెట్ వెనుకోసుకోవడం అనేది పెళ్లైన కొత్తలో ఆర్థిక ఇబ్బందులు రాకుండా సహాయపడుతుంది అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed