Bike stunts : రయ్.. రయ్.. వద్దురోయ్ !!

by Javid Pasha |
Bike stunts : రయ్.. రయ్.. వద్దురోయ్ !!
X

‘‘ఎన్క పోరి గూసుంటే ఏం కనవడదు మనోళ్లకు..

బైక్ మీద ఆ స్టంట్ ఏంది రా బై.. ఎంత డేంజర్..’’

సోషల్ మీడియాలో వైరల్ వీడియోను చూసిన ఓ వ్యక్తి రియాక్షన్ ఇది.

‘బొక్కబోర్ల పడితే.. పానం బోతది బిడ్డా..

కన్నోళ్లకు కడుపుకోత మిగల్చకండిరా నాయన జర’’

బైక్ స్టంట్‌లో గాయపడ్డ యువకుడిని చూసి ఓ పెద్ద మనిషి ఆవేదనిది.

ఇట్లా ఒకటో రెండో కాదు..

ప్రతీ రోజు, ప్రతీ నెల, ప్రతీ సంవత్సరం ఎన్నో జరుగుతున్నయ్.

అయినా సరే.. కొందరిలో మార్పు వస్తలేదు. ఎందుకలా?

- దిశ, ఫీచర్స్

‘‘అదిరి పోయే స్టంట్లు.. అంటూ అదేదో ఘనత సాధించినట్లు కొన్ని జంటలు సోషల్ మీడియాలో వీడియోలు వదులుతున్నాయ్. అతి వేగంతో చిత్ర విచిత్ర విన్యాసాలు మీకు సరదాగా అనిపింవచ్చు కానీ.. జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి’’ టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ యువతనుద్దేశించి ఈనెల 14న చేసిన హెచ్చరిక ఇది. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌లో షేర్ చేసిన వీడియో చూస్తే అర్థమైతది ఎవరికైనా.. కొందరు ఎంత డేంజర్‌గా ఉన్నారో. అందులోని వీడియోలో ఓ యువకుడు ఓ యువతిని బైకుమీద కూర్చో బెట్టుకొని డేంజర్ స్టంట్ చేశాడు. ఓ విధంగా చెప్పాలంటే ప్రాణాలతో చెలగాటమాడాడు. కాస్త మిస్ అయితే.. రెండు ప్రాణాలు గాల్లో కలిసేవి. ఆ వీడియోలో కనిపించిన యువజంటే కాదు. అలా ఎవరు చేసినా ప్రాణాంతకమేనంటూ హెచ్చరిస్తూ.. అలా చేయవద్దనే సందేశమిచ్చారు సజ్జనార్.. బైకుంది కదా అని డేంజరస్ స్టంట్లకు ఎగబడే పోరగాల్లు జర సోంచాయించున్ని ఇప్పటికైనా..

రయ్యున దూసుకొచ్చి.. అంతలోనే

అందరూ చూస్తుండగానే రయ్యున దూసుకొచ్చాడో యువకుడు. సినీ ఫక్కీలో హైవేపై విన్యాసాలు చేయడం మొదలు పెట్టిండు. కానీ.. ఇంతలోనే ఘోరం. బైక్ అదుపు తప్పింది. అతను పట్టుతప్పాడు. రోడ్డుపై బొక్క బోర్లా పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా ఉయ్యూరులో గతంలో చోటు చేసుకుందీ ఘటన. బైపాస్ రోడ్డులో బైక్‌పై డేంజర్ స్టంట్లు చేయబోయి సాయికృష్ణ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేదు. తీవ్రమైన గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. గత సంవత్సరమంతా ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. అతనెందుకలా చేశాడని పోలీసులు విచారించగా.. సోషల్ మీడియాలో వైరల్ కోసం, లైకులకోసం, వ్యూస్ కోసం అతను పడిన ఆరాటమే ప్రమాదకరమ విన్యాసానికి కారణమని తెలిసిందట. అది చూసైనా కనువిప్పు కలగలేదు కొందరికి. ఇప్పటికీ బైక్ స్టంట్లు, శిక్షణ లేకుండానే రేసింగ్‌లు అంటూ రోడ్లమీదకొస్తున్నారు. జర మారండి బ్రో. ప్రమాదమని తెలిసినా ప్రాణాల మీదకు తెచ్చుకుంటారెందుకు? తల్లిదండ్రులకు కడుపుకోత మితల్చడమెందుకు?

సోషల్ మీడియాలో హైప్ కోసం..

అది సీటీలోని సిటీలోని రద్దీ ఏరియా.. కొందరు యువకులు కలిసి బుర్ఖాలు ధరించి బైకుల మీద ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తూ హంగామా సృష్టించారు. రోడ్డుపై నుంచి వచ్చిపోయే వాళ్లు అది చూసి వీళ్లకేం పోయే కాలం అనుకున్నారు. కానీ చెప్తే వినరు కదా అందకని ఎవరి దారిని వాళ్లు పోయారు. కానీ అంతలోనే వెనుక అమ్మాయిని కూర్చో బెట్టుకొని స్టంట్ చేసిన మరో యువకుడు కింద పడ్డాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. యువకుడు గాలికి తీవ్రమైన గాయం కావడంతో జీవితాంతం వికలాంగుడిగా ఉండాల్సి వస్తుందని డాక్టర్లు తేల్చేశారు. ఇది హైదరాబాద్ పాత బస్తీ సౌత్ ఈస్ట్‌ జోన్ పరిధిలో గతంలో జరిగిన బైక్ విన్యాసాల పర్యవసనాలు. వాళ్లు అలా చేసిందే కాకుండా వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎందుకలా చేశారో తెలుసా.. ఫాలోయర్స్ ను పెంచుకోవడానికట. ఇలాంటి ఆగడాలు సిటీలో చాలానే పెరిగిపోతున్నాయని పోలీసులు గట్టి నిఘా వేశారు కూడా..

మితిమీరుతున్న ఆగడాలు

అర్ధరాత్రి దాటితే చాలు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ రెచ్చిపోతుంటారు కొందరు యువకులు. ముఖ్యంగా హైటెక్ సిటీలో రోడ్లపై వెళ్లాలంటే ఇప్పటికీ భయడపతారు జనాలు.. అక్కడే కాదు ట్యాంక్ బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కేబుల్ బ్రిడ్జ్, మలక్ పేట్, చంచల్ గూడ ఇలా చెప్పుకుంటూ పోతే.. దాదాపు సిటీలో రోడ్లపై ఇప్పటికీ పోకిరీలు రెచ్చిపోతున్నారు. బైకులతో ప్రమాదకర స్టంట్లు కొందరు చేస్తుంటే.. మరికొందరు డ్రింక్ చేసి వచ్చీపోయే వారిని తిట్టడం, కొన్నిసార్లు దాడులకు పాల్పడటం చేస్తుంటారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి కూడా. అయితే ఇది సిటీకే పరిమితం కాదు.. జిల్లా కేంద్రాల్లోని రోడ్లపైనా, ఆయా ప్రాంతాల నుంచి వెళ్లే హైవేలపైనా యువత ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతున్న సందర్భాలు ఉంటున్నాయి. ఆయా సందర్భాల్లో జరుగుతున్న ప్రమాదాలు, సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులే ఇందుకు నిదర్శనం. ఓ వైపు పోలీసులు హెచ్చిరిస్తున్నా, మరోవైపు పెద్దలు మందలిస్తున్నా.. ఏదో ఒక సమయంలో వారికళ్లు గప్పి రోడ్లపై తిష్ట వేస్తున్నారు. డేంజరస్ స్టంట్లతో రెచ్చిపోతున్నారు. ఇలా ప్రాణాలు పణంగా పెట్టడం అవసరమా? ఇప్పటికైనా మారాలి. ప్రాణం కంటే ఏదీ విలువైంది కాదు. ఒక్కసారి మీ గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించండి!

జర మారాలి బ్రో !

ప్రమాదమని తెలుసు.. కాస్త అటూ ఇటైతే ప్రాణం పోతుందని తెలుసు. అయినా ఎందుకీ బైక్ స్టంట్లు. రోడ్లపైకి రావడమెందుకు. వెనుకాల మరొకరిని కూర్చోపెట్టుకొని మరొకరి ప్రాణాన్ని కూడా బలితీసుకోవడమెందుకు? మీరు ప్రాణాలు కోల్పోతే తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతుంది. కొన్నిసార్లు ప్రమాదాలు జరగకపోయినా పోలీసులకు చిక్కితే కేసులు నమోదవుతాయి. చదువు, భవిష్యత్తుకు ఇది మచ్చ కదా.. ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తే అవతలి వ్యక్తులకూ నష్టం జరుగుతుంది. అంటే మీ సరదా మీతో పాటు ఇతరులకూ ప్రాణాంతకమే. ఇప్పటికైనా మారాలంటున్నారు పెద్దలు, నిపుణులు. మీకోసం.. మీ భవిష్యత్ కోసం..

Next Story