పాజిటివ్ ఎనర్జీకి కావాలా?.. వీటిపై ఫోకస్ చేయండి !

by Javid Pasha |
పాజిటివ్ ఎనర్జీకి కావాలా?.. వీటిపై ఫోకస్ చేయండి !
X

దిశ, ఫీచర్స్ : లైఫ్‌లో ఎప్పుడూ ఇబ్బందులే ఉంటాయని కాదు కానీ రోజువారీ ఒత్తిళ్లు మనల్ని అలసిపోయేలా చేస్తాయి. అయితే చిన్న చిన్న సర్దుబాట్లు మనకు జీవశక్తిని తిరిగి పొందడంలో సహాయపడతాయని, పాజిటివ్ ఎనర్జీని నింపుతాయని నిపుణులు చెప్తున్నారు. సొంత ఆలోచనలు మొదలు స్వయం ప్రతిపత్తి వరకు మన అనుభవాలు, అనుభూతులు, చేసే పనులు మనలో సానుకూల శక్తిని నింపుతాయి. ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి దోహదపడతాయి. అవేంటో చూద్దాం.

అటానమీగా ఉండండి

మన శారీరక అవసరాలు, ముఖ్యంగా ఆహారం, నీరు, నిద్ర మొదలైనవి తీరినప్పుడు మాత్రమే కాకుండా, మానసిక అవసరాలు తీర్చబడినప్పుడు కూడా చాలా శక్తిని, పాజిటివ్ ఎనర్జీని పొందుతామని పరిశోధలు చెప్తున్నాయి. అలాంటి అవసరాలను తీర్చగలిగే వాటిలో స్వయం ప్రతిపత్తి ( autonomy) లేదా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా ఉంది. ఇది ఓన్ బిహేవియర్స్‌ను కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనలో ఒత్తిడిని నివారిస్తుంది. అలాగని జీవితం మొత్తం మనం ఎంచుకునే విధంగానో లేదా ఊహించిన విధంగానో ఉండకపోవచ్చు. కానీ మనకు కొంత సౌలభ్యం ఉన్నప్పుడు సొంత నిబంధనల ప్రకారం పనులు చేయడానికి మార్గాలను అన్వేషించవచ్చు. అప్పుడే మనం మధురాను భూతిని, పాజిటివ్ ఎనర్జీని పొందుతాం.

ఇతరులకు సాయం చేయండి

పాజిటివ్ ఎనర్జీ లేదా జీవశక్తిని (vitality ) పెంచే మరో మానసిక అవసరం సోషల్ కనెక్షన్. అవసరం అయినప్పుడు ఇతరులకు స్వయంగా సాయం చేయడమో లేదా ఎమోషనల్ సపోర్ట్ అందించడమో ప్రయోజనం చేకూర్చే రూపాలే. మనం ఎప్పటికీ కలుసుకోని వారి కోసం ఏదైనా చేయడం కూడా సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం అనాథలకు ఏదైనా సహాయం చేయడంవల్ల లేదా ఇతరులను ఆపదలో ఆదుకోవడంవల్ల కలిగే అనుభూతి మనలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది.

చేయగలిగే పనులపై దృష్టి పెట్టండి

కొందరు ఇతరులు ఏం అనుకుంటారోనని తమకు నచ్చనివి, తాము చేయలేని పనులు చేస్తుంటారు. కానీ దీనివల్ల నష్టం జరుగుతుంది. మానసిక, శారీరక అలసటకు కారణం అవుతుంది. మనం చేసే పనులు ఏవైనా మన సామర్థ్యానికి తగినవా, కావా? అని కూడా చూడాలి. అంతేకాని ఇతరుల దృష్టిని ఆకర్షించే ఉద్దేశంతోనో, మెప్పుకోసమో ఇబ్బందికరమైన విషయాల్లో, పనుల్లో నిమగ్నం కావడం అనేది తర్వాత నిరాశకు గురిచేస్తుంది. మీరు పాజిటివ్ ఎనర్జీ పొందాలంటే చేయగలిగే పనులపైనే ఫోకస్ చేయాలంటున్నారు నిపుణులు.

నిరంతరం ప్రవాహ స్థితిలో ఉండండి

తమ పనుల్లో, వృత్తుల్లో ఒక ప్రవాహంలాగా నిమగ్నమై ఉండే వారు ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో ఉంటారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ ‘ప్రవాహ స్థితి’ అనేది మనం చేస్తున్న పనిలో పూర్తిగా కేంద్రీకరించడంవల్ల సమయం గడిచిపోతున్నట్లు గమనించలేం. ఇలా గడిపినంతసేపు మానసికంగా ఇబ్బందికి గురిచేసే ఆలోచనలు దాడిచేయలేవు. పైగా పనిలో నిమగ్నమై ఉండటంవల్ల శారీరక, మానసిక వ్యాయామం జరుగుతుంది. పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ఉదాహరణకు మ్యూజిక్ ప్లే చేయడం, డ్యాన్స్ చేయడం, ప్రకృతి ఆస్వాదనలో నిమగ్నం కావడం వంటి పనులను నిపుణులు ‘ప్రవాహ స్థితి’ మూవ్‌మెంట్‌గా పేర్కొంటున్నారు. ఇవి పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయని చెప్తున్నారు.

Advertisement

Next Story