కాంట్రవర్సీలో డాక్టర్స్ మ్యాచ్‌మేకింగ్ సైట్.. వివక్షను ప్రోత్సహిస్తోందంటూ..

by samatah |
కాంట్రవర్సీలో డాక్టర్స్ మ్యాచ్‌మేకింగ్ సైట్.. వివక్షను ప్రోత్సహిస్తోందంటూ..
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా అమ్మాయిలు, అబ్బాయిలు సేమ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్లను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఉదాహరణకు : లాయర్లు, సాఫ్‌వేర్ ఇంజనీర్స్, మీడియా, సైంటిస్ట్స్, డాక్టర్లు. అయితే అందుకు తగినట్లుగానే బ్రోకరేజ్ సంస్థలు లేదా వ్యక్తులు అలాంటి సంబంధాలే తీసుకొస్తుంటారు. ఇదే ఆలోచనతో ప్రారంభమైన 'మెడికో లైఫ్ పార్టనర్' కేవలం డాక్టర్లకే ప్రత్యేకమైన మ్యాచ్‌మేకింగ్ సైట్‌గా గుర్తింపు పొందింది. అయితే ఇది వర్గవాదాన్ని ప్రోత్సహిస్తుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇంతకీ ఆ డేటింగ్ సైట్ వివరాలేంటో తెలుసుకుందాం.

సాధారణంగా ఒకే వృత్తికి చెందినవాళ్లయితే ఒకరి సాధకబాధకాలు మరొకరి తెలుస్తాయని, ఒకే విధమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారని భావించి అందుకు తగిన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటారు. ఈ మేరకు మీరు డాక్టర్ అయితే తమ వృత్తిని పంచుకునే 'హై-క్వాలిటీ పార్టనర్స్'‌ను కనుగొనడంలో సాయపడే లక్ష్యంతో అందుబాటులోకి వచ్చిందే 'మెడికో లైఫ్ పార్టనర్' అనే ఆన్‌లైన్ మ్యాచ్‌మేకింగ్ సర్వీస్. వైద్యులెవరైనా ఇందులో తమ పేరును నమోదు చేసుకోవచ్చని వెబ్‌సైట్ పేర్కొంటుండగా, ఇది బాగా ప్రాచుర్యం పొందడం విశేషం. రూ. 3,825 రూపాయల ($49) నుంచి 18,900 రూపాయలు ($243) వరకు వివిధ చెల్లింపు ప్లాన్స్‌తో కూడిన అనేక రకాల రిజిస్ట్రేషన్ ఎంపికలను అందిస్తున్న మెడికో లైఫ్ పార్టనర్‌.. ఉచిత ప్లాన్ కూడా అవెలబుల్‌లో ఉంచింది.

అయితే భారతదేశం ఇప్పటికే కుల వ్యవస్థను, వర్గీకరణను ప్రోత్సహిస్తోందని చాలా మంది ఆరోపిస్తుండగా ఇక ఈ సైట్‌ను కేవలం వైద్యులకు మాత్రమే పరిమితం చేయడం వల్ల వర్గభేదం ఏర్పుడుతుందని విమర్శిస్తున్నారు నెటిజన్లు. ఇది సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదని చెప్తున్నారు. వైద్యులు తమ వృత్తికి చెందిన వారిని వివాహం చేసుకోవడం చాలా సౌకర్యవంతంగా ఉంటుందని కొందరు వాదిస్తుండగా.. లాయర్లు, ఇంజనీర్ల కోసం ఇలాంటి ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫామ్‌లు తీసుకురావాలని మరికొందరు కామెంట్స్ చేశారు. ఇక మెడికో లైఫ్ పార్టనర్‌లో ఉన్న 21వేలకు పైగా అకౌంట్స్‌లో చాలా వరకు నకిలీవి ఉన్నాయని కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఇది ఇంకా నిర్ధారణ కాలేదు.

Advertisement

Next Story

Most Viewed