Debt Crisis : క్రెడిట్ కార్డులు గీకేయడం.. అప్పుల్లో కూరుకుపోవడం.. Gen Z లో పెరుగుతున్నకొత్త ధోరణి!

by Javid Pasha |   ( Updated:2024-08-27 13:07:40.0  )
Debt Crisis : క్రెడిట్ కార్డులు గీకేయడం.. అప్పుల్లో కూరుకుపోవడం.. Gen Z లో పెరుగుతున్నకొత్త ధోరణి!
X

దిశ, ఫీచర్స్ : కారణాలేమైనా తాము లైఫ్‌లో ఎంజాయ్ చేయాలన్న ఆలోచన యువతలో అధికంగా కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజు రోజుకూ విస్తరిస్తున్న మార్కెట్ కల్చర్ వారిని బాగా అట్రాక్ట్ చేస్తోంది. వస్తు వ్యామోహం ఇప్పుడొక నయా ట్రెండ్‌గా మారుతూ Gen Z‌ను (1997-2012 మధ్య జన్మించిన వారు) ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతోందని పలువురు పేర్కొంటున్నారు. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ కూడా ఇదే పేర్కొన్నది. అవసరాల కోసం కొన్ని సార్లు, అవసరాలకు మించి మరికొన్నిసార్లు ఖర్చు చేయడం, సమయానికి డబ్బు లేకున్నా క్రెడిట్ కార్డులు వినియోగించి మరీ ఖర్చు చేయడం వంటివి యువతను రుణ సంక్షోభంలోకి నెడుతున్నాయి. దీంతో పాత తరాలు, మిలీనియల్స్ కంటే కూడా జనరేషన్ జెడ్‌లో జీవన వ్యయం పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది యువత కోవిడ్ -19 మహమ్మారి దీర్ఘకాలిక ప్రభావాల్లో చిక్కుకుపోవడం, ఆ తర్వాత పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి కారణాలతో తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు ఫ్రీ ఆన్‌లైన్ ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థ క్రెడిట్ కర్మ (Credit Karma) వెల్లడించింది. గత పదేండ్ల కాలంలోనే జనరేషన్ జెడ్ (Generation Z) జీవన వ్యయం దాదాపు 32 శాతం పెరిగినట్లు పేర్కొన్నది. ఆహారం, ఇంటి ఖర్చులు, వివిధ అవసరాల నేపథ్యంలో సమయానికి డబ్బులు లేకపోవడంతో అప్పులు చేస్తున్న జనరేషన్ జెడ్ ఆ తర్వాత దానిని తీర్చే మార్గంలేక, తగిన ఆదాయం రాక ఇబ్బంది పడుతోంది. చివరికి రుణాలు చెల్లించడం అసాధ్యం అనే భావనకు వస్తోంది. దీంతో లాస్ట్ చాన్స్‌గా ఉన్న క్రెడిట్ కార్డును గీకేసి మొత్తం డబ్బును వాడేస్తోంది. ఫలితంగా మరిన్ని రుణాలు పేరుకుపోతున్నాయి.

ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం..2018లో జనరేషన్ జెడ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఖర్చు చేయగల శక్తి 143 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. కానీ.. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి ప్రభావం కారణంగా అది పడిపోతూ వచ్చింది. ఎంట్రీ లెవెల్ జాబ్స్ కూడా తగ్గిపోవడం, ఉన్న ఉద్యోగాలను కోల్పోవడం, ఆ తర్వాత సరైన ఉద్యోగాలు దొరకకపోవడం, దొరికినా తగిన ఆదాయం రాకపోవడం యువతను కష్టాల్లోకి నెట్టింది. ఓ వైపు జీవన వ్యయం పెరగడం, మరోవైపు అదే లెవల్లో ఖర్చులు, అప్పులు పెరగడంతో ప్రస్తుతం ఒక విధమైన డైలమాలో యువత కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో యువత ఆర్థికంగా నిలదొక్కుకునే విధానాలు ప్రపంచ వ్యాప్తంగా రావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి దాకా అప్పులు చేయడం, అవసరాలకు క్రెడిట్ కార్డులు యూజ్ చేయడం, మళ్లీ అప్పుల్లో కూరుకుపోవడం లాంటి సంక్షోభాలు ఒక సర్కిల్ మాదిరి కొనసాగుతూనే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed